
మదురై : వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత కొడుకులు, కూతుర్లదేనని కోర్టులు చెబుతున్నప్పటికీ సమాజంలో మార్పు రావడంలేదు. ముందే ఆస్తిని పంచుకుంటారు. పట్టెడన్నం పెట్టడానికి చేతులు రావు. ఇటీవల ఓ తండ్రి తనకున్న రూ.3.80కోట్ల ఆస్తిని కూతురికి రాసిచ్చాడు. ఆస్తి వచ్చాక కూతురిలో మార్పు వచ్చింది. తండ్రిని పోషించడానికి నో చెప్పింది. అయితే ఆ కూతురికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు అధికారులు. కూతురు పేరుమీదున్న ఆస్తిని మొత్తం రివర్స్ గా తండ్రికి చేశారు స్థానిక ఆర్డీవో. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.
వివరాలు: మదురైకి చెందిన వైరవన్(80)కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకులు మృతి చెందడంతో ఉన్న ఆస్తిని కూతురికి రాసిచ్చి ఆమె దగ్గరే ఉంటున్నాడు. అయితే కూతురు రోజు సరిగ్గా అన్నం పెట్టక పోగా..చీటికి మాటికి కోపంగా చూసేది. దీంతో విసుగు చెందిన వైరవన్..ఇటీవలే తనకున్న పాత ఇంట్లో ఒక్కడే నివాసం ఉంటున్నాడు. అదికూడా తన ఆస్తేనంటూ ఇల్లును కూల్చేసింది కూతురు. దీంతో దిక్కుతోచని స్ధితిలో వైరవన్ స్థానిక ఆర్డీవో ఆఫీసర్ కు ఫిర్యాదు చేశాడు. ఆర్డీవో ఆదేశంతో వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు.. కూతురు పేరుమీదున్న మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకుని, తిరిగి వైరవన్ కు అప్పగించారు. ఇకనుంచి తండ్రిని బాగా చూసుకుంటానని విచారణలో కూతురు.. అధికారులను ఎంత రిక్వెస్ట్ చేసినా ఫలితంలేకుండా పోయింది. చట్టం తన పని తాను చేసిందని చెప్పారు ఆర్డీవో మురుగేశనన్.