ఆర్టీసీ కార్మికులను పొమ్మనలేక పొగబెడుతున్నరు

ఆర్టీసీ కార్మికులను పొమ్మనలేక పొగబెడుతున్నరు

కరీంనగర్​, వెలుగు: కరీంనగర్ డిపోలో సీనియర్ మెకానిక్ గా పని చేస్తున్న వ్యక్తిని వీఆర్ఎస్ తీసుకోవాలంటూ కొద్దిరోజులుగా డిపో అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఆయన వినకపోవడంతో పనిలో ఒత్తిడి తీసుకొస్తూ.. మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. సాధారణంగా మెకానిక్‌ కింద ఇద్దరిని సహాయకులుగా ఇస్తారు. కానీ ఈయనకు మాత్రం ఒక్కరిని కూడా ఇవ్వకుండా మొత్తం పని భారం మోపుతున్నారు. పనులు ఆలస్యం అయితే చార్జీ మెమోలు ఇస్తున్నారు. దీనికి తోడు ఎప్పుడైనా అవసరం వచ్చి సెలవులు అడిగితే..   ఇంకా ఉద్యోగం చేయడం అవసరమా అంటూ సూటిపోటి మాటలతో ఆఫీసర్లు విసిగిస్తున్నారు. వీఆర్ఎస్ తీసుకోవాలంటూ నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

ఆర్టీసీ కార్మికులను పొమ్మనలేక పొగబెడుతున్నారు. ఎంత వీలైతే అంతమంది ఉద్యోగులను బయటకు పంపించాలని చూస్తున్నారు. యాజమాన్యం లెక్కల ప్రకారం టీఎస్​ఆర్టీసీలో 45,600 మంది ఉద్యోగులు ఉన్నారు. 20 ఏండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఆర్టీసీ కార్మికులు ఎవరైనా వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మే నెలలో సర్క్యులర్ జారీ చేశారు. రెండు నెలలు చూసినా కార్మికుల నుంచి స్పందన లేకపోవడంతో మరోసారి సర్క్యులర్లు పంపారు. అయినా స్పందన అంతంతమాత్రంగానే ఉండడంతో నేరుగా అన్ని డిపోల్లో హెడ్ క్లర్క్ దగ్గర రిజిస్టర్ పెట్టి విల్లింగ్ ఉన్న వారందరి పేరు, వివరాలు రాయమని చెప్పారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోల్లో కలిపి సుమారు 2,600 మంది పేర్లు రాశారు. దీన్ని చూసి జులై నెల  మూడో వారంలో వీఆర్‌ఎస్ కోసం కొన్ని గైడ్ లైన్స్ రూపొందించి ఆర్టీసీ పరిధిలోని అని డిపోల మేనేజర్లకు లెటర్లు పంపించారు. విల్లింగ్ ఉన్నవారి నుంచి ఒక ఫార్మాట్ లో వివరాలను తీసుకున్నారు. దీనికి జులై 31 గడువుగా పెట్టారు. అనారోగ్య, ఇతరత్రా సమస్యలు ఉన్నవారిని వివరాలు రాయాలని ఒత్తిడి తేవడంతో  రాష్ట్రవ్యాప్తంగా 530 మంది వివరాలు అందించారు. 

బెనిఫిట్స్ పై డౌట్స్ 

2017, 2018లో రిటైరైన ఆర్టీసీ కార్మికులకు ఇంకా లీవ్స్ కు సంబంధించిన బెన్ ఫిట్స్ అందలేదు. దీనికి తోడు రెండు పీఆర్సీలు, ఏడు డీఏలు బకాయి ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకుండా వీఆర్ఎస్ తీసుకుంటే తీవ్రంగా నష్టపోతామనికార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఐదేండ్లలోపు సర్వీస్ ఉంటే ఏడాదికి 15 రోజుల జీతం, ఐదు నుంచి పదేండ్లలోపు సర్వీస్ ఉంటే ఏడాదికి 20 రోజుల జీతం, 10 ఏండ్లకు పైబడి ఉంటే 25 రోజుల జీతం కట్టిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ ఇవేం తమకు సరిపోవని, ప్రభుత్వం అన్ని రకాలుగా బకాయిలు చెల్లించాలని, అవీ ముందుస్తుగా  ఇస్తామంటేనే వీఆర్ఎస్ తీసుకునేందుకు ఆలోచిస్తామని కార్మికులు అంటున్నారు. 

పిలిచి మరీ వేధిస్తున్నరు 

వీఆర్ఎస్ పై కార్మికులకు ఉన్న డౌట్స్ క్లారిఫై చేయండని అధికారులు చెబితే.. కిందిస్థాయిలో మాత్రం కార్మికులపై ఒత్తిడి తెచ్చి వీఆర్ఎస్ తీసుకునేలా ఒప్పిస్తున్నారు. వీఆర్ఎస్​ఎప్పుడు తీసుకుంటారని ఒక్కొక్కరిని ఆఫీస్​కు పిలిచి మరీ ఒత్తిడి తెస్తున్నారు. కార్మికులు రోజులానే డ్యూటీ చేయడానికి డిపోకు వెళ్లగానే ఆర్ఎం ఆఫీస్ నుంచి కాల్​వచ్చింది వెళ్లమని డిపో అధికారులు  చెబుతున్నారు. అక్కడికి  వెళ్లేసరికి డిపో మేనేజర్​తోపాటు అకౌంట్​ఆఫీసర్,​ ఇతర అధికారులు రెడీగా ఉంటున్నారు.  ముందుగా   ఎప్పుడు అపాయింట్​అయ్యావు .. ఏం  చదువుకున్నావు.. ప్రస్తుతం చదువుకుంటున్నారా.. ఇంట్లోవాళ్లు ఏం ఉద్యోగం చేస్తారు.. పిల్లలు ఏం చదువుతున్నారు వంటి కుశలప్రశ్నలతోనే అన్ని  వివరాలు రాబడుతున్నారు. తర్వాత ఇంకా ఎంత సర్వీస్​ ఉంది.. అప్పటివరకు పనిచేయడం ఎందుకు.. వీఆర్ఎస్​ తీసుకోవచ్చు కదా అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. తర్వాత మరొకరు మాట్లాడుతూ వీఆర్ఎస్​ తీసుకుంటే ఒకేసారి  బాగా  డబ్బులు వస్తాయి, హాయిగా ఇంటివద్దనే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, లేదా డబ్బులు బ్యాంక్​లో వేసుకొని ఏదైనా ప్రైవేటు  ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందంటూ గంటల తరబడి  కార్మికులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ఒప్పుకోని వారిని  మీవల్ల సంస్థకు ఎలాంటి లాభం లేదని, కండక్టర్​అయితే టార్గెట్​కలెక్షన్​ తేవడం లేదని, డ్రైవర్​ అయితే ఇంధనం ఆదా పేరుతో  ఆక్యుపెన్సీ తేవడం లేదని వేధిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరిని ఇప్పటికే రెండు మూడుసార్లు అడిగినట్లు సమాచారం. అంతేకాకుండా డ్యూటీ దిగగానే డిపోలోనే ఆపి..  ఇంకా ఎన్ని రోజులు డ్యూటీ చేస్తారు.. వీఆర్​ఎస్​తీసుకోవచ్చుగా అంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని  కార్మికులు ప్రశ్నిస్తే పైనుంచి ఆర్డర్స్​అలా ఉన్నాయంటూ అధికారులు చెప్తున్నారు. 

బెనిఫిట్స్​పై స్పష్టమైన హామీ ఇవ్వాలి

ఆర్టీసీ కార్మికులను వీఆర్ఎస్ తీసుకోవాలంటూ పరోక్షంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్​ ఇప్పటికే పెండింగ్​లో ఉన్నాయి. వీఆర్ఎస్ తీసుకుంటే అవన్నీ ఇస్తారా అనే అనుమానాలు కార్మికులకు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఆర్టీసీలో కారుణ్య నియామకాల విషయంలో జాయిన్ అయిన మూడేండ్ల వరకు కన్సాలిడేటేడ్ పే ఇవ్వడం, తర్వాత టెస్టు పెట్టి రెగ్యులర్ చేయడం అన్యాయం. నేరుగా సర్వీసులు రెగ్యులర్ చేయాలి. 
– టీఆర్ రెడ్డి, ఈయూ రీజనల్ సెక్రటరీ, కరీంనగర్