
ముగ్గురు దోషుల విడుదలను సవాల్ చేయనున్న ఢిల్లీ సర్కార్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ఏరియా చావ్లా గ్రామం వద్ద 2012లో ఓ యువతిపై రేప్, మర్డర్ కు సంబంధించిన కేసులో ముగ్గురు దోషులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఈ కేసులో దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదించేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నియామకానికి కూడా ఎల్జీ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఉత్తరాఖండ్ కు చెందిన 19 ఏండ్ల యువతి గుడ్ గావ్ లోని సైబర్ సిటీలో పని చేసేది.
ఓ వ్యక్తి ప్రపోజల్ కు ఆమె ఒప్పుకోకపోవడంతో అతను కక్షగట్టాడు. మరో ఇద్దరితో కలిసి 2012 ఫిబ్రవరి 9న ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత దారుణంగా హింసించి, అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసులో ఆ ముగ్గురు దోషులకు ట్రయల్ కోర్టు మరణ శిక్ష వేయగా, ఢిల్లీ హైకోర్టు కూడా సమర్థించింది. అయితే, దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో ముగ్గురినీ కోర్టు విడుదల చేసింది. ఈ కేసులో సరైన ఆధారాలు సమర్పించలేదని, కేవలం మోరల్ కన్విక్షన్ ఆధారంగా నిందితులను శిక్షించలేమని సుప్రీంకోర్టు ఈ నెల 7న తీర్పు చెప్తూ దోషులను విడుదల చేయాలని ఆదేశించింది.