డోర్ కర్టెన్ మెడకు చుట్టుకొని బాలుడి మృతి

డోర్ కర్టెన్ మెడకు చుట్టుకొని బాలుడి మృతి

మేడ్చల్ జిల్లా: కరోనా సెలవులతో దాదాపు ఏడాదికిపైగా పిల్లలకు స్కూల్లు, కాలేజీలు లేక ఆటలెక్కువైపోయియి. అయితే ఆటలాడుతున్న పిల్లలపై ఓ కంట కనిపెట్టకపోతే ప్రమాదాలను కోరితెచ్చుకోవడమేనని పలు ఘటనలు రుజువు చేశాయి. అదేకోవలోనే ఓ విచిత్రమైన ప్రమాదం, బహుశా ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా జరగనిది మన వద్ద జరిగింది. ఓ అమాయకమైన బాలుడి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ పరిధిలో జరిగింది. 

బ్రూక్ బాండ్ కాలనీలో గురువారం పిల్లలు ఆడుకుంటున్నారు. ఏడాదిగా స్కూళ్లకు సెలవులు.. మరికొద్ది రోజుల్లో తిరిగి తెరుస్తున్నారన్న నేపధ్యంలో పిల్లలు హుషారుగా ఆడుకుంటున్నారు. ఎండ లేదు.. మబ్బులు కమ్మిన చల్లటి గాలులతో వాతావరణం మరింత ప్రోత్సాహకరంగా ఉండడంతో పిల్లలు హుషారెత్తి ఆడుకుంటున్నారు. పనుల్లో ఉన్న తల్లులు, పిల్లల ఆటల్ని గమనిస్తూ ఆనందిస్తున్నారు.

అయితే ఇంతలో ఊహించనిది జరిగింది. ఎస్.భార్గవ్ (11) ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు డోర్ కర్టెన్ మెడకు చుట్టుకుంది. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంటే గమనించి హుటాహుటిన చికిత్స నిమిత్తం ఘట్ కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే  అప్పటికే బాలుడి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.