అమర జవాన్ కుటుంబాన్ని పట్టించుకోని రాష్ట్ర సర్కార్​

 అమర జవాన్ కుటుంబాన్ని పట్టించుకోని రాష్ట్ర సర్కార్​
  • మాటలే.. సాయం చేయలే!
  • పదేండ్లుగా అమర జవాన్​ యాదఈయ్య కుటుంబం ఎదురుచూపులు

నాగర్ కర్నూల్,  వెలుగు: ఆర్మీలో పనిచేస్తూ తీవ్రవాదుల దాడిలో అమరుడైన జవాన్ కొండారెడ్డిపల్లి యాదయ్య కుటుంబం ప్రభుత్వం నుంచి సాయం అందక గోస పడుతోంది. రాష్ట్రాలు తిరిగి అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం యాదయ్య  కుటుంబాన్ని ఆదుకోవడంలో వివక్ష చూపిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి  గ్రామానికి చెందిన యాదయ్య 2013 జూన్​లో జమ్మూకాశ్మీర్ సెక్టార్​లో పనిచేస్తుండగా తీవ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. 25 ఏండ్లకే ప్రాణాలు కోల్పోయిన యాదయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. యాదయ్య కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం కింద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఇచ్చింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, మంత్రి డీకే అరుణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు కొండారెడ్డిపల్లికి వెళ్లి యాదయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని, ఆదుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో పాటు 5 ఎకరాల భూమి, యాదయ్య భార్యకు ఉద్యోగం ఇస్తామన్నారు. పిల్లల చదువు బాధ్యత తమదేనని ప్రకటించారు. అయితే ఆ హామీలెవీ అమలవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన తర్వాత సైతం సర్కారు యాదయ్య కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఆర్మీ నుంచి వచ్చే పెన్షన్​తో భార్య సుమతి కుటుంబాన్ని పోషిస్తోంది.  కూతుళ్లు లక్ష్మిత(7వ తరగతి), యశ్వంతి(5వ తరగతి) హైదరాబాద్​లోని ప్రైవేట్​స్కూల్​లో చదువుతున్నారు. యాదయ్య తండ్రి మరణించడంతో ఆయన తల్లి గ్రామంలో  కూలీనాలి చేసుకుంటూ బతుకుతోంది.  కల్వకుర్తి  టౌన్​లో ఎక్స్ ఆర్మీ జవాన్లకు కేటాయించిన స్థలంలో 160 గజాల ఇంటి స్థలం ఇచ్చారు.  ఉద్యోగం, భూమి, ఆర్థిక సాయం కోసం యాదయ్య కుటుంబం పదేండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా స్పందన కరవైంది. 

ఆయన చనిపోయినప్పుడు చంద్రబాబునాయుడు, కవిత, ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్.. ఇట్ల చాలామంది వచ్చిన్రు. మీకు మేము అండగా ఉంటం అన్నరు. కల్వకుర్తిలో ఇంటి జాగా తప్ప ఏదీ రాలేదు. తెలంగాణ వచ్చినంక మన ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తదేమో అన్న ఆశ ఉండె. కానీ పట్టించుకోలే. ఆర్మీ నుంచి వచ్చే పింఛన్​తోనే బతుకుతున్నం. ఇద్దరు ఆడ పిల్లలను చదివించడం కష్టమైతున్నది. ఉద్యోగం ఇప్పిచ్చి, ఇంత భూమి ఇస్తే ఆడపిల్లలను గట్టెక్కించుకుంట.      
- సుమతి, జవాన్ యాదయ్య భార్య