శబరిమల రద్దీ సమస్యపై 300కు పైగా కేసులు - పినరయి సర్కార్కు హైకోర్టు కీలక ఆదేశాలు

శబరిమల రద్దీ సమస్యపై 300కు పైగా కేసులు - పినరయి సర్కార్కు హైకోర్టు కీలక ఆదేశాలు

శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో శబరిమలకు తరలివెళ్తున్నారు. అయితే.. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. భక్తులకు తలెత్తున్న ఇబ్బందులపై కేరళ హైకోర్టు దేవస్థానం బెంచ్ సుమోటో కేసును స్వీకరించింది.

మండలం, మకరజ్యోతి కాలంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎరుమెలిలోని హోటళ్లలో ధరల బోర్డులు పెట్టాలని, పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ కు సూచించింది.

పార్కింగ్ స్థలాల్లో అధిక డబ్బులు వసూలు చేయకుండా చూసుకోవాలని ఆదేశించింది. లైసెన్స్ లు లేకుండా పార్కింగ్ స్థలాలు నిర్వహిస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని చెప్పింది. భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఇప్పటికే రిజిస్ట్రార్ కు సుమారు 300కు పైగా ఫిర్యాదులు వచ్చాయని హైకోర్టు దేవస్థానం బెంచ్ తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పింది. అయితే.. ఈ అంశంపై స్పందించిన పినరయి ప్రభుత్వం.. రద్దీ నిర్వహణలో తలెత్తిన లోపాన్ని భక్తులు ఇబ్బందులుగా చిత్రీకరిస్తున్నారని చెప్పింది. 

నవంబర్ 17వ తేదీన మండలం- మకరజ్యోతి కాలం ప్రారంభం కావడం వల్ల భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో రద్దీ నిర్వహణలో లోపం తలెత్తింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇతర రాష్ట్రాల భక్తులు అయ్యప్ప దర్శనం కాకుండానే పందళం వలియకోయికల్ ధర్మశాస్ర్త ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు.  ప్రైవేలు వాహనాలను బోలక్కల్ వరకే అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని పంబాకు ప్రభుత్వ బస్సుల్లో వెళ్లాలని సూచించారు అక్కడి అధికారులు. 

మరోవైపు.. భక్తులు ఇబ్బందులు పడుతుండడంతో కేరళ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పినరయి సర్కార్ తీరుపై విమర్శలు చేస్తున్నాయి. సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపిస్తున్నాయి.