
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ఉద్యోగులకూ జీతాల తిప్పలు తప్పడం లేదు. సెప్టెంబర్ నెల సగం దాటినా ఇప్పటికీ ఆగస్టు నెల జీతాలు రాలేదు. జిల్లా ఆఫీసుల్లో పనిచేసే సిబ్బందికి రెండు నెలల నుంచివేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎస్ఏ పరిధిలో సుమారు 20 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో కేజీబీవీ టీచర్లతో పాటు స్కూల్ లెవెల్, క్లస్టర్, మండల, జిల్లా ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు. వీరందరికీ ఒకటో తారీఖున అందాల్సిన జీతాలు ఇప్పటికీ రాలేదు. మరోపక్క 33 జిల్లాల డీఈఓ ఆఫీసుల్లో పనిచేసే డీఎల్ఎంటీలు, సిస్టమ్ అనలిస్ట్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ పర్సన్స్, అటెండర్లకు జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన జీతాలు రాలేదు.
కొన్ని జిల్లాల్లో జూన్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చేదే తక్కువ జీతం.. అదీ రెగ్యులర్‌గా రాకపోవడంతో ఎంప్లాయీస్ అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి రెంట్లు, ఈఎంఐలు సకాలంలో కట్టలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తప్పుడు రిపోర్టులు పంపించడం వల్లే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని, దీంతోనే జీతాలు ఇవ్వలేకపోతున్నట్టు అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలకోసమైనా బడ్జెట్ ఇవ్వాలని ఎస్ఎస్ఏ ఉద్యోగులు కోరుతున్నారు.