విద్యుత్​ షాక్​తో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలి

విద్యుత్​ షాక్​తో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలి
  • రెండు చోట్ల బాధితుల ఆందోళన
  • నిందితులపై చర్య తీసుకోవాలి
  • నిర్మల్​, ఇచ్చోడలో నిరసన

నిర్మల్/ఇచ్చోడ,వెలుగు: రైతులు పంటలు కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్న విద్యుత్​ కంచెలు అమాయకుల ప్రాణాలు తోడేస్తున్నాయి. విద్యుత్​శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నిర్మల్​, ఇచ్చోడలో బాధితులు ఆందోళన నిర్వహించారు. నిర్మల్​ జిల్లా మామడ మండలం పోన్కల్​ గ్రామంలో విద్యుత్​ కంచె తగిలి మృతిచెందిన బుర్రన్నకుటుంబానికి న్యాయం చేయాలని బుధవారం మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన ఎర్రన్న తన పంటపొలానికి అమర్చిన కరెంటు తీగల కారణంగానే బుర్రన్న చనిపోయాడని ఆరోపించారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వీడీసీ సభ్యులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన విరమించారు.

విద్యుత్​ కంచెలు పెడితే కఠిన చర్యలు

పంట పొలాల రక్షణ కోసం కరెంట్ ​వైర్లు కంచెగా పెడితే కఠిన చర్యలు తప్పవని విద్యుత్​ శాఖ ఎస్​ఈ జైవంత్ ​రావు చౌహాన్​ హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే అలర్ట్ ​చేసినా కొంత మంది రైతుల తీరు మారడంలేదన్నారు. ఇక నుంచి చేలకు విద్యుత్​ కంచెలు ఏర్పాటు చేసిన వారిపై సెక్షన్​ 304 పార్ట్​ 2  కింద కేసులు పెడుతామని హెచ్చరించారు.

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి

ఇచ్చోడ,వెలుగు: ఇచ్చోడ మండలం దుబార్​పేట(బి) గ్రామంలో విద్యుత్ షాక్​తో  మృతి చెందిన రాయి సిడాం చిత్రు కుటుంబాన్ని ఆదుకోవాలని  గ్రామస్తులు డిమాండ్​ చేశారు. బుధవారం ఇచ్చోడ కరెంట్​ఆఫీస్ ​ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏడీ, ఏఈలను నిలదీశారు. ఈ సందర్భంగా సర్పంచ్​ చాహకటి అభిమాన్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.