ఆకలి చావు..బయోమెట్రిక్ లోపంతో ఆగిన రేషన్

ఆకలి చావు..బయోమెట్రిక్ లోపంతో ఆగిన రేషన్

రాంచీ​: ఎన్నికల ఖర్చు రూ.60వేల కోట్లు దాటిన దేశంలో ఆకలిచావులు ఇంకా ఆగలేదు. బుక్కెడు బువ్వ దొరక్క మరో బడుగుజీవి ప్రాణాలు విడిచాడు.  ఇండియాలోని 40 శాతం మినరల్స్​ని తనలో దాచుకున్న జార్ఖండ్​లోనే జరిగిందీ సంఘటన. లోహర్​దగా జిల్లా లుర్గుమికాలా గ్రామానికి చెందిన రాంచరణ్​ ముండా(65) గురువారం కన్నుమూశాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. మూడ్రోలుగా ఏమీ తినకపోవడం వల్లే అతను చనిపోయాడని గ్రామస్తులు చెబుతున్నారు. రేషన్​ కార్డు ఉన్నా బయోమెట్రిక్​ మెషీన్​ పనిచేయకపోవడంతో మూడు నెలలుగా సరుకులు అందట్లేదని, చుట్టుపక్కలవాళ్లిచ్చిన పిండితో రోజులు నెట్టుకొచ్చామని, చివరి మూడురోజులు ఏమీ దొరక్క ఇంట్లో పొయ్యి కూడా వెలిగించలేదని రాంచరణ్​ కూతురు మీరా కుమారి చెప్పింది. తండ్రి చావు జరిపించడానిక్కూడా పైసల్లేవని కన్నీటిపర్యంతమైంది.

రేషన్​ షాపులో బయోమెట్రిక్​ మెషీన్ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లుర్గుమికాలా వాసులు తెలిపారు. ఆహార హక్కు కార్యకర్తల లెక్కల ప్రకారం జార్ఖండ్​లో గత నాలుగేండ్లలో చోటుచేసుకున్న 17వ ఆకలిచావు ఇది. తిండిలేక ప్రాణాలు కోల్పోయినవారంతా పేదగిరిజనులే. అయితే వాళ్లంతా ఆకలితో కాదు.. అనారోగ్యంతో మరణించారని తేల్చ డానికి గవర్నమెంట్​ ఆఫీసర్లు ప్రయాసపడుతుంటారనే ఆరోపణలున్నాయి. రాంచరణ్​ విషయంలోనూ అదే జరిగింది. అతనో తాగుబోతని, మద్యం కారణంగానే చనిపోయాడని లోకల్​ ఆఫీసర్లు తేల్చేశారు. ఆయుష్మాన్​ భారత్​, రేషన్​ కార్డు, పెన్షన్​ లబ్దిదారుల జాబితాలో రాంచరణ్​ కుటుంబం కూడా ఉందన్న జిల్లా కలెక్టర్​ సుధీర్​ కుమార్.. బయోమెట్రిక్​ మెషీన్​పై గ్రామస్తులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. ఆన్​లైన్​ సదుపాయం లేకుంటే ఆఫ్​లైన్​లోనైనా సరుకులు పంచాలని ఆదేశించామని, కొంతమంది డీలర్లు వాటిని పాటించడంలేదని, అలాంటివాళ్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ చెప్పారు. గతేడాది నవంబర్​లో దుమ్కా జిల్లాకు చెందిన కాళేశ్వర్​ సోరెన్​(45), అంతకుముందు సిమ్దేగా జిల్లాలో సంతోషి అనే 11 ఏండ్ల బాలిక ఆకలితో  ప్రాణాలు కోల్పోయారు.