శ్రీలంకలో ధరల దడ

శ్రీలంకలో ధరల దడ
  • కరెంటుకు కటకట
  • ఐఎంఎఫ్​ సాయం కోసం ఎదురు చూపులు

మన పొరుగుదేశం శ్రీలంక ఆర్థిక పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. ఇండియా, చైనా వంటి దేశాలు సాయం చేస్తున్నా, అక్కడి జనం కష్టాలకు అంతే ఉండటం లేదు. కడుపు నిండా తిండిలేదు. కిలో పిండికి కూడా వంద రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన దుస్థితి. బంకుల్లో పెట్రోల్​ దొరకదు. గ్యాస్​ సిలిండర్​ ధర చుక్కల్లో ఉంది. స్టూడెంట్లు ఎగ్జామ్స్​ రాసేందుకు పేపర్​ దొరక్కపోవడంతో వాటిని క్యాన్సిల్​ చేశారు. న్యూస్​ ప్రింట్​ కొరతతో న్యూస్​ పేపర్లు ప్రింటే కావడం లేదు. చెప్పుకుంటూ పోతే ఎన్నో కష్టాలు.. రోజుకు కనీసం 13 గంటలు కరెంటు తీసేస్తున్నారు. దీంతో ప్రజలు సర్కారుపై తిరగబడుతున్నారు. వీధులన్నీ అట్టుడుకుతున్నాయి. 

న్యూఢిల్లీ: డాలర్ల నిల్వలు అడుగంటడంతో శ్రీలంక ఎకానమీ దారుణంగా దెబ్బతింది. తిండి, గ్యాస్​, పెట్రోల్,కరెంటు.. ఏదీ తగినంత సప్లై కావడం లేదు.ఇంధన దిగుమతుల కోసం విదేశీ మారకద్రవ్యాన్ని పొందేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశం,  చైనా నుండి తాజాగా మరోసారి అప్పులు అడుగుతోంది. ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ నుండి బెయిల్​ ఔట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మార్చి 8 నుండి శ్రీలంక కరెన్సీ డాలర్‌‌‌‌‌తో పోలిస్తే దాదాపు  రూ. 90 తగ్గింది. 2019 సంవత్సరంలో చర్చిలపై వరుస దాడులు జరిగినప్పటి నుంచి పర్యాటకుల రాక బాగా తగ్గింది. దీంతో డాలర్లకు కొరత ఏర్పడింది. శ్రీలంకలో విదేశీ ఆదాయానికి కీలకం టూరిజమే! 2019 చివరి నాటికి 7.6 బిలియన్ డాలర్లు (రూ. 57,787 కోట్లు)గా ఉన్న శ్రీలంక విదేశీ నిల్వలు ఇప్పుడు 2.3 బిలియన్ డాలర్ల (రూ. 17,488 కోట్లు)కు పడిపోయాయి. వీటిలో వాడకానికి ఉపయోగపడేవి 300 మిలియన్ డాలర్లు (రూ. 2,281 కోట్లు) మాత్రమే. శుక్రవారం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. మార్చిలో ఇన్​ఫ్లేషన్​ 18.7 శాతానికి చేరుకుంది. ఇది వరుసగా ఆరో నెలవారీ రికార్డు. ఆహార ధరలు రికార్డు స్థాయిలో 30.1 శాతం పెరిగాయి. కొలంబో తన 51 బిలియన్ల డాలర్ల అప్పుపై 7 బిలియన్​ డాలర్ల వడ్డీ కట్టాలి. ఇందుకోసం ఫారిన్​ కరెన్సీని ఆదా చేసేందుకు గత మార్చి నుంచి దిగుమతులపై  నిషేధాన్ని విధించింది. దీంతో 2000 సంవత్సరంలో 33 శాతంగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు 12 శాతానికి పడిపోయాయి. 

చిన్న దేశానికి పెద్ద కష్టాలు..

శ్రీలంక ప్రస్తుతం చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెట్రోల్​, డీజిల్, వంటగ్యాస్‌‌, నిత్యావసరాల కొరత, గంటల తరబడి కరెంటు కోతలతో ప్రజలు వారాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. 2.2 కోట్ల జనాభా కలిగిన శ్రీలకంలో రోజుకు 13 గంటల వరకు కరెంటును తొలగిస్తున్నారు. పెట్రోల్​ కోసం గంటల తరబడి క్యూలలో నిల్చోవాల్సి వస్తోంది. ప్రెసిడెంట్​ రాజపక్సే మాత్రం ఈ పరిస్థితికి తాను బాధ్యుడిని కాదని అంటున్నారు. విదేశీ మారక ద్రవ్య సంక్షోభం తాను సృష్టించినది కాదని, కరోనా వల్ల  ఆర్థిక మాంద్యం ఏర్పడిందని చెప్పారు. పర్యాటక ఆదాయం పడిపోవడంతో డాలర్లకు కటకట ఏర్పడిందని వాదిస్తున్నారు.  తీవ్ర ఆర్థిక సంక్షోభం మధ్య వందలాది మంది ప్రజలు శుక్రవారం ప్రెసిడెంట్​ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజపక్సే శుక్రవారం భద్రతా దళాలకు చాలా అధికారాలను ఇస్తూ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఐఎంఎఫ్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ గెర్రీ రైస్ గురువారం వాషింగ్టన్‌‌లో విలేకరులతో మాట్లాడుతూ,  ప్రెసిడెంట్​తమ్ముడు, ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సతో మరికొన్ని రోజుల్లో చర్చలు ఉంటాయని తెలిపారు.