మల్లన్నసాగర్‌‌కు భూములిచ్చిన రైతులు కూలీలైన్రు

మల్లన్నసాగర్‌‌కు భూములిచ్చిన రైతులు కూలీలైన్రు
  • ఆర్థిక ఇబ్బందులతో నిర్వాసితుడి ఆత్మహత్య
  • ఉపాధి దొరక్క, వ్యాపారం కలిసి రాక తీవ్ర మనస్తాపం
  • పురుగుల మందు తాగిన ఏటిగడ్డ కిష్టాపూర్ వాసి
  • ఊళ్లకు ఊళ్లు తీసుకొని ఉపాధి చూపని సర్కారు
  • లేబర్ అడ్డా కాడ పని కోసం నిర్వాసితుల ఎదురు చూపులు
  • పని దొరక్క కుటుంబ పోషణకు తిప్పలు
  • ప్రభుత్వం తమ బతుకులను ఆగం చేసిందంటున్న బాధితులు
  • ఇప్పటికైనా ఉపాధి చూపాలంటూ విజ్ఞప్తులు

సిద్దిపేట, వెలుగు: నిన్నటి దాకా వాళ్లంతా రైతులు. వ్యవసాయం చేసుకుంటూ మరో పది మంది కూలీలకు ఉపాధి చూపేవాళ్లు. కానీ మల్లన్న సాగర్​ రిజర్వాయర్ కోసం భూములు త్యాగం చేసినందుకు ఇప్పుడా రైతులే కూలీలుగా మారారు. నలుగురిని కైకిలికి పిలిచినవాళ్లే ఇప్పుడు లేబర్ అడ్డా మీద నిలబడి తమను ఎవరు పనికి పిలుస్తరా అని ఎదురు చూస్తున్నారు. కూలి దొరక్క కుటుంబ పోషణకు తిప్పలు పడుతున్నారు. మల్లన్నసాగర్ కోసం ఇండ్లు, పొలాలతోపాటు ఊళ్లకు ఊళ్లను తీసేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపలేదని, అందుకే తమకు ఈ దుస్థితి వచ్చిందని బాధితులు వాపోతున్నారు.
17 వేల ఎకరాల భూములు.. 5818 కుటుంబాలు
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లోని 8 గ్రామ పంచాయతీలు, 8 హామ్లెట్​విలేజీల పరిధిలోని 17 వేల ఎకరాల వ్యవసాయ భూములను ప్రభుత్వం సేకరించింది. తొగుట మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలంలోని సింగారం, ఎర్రవల్లి గ్రామాలు రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురయ్యాయి. మొత్తంగా 5,818 కుటుంబాలు ప్రభావితమయ్యాయి. వేములఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,330, పల్లెపహాడ్ లో 1,011, ఏటిగడ్డ కిష్టాపూర్ లో 1,493, లక్ష్మాపూర్ లో 385, రాంపూర్ లో 255, బ్రాహ్మణ బంజేరుపల్లిలో 293, సింగారంలో 273, ఎర్రవెల్లిలో 892 కుటుంబాలను గజ్వేల్ మండలం ముత్రాజ్​పల్లి, సంగపూర్ లో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుల కోసం సేకరించిన ప్రతి ఎకరానికి మార్కెట్​రేటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించాలి. ఐదెకరాలు, అంతకంటే తక్కువ భూములున్న చిన్న రైతు కుటుంబాలకు జీవనోపాధి కోసం కనీసం ఎకరా భూమి, ఎస్సీ, ఎస్టీలైతే భూమికి బదులు భూమి ఇవ్వాలి. జీవనోపాధి కోల్పోయే రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, చిరువ్యాపారుల కుటుంబాల్లోని కనీసం ఒకరికి వివిధ రంగాల్లో వృత్తి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపాలి. లేదంటే ప్రభుత్వం ఆ కుటుంబానికి నెలకు 2 వేల (అప్పటి రేట్ల ప్రకారం) చొప్పున 20 ఏళ్లపాటు ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టం చెబుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కి నిర్వాసితులను ఆర్​అండ్​ఆర్​కాలనీలకు తరలించి చేతులు దులుపుకున్నది.
ఉపాధి ఎక్కడ?
మల్లన్న సాగర్ కింద సుమారు 6 వేల కుటుంబాలు ఇండ్లు, పొలాలు, ఉపాధి కోల్పోయాయి. ఇప్పుడు గజ్వేల్ మండలం ముత్రాజ్​పల్లి, సంగపూర్ లోని ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఈ ఫ్యామిలీలు దయనీయంగా బతుకుతున్నాయి. సర్కారు ఎకరాకు రూ.6 లక్షల నుంచి 10 లక్షల వరకు పరిహారం ఇవ్వగా.. బహిరంగ మార్కెట్ లో ఎకరా విలువ 30 లక్షలకుపైగా పలుకుతోంది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో ఇంకోచోట భూములు కొనలేని పేద రైతులు కూలీలుగా మిగిలిపోయారు. మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నింపేందుకు ఉన్నఫలంగా తరలించిన సర్కారు.. వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు చూపలేదు. దీంతో వాళ్లు కుటుంబ పోషణ కోసం కూలీలుగా మారుతున్నారు. కొందరు చుట్టు పక్కల గ్రామాల్లో వ్యవసాయ పనుల కోసం కైకిలికి వెళ్తున్నారు. మహిళలు రోజుకు రూ.200 కూలి కోసం దాదాపు 20 కిలో మీటర్ల వరకు ఆటోల్లో పోయి వస్తున్నారు. దగ్గరలోని నర్సరీల్లో పనుల కోసం పోటీపడుతున్నారు. అందరికీ పనులు దొరక్క గజ్వేల్​లోని లేబర్ అడ్డాకు పరుగుపెడుతున్నారు. ఉదయం 6 గంటలకే సద్ది కట్టుకొని అడ్డా మీదికి చేరుకొని ఎవరు పనికి పిలుస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తున్నారు. గజ్వేల్ అర్బన్ పార్క్‌‌‌‌లో ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన 20 మంది నిర్వాసితులు కొద్ది రోజులుగా పనిచేస్తున్నారు. మల్లన్న సాగర్​కు భూములిస్తే ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్లవుతారంటూ ఆఫీసర్లు తమను ఒప్పించారని, భూములిచ్చిన తమ జీవితాల్లో ఇంతలా చీకట్లు కమ్ముకుంటాయని తాము ఊహించలేకపోయామని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రభుత్వం భూమికి బదులు భూమి ఇవ్వలేదని, కనీసం తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఉపాధి మార్గాలు చూపాలని కోరుతున్నారు.

ఆగంజేసిన్రు
ఊళ్లో ఉన్న మమ్మల్ని కాలనీకి తీసుకొచ్చి ఆగంజేసిండ్రు. మల్లన్నసాగర్ కోసం భూములిచ్చిన పాపానికి నడిబజార్ల నిలబెట్టిన్రు. మాకు వ్యవసాయం తప్ప ఇంకేం తెలియదు. ఇక్కడ చేద్దామంటే పని దొరుకుతలేదు. కుటుంబ పోషణకు కష్టమైతాంది. రోజూ ఎవరు పనికి పిలుస్తారా అని ఎదురుచూస్తున్నం. కొన్నాళ్లుగా అర్బన్ పార్క్ లో పనికి వస్తున్నం. ఇప్పటికీ రోజు కూలి ఎంతిస్తరో డిసైడ్ చెయ్యలే.
                                                                                                                                                                       - ఎల్దండి శోభ, నిర్వాసితురాలు
ఎట్ల బతకాలె
ఎవుసం చేసి బతికెటోళ్లం. మల్లన్న సాగర్​తో మా ఊరు,  ఇండ్లు, పొలాలు పోయినయి. ఆఫీసర్లు ఆర్ అండ్ ఆర్ కాలనీకి తీసుకొచ్చి పడేసిన్రు. మాకచ్చిన పరిహారంతో బయట భూములు కొనేటట్టు లేదు.  చేద్దామంటే పనిలేదు. ఇప్పుడెట్ల ఎట్ల బతకాలె. మా కుటుంబాలు ఆగమైతన్నయ్. నిర్వాసితులకు పని కల్పించే  బాధ్యత సర్కారుకు లేదా? ఇప్పటికైనా మాకు పని కల్పించాలె.
                                                                                                                                                - ఎల్.అంజయ్య, నిర్వాసితుడు, ఏటిగడ్డ కిష్టాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆర్థిక ఇబ్బందులతోమల్లన్న సాగర్ నిర్వాసితుడి ఆత్మహత్య
గజ్వేల్, వెలుగు: పుట్టిపెరిగిన ఊరును వదిలి పొమ్మన్నది ప్రభుత్వం. ఉపాధి పోయింది.. చేయడానికి పని దొరకలేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటే సరిగ్గా నడవలేదు. వ్యాపారానికి, కుటుంబాన్ని పోషించేందుకు చేసిన అప్పులు పెరిగినయ్‌‌‌‌. వాటిని తీర్చే దారి కనిపించలేదని.. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్వాసితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్​కు చెందిన నేవూరి నర్సింహారెడ్డి (40).. ప్రభుత్వం కేటాయించిన గజ్వేల్ డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో తాత్కాలికంగా నివాసం ఉంటున్నాడు. గ్రామాన్ని విడిచిపెట్టిన తర్వాత అతడికి ఉపాధి దొరకలేదు. తాను ఉంటున్న డబుల్ బెడ్ రూమ్ కాలనీలోనే ఫాస్టు ఫుడ్ సెంటర్, ప్రజ్ఞాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కారు సర్వీసింగ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇవి సరిగ్గా నడవలేదు. దీంతో కుటుంబ అవసరాల కోసం, వ్యాపారం కోసం చేసిన అప్పులు పెరిగాయి. ఇదే విషయమై కొన్ని రోజులుగా ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తాను నిర్వహిస్తున్న ఫాస్టు ఫుడ్ సెంటర్ వద్దే పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే నర్సింహారెడ్డిని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడికెళ్లిన కొద్దిసేపటికే ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పొందుతూ అతడు చనిపోయాడు. నర్సింహారెడ్డికి భార్య బాలమణి, కొడుకులు శ్రీకాంత్, శివకుమార్, కూతురు శిరీష ఉన్నారు.

ఈయన పేరు బొమ్మ ఎల్లయ్య. మల్లన్న సాగర్ ముంపు గ్రామం వేములఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నిర్వాసితుడు. రిజర్వాయర్ కింద ఊరు పోవడంతో ఈయన కుటుంబం 4 నెలల కింద ముట్రాజ్‌‌‌‌పల్లి లోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి చేరింది. ఊరిలో ఉన్నప్పుడు తన రెండెకరాలతో పాటు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం భూమి, ఇల్లు పోవడంతో ఉపాధి కరువైంది. కుటుంబ పోషణ కోసం ఎల్లయ్య పది రోజులుగా గజ్వేల్ లేబర్ అడ్డాకు పని కోసం వస్తున్నాడు. ఎవరు ఏ పనికి పిలిస్తే ఆ పనికి పోతున్నాడు. పది రోజుల్లో నాలుగు రోజులే పని దొరికిందని, ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి ఊరిని ఖాళీ చేయించడంపై ఉన్న శ్రద్ధ.. తమకు ఉపాధి చూపడంపై లేదని బాధపడ్డాడు. ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన సత్తవ్వ, కనకయ్య ఫ్యామిలీకి ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. తీరొక్క పంట పండించేవాళ్లు. మల్లన్నసాగర్ రిజర్వాయర్​లో భూమి మొత్తం పోయింది. ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటున్న సత్తవ్వ, కనకయ్య.. గజ్వేల్ అర్బన్ పార్కులో కూలి పనులు చేస్తున్నరు. ఇప్పుడు ఈ పని ఉంది కనుక చేస్తున్నామని, రేపు ఎలా ఉంటుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.