
న్యూఢిల్లీ : ఢిల్లీలో తీవ్ర నీటి కొరత నెలకొంది. విపరీతమైన ఎండల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రజలకు అవసరమైన మేర నీళ్లను ప్రభుత్వం సరఫరా చేయలేకపోతున్నది. దీంతో నీళ్ల కోసం ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ నీటి అవసరాల కోసం హిమాచల్ ప్రదేశ్ విడుదల చేస్తున్న మిగులు జలాలను హర్యానా సర్కార్ ఆపుతున్నదని, ఆ వాటర్ రిలీజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీ వాటర్ మినిస్టర్ ఆతిశీ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, హర్యానాలోని బీజేపీ సర్కార్, హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ సర్కార్ ను ప్రతివాదులుగా చేర్చారు.
నీటి ఎద్దడి కారణంగా ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను పిటిషన్ లో వివరించారు. ‘‘అవసరమైన నీళ్లను పొందడం ప్రతి ఒక్కరి హక్కు. కానీ ప్రస్తుతం ఢిల్లీలో నీళ్ల సంక్షోభం నెలకొంది. విపరీతమైన ఎండల కారణంగా తాగేందుకు సరిపడా నీళ్లను కూడా ప్రజలు పొందలేకపోతున్నారు. సిటీలోని చాలా ప్రాంతాల్లో 50 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాటర్ కు డిమాండ్ పెరిగింది. నీటి వృథాను అరికట్టి, విడతల వారీగా సరఫరా చేస్తున్నప్పటికీ కొరతను తీర్చలేకపోతున్నాం. ప్రజలకు సరిపడా సప్లై చేయాలంటే అదనపు జలాలు కావాలి” అని వివరించారు.
హిమాచల్ ఇస్తున్నా విడుదల చేయట్లే..
వేసవిలో నీటి కొరతను అధిగమించేందుకు పరిష్కారం కనుగొన్నామని, మిగులు జలాలను ఢిల్లీకి విడుదల చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుందని పిటిషన్ లో ఆతిశీ పేర్కొన్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్ విడుదల చేసే మిగులు జలాలు హర్యానా గుండా ఢిల్లీలోకి రావాల్సి ఉంటుందని తెలిపారు. ‘‘హిమాచల్ ప్రదేశ్ విడుదల చేసే మిగులు జలాలు హర్యానాలోకి వస్తాయి. ఆ జలాలను హర్యానా సర్కార్ వజీరాబాద్ బ్యారేజీ వద్ద ఢిల్లీకి విడుదల చేయాలి. కానీ హర్యానా వాటిని విడుదల చేయడం లేదు. హిమాచల్ విడుదల చేసే మిగులు జలాలతో పాటు వజీరాబాద్ నుంచి ఢిల్లీకి నిరంతరం నీటి సరఫరా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలి” అని విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం కోసం ఈ పిటిషన్ దాఖలు చేయలేదని, ప్రస్తుతం వేసవిలో ఏర్పడిన నీటి ఎద్దడిని అధిగమించేందుకు దాఖలు చేశామని, దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
కేంద్రానికి ఆతిశీ లెటర్..
ఉత్తరప్రదేశ్ నుంచి గానీ, హర్యానా నుంచి గానీ ఢిల్లీకి నీటిని విడుదల చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆప్ సర్కార్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఢిల్లీ వాటర్ మినిస్టర్ ఆతిశీ లెటర్ రాశారు. ‘‘యమునా నది నీళ్లపైనే ఢిల్లీ ఆధారపడి ఉంది. కానీ కొన్ని రోజులుగా హర్యానా సర్కార్ నీళ్లను విడుదల చేయడం లేదు. వజీరాబాద్ బ్యారేజీలో నీటి మట్టం సాధారణం కంటే కిందికి పడిపోయింది. దీనిపై హర్యానా సీఎంకు లేఖ రాసినా స్పందించడం లేదు. ఈ విషయంలో కేంద్రం కలుగజేసుకుని ఢిల్లీకి నీటి సరఫరా జరిగేలా చూడాలి” అని విజ్ఞప్తి చేశారు.