నష్టాల రైతు నుంచి బడా పారిశ్రామికవేత్తగా బ్రొయిన్
నష్టాల రైతు నుంచి బడా పారిశ్రామికవేత్తగా బ్రొయిన్పొలం పొమ్మంది.. దిగుబడి రానంది.. పెట్టిన పైసలూ రానన్నాయి.. మొక్కజొన్న పంట నష్టంతో ముంచేసింది. ఇల్లు గడిచే పరిస్థితి లేదు. కానీ అతడు బెదరలేదు. తన తండ్రి నేర్పిన ఆ పొలం పనులతోనే పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ఎంతలా అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ బయోఫ్యూయెల్ను తయారు చేస్తున్న కంపెనీ అతడిదే. ఎవరతడు? ఎలా ఎదిగాడు? ఆ కంపెనీ పేరేంటి?
జెఫ్ బ్రోయిన్కు ఇప్పుడు 53 ఏళ్లు. ఆయనకు 22 ఏళ్ల వయసులో బ్యాంకులో ఓ చిన్న ఉద్యోగిగా చేరాడు. అప్పుడు వాళ్లు మినెసొట్టాలో ఉండేవాళ్లు. తన తండ్రి లోవెల్ బ్రోయిన్.. వారసత్వంగా వచ్చిన పొలంలో మొక్కజొన్న పంటను వేసేవాడు. కానీ, అప్పట్లో (1980ల్లో) అమెరికాలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది. పెట్టిన పెట్టుబడులూ తిరిగొచ్చే పరిస్థితి లేదు. మొక్కజొన్న ధరలు బాగా పడిపోయాయి. వాళ్లు పండించిన పంటల్లో 20 శాతం కొనేందుకు అమెరికా ప్రభుత్వం ముందుకొచ్చింది. అయినా అవేవీ రైతులకు అండగా నిలవలేదు. అందరితోపాటు బ్రోయిన్ కుటుంబమూ పంటతో చిత్తయింది. అందుకే కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగంలో చేరారు బ్రోయిన్. అయితే, కొందరు రైతులు మిగిలిన మొక్కజొన్న పంటతో బయో ఫ్యూయెల్‌ను తయారు చేస్తున్నారన్న విషయం బ్రోయిన్ తండ్రికి తెలిసింది. దీంతో అక్కడా ఇక్కడా చూసి పొలంలోనే చిన్నపాటి ఇథనాల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బ్రోయిన్ కూడా తండ్రికి జతకలిశారు. ఇథనాల్ ఉత్పత్తిని మరింత పెంచాలనుకున్నారు. మంచి పరికరాల కోసం చూశారు.
అక్కడే దశ తిరిగింది.. ‘పొయెట్’ అయ్యింది
మంచి పరికరాలు, యంత్రాల కోసం మూతబడిన ఫ్యాక్టరీల వేలానికి వెళ్లేవారు. అక్కడ మంచి డీల్ వచ్చిన వాటిని కొనేవారు. కానీ, 1987 వాళ్ల దశను తిరగరాసింది. సౌత్ డకోటాలోని స్కాట్లాండ్లో నష్టాలతో మూతబడిన ఓ ఇథనాల్ ప్లాంట్ వేలానికి వెళ్లారు బ్రోయిన్, ఆయన తండ్రి. ఈసారి వేలంలో పరికరాలే కాదు మొత్తం ప్లాంట్‌నే కొనేద్దామన్న నిర్ణయానికి వచ్చారు. వెంటనే తనకున్న 1200 ఎకరాల పొలాన్ని తాకట్టు పెట్టేశారు బ్రోయిన్ తండ్రి. అప్పట్లోనే 72 వేల డాలర్లకు (దగ్గరదగ్గర ₹50 లక్షలు) దానిని దక్కించుకున్నారు. అక్కడే వాళ్ల దశ తిరిగింది. అలా అని వాళ్లకు అదంతా ఈజీగా ఏం రాలేదు. ఆ పాత కంపెనీని చాలా బాగుచేయాల్సి ఉండేది. 22 ఏళ్ల నూనుగు మీసాల వయసులో ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు బ్రోయిన్. అంతా బాగు చేసి 8 నెలల్లోనే కంపెనీని నడిపించారు. అదే బ్రోయిన్ కంపెనీస్‌కు అదే మూలస్తంభంలా నిలిచింది. కొన్నేళ్లలోనే ఏటా కంపెనీ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం పది లక్షల గాలన్ల (37.85 లక్షల లీటర్లు)కు చేరింది. ఆ తర్వాత మూడేళ్లలో సామర్థ్యాన్ని మూడు రెట్లు, ఆ తర్వాత వెంటనే దాన్ని రెట్టింపు అయింది. ఏడేళ్లలోనే కోటి గాలన్ల (3.78 కోట్ల లీటర్లు) ఇథనాల్‌ను ఉత్పత్తి మొదలైంది. 2007లో కంపెనీ పేరును ‘పొయెట్’గా మార్చేశారు బ్రోయిన్.
బయో ఫ్యూయెల్లో ప్రపంచంలో పెద్ద కంపెనీ
పొయెట్.. ఆ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్న కంపెనీగా ఘనత సాధించింది. దాని రెవెన్యూ ₹55 వేల కోట్లు (800 కోట్ల డాలర్లు) దాటింది. సౌత్ డకోటాలోని సియాక్స్ ఫాల్స్ కేంద్రంగా నడుస్తున్న కంపెనీకి, దేశంలోని 7 రాష్ట్రాల్లో 28 రిఫైనరీలున్నాయి. ఏటా సుమారు 757 కోట్ల లీటర్ల (200 కోట్ల గాలన్లు) ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. 13 మంది ఉద్యోగులతో మొదలైన ఆ కంపెనీలో ఇప్పుడు 2,000 మందికిపైగా పనిచేస్తున్నారు. ఇథనాలే కాదు.. ఏటా 27.12 కోట్ల కిలోల మొక్కజొన్న నూనెను ఉత్పత్తి చేస్తోంది. ఇథనాల్‌ను తయారు చేసేటప్పుడు బైప్రొడక్ట్‌గా వచ్చే మొక్కజొన్న చెక్క 453 కోట్ల కిలోలు ఉత్పత్తి అవుతోంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆ చెక్కను పాడి పశువులకు దాణాగా పెడుతున్నారు.
సమాజానికీ కొంత
సంపాదనలో సమాజానికీ కొంత ఖర్చు పెడుతున్నారు బ్రోయిన్. ఏటా ఆఫ్రికాకు వెళతారు. అక్కడ పేద రైతులకు సాయం చేస్తారు. పంట పండించడంలో మెళకువలు నేర్పిస్తారు. బ్రోయిన్ కూతురు ఓ సారి చర్చి తరఫున టూర్‌కు వెళతానంటే కుటుంబమంతా ఆమె వెంట వెళ్లింది. అప్పటి నుంచి అది వాళ్లకు ఏటా టూర్లా మారింది. ఆఫ్రికా రైతులకు సాయం చేసేందుకు ‘సీడ్స్ ఆఫ్ చేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థనూ ఏర్పాటు చేశారు. పంటలపై పాఠాలు చెప్పడంతో పాటు కెన్యాలోని ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా స్కూళ్లు కట్టించి చదువు చెప్పిస్తున్నారు. కట్టెల పొయ్యిలను వాడుతున్న చాలా మందికి ఇథనాల్ స్టవ్‌లను అందజేస్తున్నారు.
అదే నాలో స్ఫూర్తి నింపింది
‘‘మేం ఇథనాల్ ప్లాంట్‌ను మొదలుపెట్టినప్పుడు చాలా తక్కువ ప్లాంట్లు ఉండేవి. సరైన టెక్నాలజీ లేక అవి కూడా నష్టాల బాటలోనే నడిచేవి. అలాంటి ప్లాంట్లనే చూసి మేం చిన్న చిన్న పరికరాలను వేలంలో కొనేవాళ్లం. స్కాట్లాండ్ కంపెనీని కొన్నాక, దాదాపు 8 నెలలు నేను ఫ్యాక్టరీలోనే పడుకున్నా. అక్కడే పని, తిండి, నిద్ర. ఆ ప్లాంటే నేను సక్సెస్ కావడానికి స్ఫూర్తి నింపింది. ఒకవేళ ఆ టాస్క్లోగానీ నేను ఫెయిలై ఉంటే, మేం తాకట్టు పెట్టిన మా పొలమంతా పోయేది”
‑ జెఫ్ బ్రోయిన్, పొయెట్ సీఈవో, ఓనర్
