రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ ​బిల్లు ఆమోదం.. అనుకూలంగా 131 ఓట్లు

 రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ ​బిల్లు ఆమోదం.. అనుకూలంగా 131 ఓట్లు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 102 ఓట్లు పడ్డాయి. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. సాంకేతిక సమస్యతో స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ నిర్వహించారు. డివిజన్ కు విపక్షం పట్టుబడడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. ఎన్డీఏకు వైసీపీ, బీజేడీ, బీఎస్పీ, టీడీపీ సభ్యులు మద్దతు తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు ఓట్లు వేశారు. ఇప్పటికే లోక్ సభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రపతి ఆమోదంతో చట్టంకానుంది ఢిల్లీ సర్వీసెస్​ బిల్లు.  

బిల్లుపై అమిత్​ షా ఏమన్నారంటే.. 

ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించలేదని హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో గ్రూప్‌ ‘ఎ’ అధికారుల నియామకాలు, క్రమశిక్షణ చర్యలకుగానూ గత మేలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రాజ్యసభ ప్రతిపక్ష సభ్యులు తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. 

తాజాగా ఆ ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకొచ్చిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. సోమవారం (ఆగస్టు 8న) అమిత్‌ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సుప్రీంకోర్టు తీర్పును ఏ విధంగానూ ఉల్లంఘించలేదన్నారు. దేశ రాజధానిలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలనను అందించాలన్న లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చామని వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును మొదటిసారి తీసుకొచ్చారని అమిత్‌ షా అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన బిల్లులోని ఏ ఒక్క నిబంధనను మార్చలేదన్నారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంతంలోని అధికారుల, ఉద్యోగుల విధులు, ఇతర సర్వీసులకు సంబంధించి నిబంధనలు రూపొందించేందుకు కేంద్రానికి అధికారం వస్తుందన్నారు. జాతీయ రాజధాని ప్రాంత బిల్లు (సవరణ)-2023కు గత వారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఢిల్లీ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. దీనిని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు. 

దేశ రాజధానిలోని పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ సర్కార్​ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ సహా పలు విపక్షపార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చాయి.

ఢిల్లీలో గ్రూపు -ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను ‘నేషనల్‌ కేపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీ’ ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ప్రతిపాదన. దీనిపై ఆప్‌ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మే 11న తీర్పు వెలువడింది. ఈ క్రమంలో అదే నెల 19న కేంద్రం ఆర్డినెన్సు జారీ చేసింది.