బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ సొంత గడ్డపై తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. 2026 ఫిఫా వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం బ్యూనస్ ఎయిర్స్‌లోని లా బొంబోనెరా స్టేడియంలో జాంబియాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ మెస్సీకి స్వదేశంలో భావోద్వేగ వీడ్కోలుగా మారింది.
ఆట ప్రారంభంలో స్టేడియంలోని ఫ్యాన్స్ చేసిన నినాదాలకు మెస్సీ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. తన దేశం తరఫున ఆఖరిసారి స్వదేశంలో ఆడుతున్నానని తెలిసి గ్రౌండ్‌లోనే కళ్లు తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోరులో మెస్సీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. ఒక గోల్ చేయడంతో పాటు తోటి ఆటగాడు జూలియన్ అల్వారెజ్ గోల్ చేయడానికి పాస్ అందించాడు. మెస్సీ కెరీర్‌లో ఇది 902వ గోల్ కావడం విశేషం. ఈ పోరులో అర్జెంటీనా 5-0 తేడాతో జాంబియాపై ఘనవిజయం సాధించింది. ఇక, అమెరికాలో జరిగే వరల్డ్ కప్‌లో అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మెగా టోర్నీలో మెస్సీ ఆరోసారి కెప్టెన్‌గా ఆర్జెంటీనాను నడిపించబోతున్నాడు.
