- అన్వేష్ రెడ్డికి టికెట్ ఇవ్వండి
- కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల విజ్ఞప్తి
- భట్టి, కోమటిరెడ్డి, మధుయాష్కీకి వినతి పత్రాలు
హైదరాబాద్, వెలుగు : కిసాన్ కాంగ్రెస్ సెల్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆ శాఖ జిల్లాల అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గురువారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీను కలిసి వినతి పత్రాలు అందజేశారు. రైతు సమస్యలపై ఎనిమిదేండ్లుగా కిసాన్ కాంగ్రెస్ కృషి చేస్తున్నదని వారు గుర్తుచేశారు. పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు చేసే మేలును వివరిస్తున్నదని చెప్పారు. రైతులను పార్టీ వైపుకు ఆకర్షించేలా కిసాన్ కాంగ్రెస్ ఎంతో కృషి చేస్తున్నదని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే అన్వేష్ రెడ్డిపై ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులను బనాయించిందని, అయినా ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కవితకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమానికి అన్వేష్ రెడ్డి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. రైతుగా, రైతు నేతగా అందరిలోనూ ఉంటున్న అన్వేష్ రెడ్డికి ఈసారి టికెట్ ఇప్పించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అన్వేష్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.