ఏడుపాయల్లో జాతర పనులు స్లో

ఏడుపాయల్లో జాతర పనులు స్లో
  •     షవర్​లకు మోటర్లు ఫిట్​చేయలే
  •     టాయిలెట్స్​కు డోర్లు లేవు
  •     పందుల సంచారంతో  పారిశుద్ధ్య లోపం

మెదక్, పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల జాతర ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. జాతర ప్రారంభానికి ఇంకా రెండు రోజులే ఉండగా చాలా పనులు పెండింగ్​లో ఉన్నాయి. మెదక్​ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా పెద్దఎత్తున జాతర జరుగుతుంది. జాతరను ప్రభుత్వం స్టేట్​ ఫెస్టివల్​గా నిర్వహిస్తోంది. ఈసారి మార్చి 1న శివరాత్రి ఉత్సవాలు, 2న బండ్ల ఊరేగింపు, 3న రథోత్సవం జరగనున్నాయి. జాతరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర నుంచి ​భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.కోటి శాంక్షన్​ చేసింది. అయితే ఏ పనులకు ఎంత అలాట్​ చేశారనేదానిపై క్లారిటీ లేదు. 

26లోపే కంప్లీట్​ కావాలని చెప్పినా..

జాతర ఏర్పాట్లపై కలెక్టర్ హరీశ్, మెదక్​ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి సంబంధిత డిపార్ట్​మెంట్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తాగునీటి వసతి, టాయిలెట్స్​ సౌకర్యం, స్నానఘట్టాల దగ్గర మహిళలు దుస్తులు మార్చుకునేందుకు టెంపరరీ రూంల ఏర్పాటు, నిరంతర కరెంట్​సరఫరాకు సంబంధించిన పనులు ఈ నెల 26వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం నాటికి చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఏడుపాయలకు వచ్చే భక్తులు మంజీరా జలాలతో పవిత్ర స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు పెద్దఎత్తున తరలి రావడాన్ని దృష్టిలో ఉంచుకుని 10 చోట్ల షవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే వనదుర్గా ప్రాజెక్ట్​ దగ్గర షవర్లకు నీరందించేందుకు ఇంకా మోటర్లు బిగించలేదు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేయలేదు. చెక్​డ్యాం సమీపంలోని షవర్ల దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగే ఏడుపాయల్లో రెండు పర్మినెంట్, మూడు సెమీ పర్మినెంట్​టాయిలెట్​యూనిట్లు ఉండగా, జాతర నేపథ్యంలో వివిధచోట్ల 33 టెంపరరీ టాయిలెట్​యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఆర్ డబ్ల్యూఎస్​ ఆఫీసర్లు చెప్పారు. అయితే టెంపరరీ టాయిలెట్స్​కు సున్నాలు వేసినప్పటికి తడకలు కట్టి డోర్​లు ఏర్పాటు చేసే పనులు ఇంకా కాలేదు. భక్తులకు మంచినీటి సౌకర్యం కోసం జాతర ప్రాంగణంలో వివిధ చోట్ల 350 ట్యాప్​లు ఏర్పాటు చేస్తామని ఆఫీసర్లు చెప్పారు. శనివారం నాటికి ఒక్కచోట కూడా ట్యాప్​లు ఏర్పాటు చేయలేదు. నిరంతర కరెంటు సరఫరాకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. జాతర ప్రాంగణంలోని నల్లా పాయింట్ల దగ్గర పలుచోట్ల పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 

ఈసారీ రెనోవేషన్​ కమిటీయే..

ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయానికి ప్రభుత్వం పాలక మండలిని నియమిస్తుంది. అయితే గత మూడేళ్లుగా పాలకవర్గం లేకుండానే జాతర కొనసాగుతోంది. 2018లో ఏర్పాటైన పాలక మండలి పదవీ కాలం 2019 సెప్టెంబర్​లో ముగిసింది. రాజకీయ కారణాలతో అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ ఏడుపాయల ఆలయానికి పాలకమండలిని నియమించకుండా టెంపరరీ రెనోవేషన్​ కమిటీలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ జాతరకు సైతం 13 మందితో ప్రభుత్వం రెనోవేషన్​ కమిటీ ఏర్పాటు చేసింది.