తల కనిపించని మనిషి కథ.. అధికార మోహానికి ప్రతీక

తల కనిపించని మనిషి కథ.. అధికార మోహానికి ప్రతీక

‘తల కనిపించని మనిషి’ కథ ఆధునిక సమాజంలో అధికారానికి, పదవులకు మనిషి ఎంతగా బానిసవుతున్నాడో వ్యంగ్యంగా, లోతైన మానసిక విశ్లేషణతో చెప్పిన కథ. ఇది కేవలం ఒక వ్యక్తి భ్రమ కాదు.. పదవీ విరమణ తరువాత అనేక మంది ఎదుర్కొనే అస్తిత్వ సంక్షోభానికి ప్రతిరూపం. 

‘తల కనిపించని మనిషి’  సంక్షిప్త కథ 

నారాయణమూర్తి ఓ న్యాయమూర్తి. పదవీ విరమణ చేసిన మరుసటి రోజు అద్దంలో తన ముఖం కనిపించకపోవడం గమనిస్తాడు. అయితే అతని భార్యకు, ఇంటి ఆఫీసులో ఉన్న పర్సనల్ సెక్రటరీకి, అటెండర్‌‌‌‌కు మాత్రం అతని ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అందరికీ కనిపిస్తున్న తన ముఖం తనకే ఎందుకు కనిపించడం లేదో అతనికి అర్థం కాదు. దాంతో అతడు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతాడు.ఆదుర్దాగా బెడ్ రూంలోకి వస్తాడు. బెడ్ రూం తలుపు పెట్టేస్తాడు. మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. చెన్నైలో ఉన్న తన స్నేహితుడు వీరేందర్‌‌‌‌కి ఫోన్ చేస్తాడు. వీరేందర్ సైకాలజీ ప్రొఫెసర్. నారాయణమూర్తికి సన్నిహిత మిత్రుడు. వీరేందర్ లైన్ లోకి వస్తాడు. వీరేందర్‌‌‌‌కి విషయం అంతా చెబుతాడు. ఏడ్చినంత పనిచేస్తాడు. అసలు విషయం అర్థమవుతుంది వీరేందర్‌‌‌‌కి.‘మూర్తీ!.. భయపడకు. కుర్చీతోనే నీ ముఖంలో వెలుగు ఉండేది. అది పోయింది. కుర్చీ మీద బాగా కాంక్ష ఉన్న వ్యక్తులకు, అధికార దర్పాలకు బాగా అలవాటుపడిన వ్యక్తులకు ఇలా అవడం సహజమే. పదవీ విరమణ చేసిన తరువాత ఇలా కావడం అత్యంత సహజం. నిన్న నువ్వు పదవీ విరమణ చేశావు కదా! అందుకని అలా అనిపిస్తుంది’ అని చెప్తాడు వీరేందర్.

‘ఈ సమస్యకు పరిష్కారం లేదా?’ ఆదుర్దాగా అడుగుతాడు  నారాయణమూర్తి. ‘ఆందోళన చెందకు. ఇలాంటి పదవి మరొకటి సంపాదించు. గట్టిగా ప్రయత్నం చేస్తే అది పెద్ద విషయం కాదు నీకు. అప్పుడు ఈ సమస్య సమసిపోతుంది. ఒకవేళ అది కానిపక్షంలో నీ అధికార దర్పం కొనసాగే విధంగా ప్రభుత్వం నుంచి ఓ జీవోని తెప్పించుకో. నీ సమస్యకు ఇవి రెండే పరిష్కారాలు’ అంటాడు వీరేందర్. ఆ దిశగా ఇదివరకే మొదలు పెట్టిన చర్యలను మూర్తి మరింత వేగం చేస్తాడు.

ఇదీ కథ సారాంశం.

ఈ పరిస్థితికి కారణం నారాయణమూర్తి అధికార పదవికి అలవాటుపడటమేనని చెప్పకనే చెబుతాడు వీరెందర్. పదవితో వచ్చిన వెలుగే అతని ముఖమని, పదవీ విరమణతో ఆ వెలుగు పోయిందని పరోక్షంగా చెబుతాడు. మళ్లీ మరో పదవి పొందితే లేదా అధికార ప్రభావం కొనసాగే మార్గం కనుక్కుంటే సమస్య తొలగిపోతుందని సూచిస్తాడు. పదవీ కాంక్ష ఉన్న న్యాయమూర్తికి ఇవి అర్థం కావు.దాంతో నారాయణమూర్తి మళ్లీ అధికారాన్ని పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అధికార మోహం మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా మసకబారుస్తుందో వ్యంగ్యంగా ఈ కథ ద్వారా చెబుతాడు రచయిత.

ప్రధాన భావన

ఈ కథలో “ముఖం” అనేది వ్యక్తిత్వానికి ప్రతీక. నారాయణమూర్తి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా తన అధికారంతో, పదవితో ముడిపెట్టుకున్నాడు. పదవి పోగానే తన అసలైన స్వరూపం తనకే కనిపించకుండా పోయింది. ఇది అధికార మోహం మనిషిని ఎలా ఆందోళనకి గురి చేస్తుందో చెప్పే బలమైన కథ. 

మానసిక విశ్లేషణ

పదవిలో ఉన్నప్పుడు లభించే గౌరవం, వినయం, భయం.. ఇవన్నీ వ్యక్తిని భ్రమలోకి నెట్టేస్తాయి. నారాయణమూర్తి విషయంలో అదే జరిగింది. అతన్ని గౌరవించిన వారు అతన్ని కాదు, అతని కుర్చీని గౌరవించారు. కానీ, ఆ గౌరవాన్ని అతడు తన స్వంత విలువగా భావించాడు. పదవీ విరమణతో ఆ భ్రమ తొలగిపోయింది. దాంతో అతని మనస్సులో ఏర్పడిన భావనే తల కనిపించకపోవడంగా రచయిత చిత్రీకరించాడు.కథ చివర్లో వీరేందర్ ఇచ్చిన పరిష్కారం తీవ్ర వ్యంగ్యంతో నిండి ఉంది. మరో పదవి సంపాదించుకోవడం లేదా అధికార దర్పం కొనసాగించేలా జీవో తెప్పించుకోవడం.. ఇవి అసలు సమస్యకు పరిష్కారం కాదు. కానీ, నారాయణమూర్తి అదే దిశగా ప్రయత్నించడం ద్వారా, మనుషులు తమ లోపాలను సరిదిద్దుకోవడం కన్నా మళ్లీ అధికారంలోకి రావడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారని రచయిత ఎత్తిచూపుతాడు .

సామాజిక ప్రాసంగికత

ఈ కథ నేటి సమాజానికి అత్యంత ప్రాసంగికం. రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎక్కడ చూసినా పదవే వ్యక్తిత్వంగా మారిపోయిన ఉదాహరణలు కనిపిస్తాయి. పదవి ఉన్నంతవరకే విలువ, గౌరవం అనే భావన ఎంత ప్రమాదకరమో ఈ కథ హెచ్చరిస్తుంది. మళ్ళీ పదవి వస్తుందో  లేదోనని చాలామంది న్యాయమూర్తులు పదవిలో ఉన్నప్పుడే అధికార లాంచనాలు కొనసాగేలా జీవోలు తెప్పించుకుంటున్నారు. ఇలాంటి న్యాయమూర్తులు ఉన్న దేశంలో పదవిపోయిన వెంటనే తల కనిపించకపోవడం సహజం.

ముగింపు

‘తల కనిపించని మనిషి’ కథ ఒక వ్యక్తి కథ కాదు. అది అధికారానికి అలవాటుపడిన ప్రతి మనిషి కథ. పదవిపోయిన తరువాత కూడా తన స్వరూపాన్ని నిలబెట్టుకోలేని మనిషి ఎంత దయనీయుడో ఈ కథ స్పష్టంగా చూపిస్తుంది. నిజమైన వ్యక్తిత్వం పదవిలో కాదు, మనిషిలో ఉండాలనే బలమైన సందేశంతో ఈ కథ పాఠకుడిని ఆలోచనలో పడేస్తుంది.ఇది 2025లో నేను రాసిన కథే.

- డా. మంగారి రాజేందర్, 
కవి, రచయిత
9440483001