
- ఆగస్టు 1 తో ముగియనున్న ట్రంప్ టారిఫ్‌ల గడువు
న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌ను ఈ వారం కంపెనీల జూన్ క్వార్టర్ (క్యూ1) ఫలితాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయం, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) కదలికలు నిర్ణయిస్తాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మాక్రో ఎకనామిక్ డేటా, మంత్లీ ఆటో సేల్స్ డేటా, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్‌లను కూడా ట్రేడర్లు జాగ్రత్తగా గమనించాలని అన్నారు. ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్, థాయ్‌లాండ్-–కంబోడియా భౌగోళిక ఉద్రిక్తతలపై కూడా మార్కెట్లు దృష్టి సారిస్తాయి.
రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ, "కొత్త నెల ప్రారంభంలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ), హెచ్‌ఎస్‌బీసీ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ (ఆగస్టు 1), మంత్లీ ఆటో సేల్స్ డేటాపై దృష్టి ఉంటుంది. జులై డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ ఉండడంతో మార్కెట్‌లో వోలటాలిటీ పెరగొచ్చు’’ అని వివరించారు. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, హిందుస్తాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, సన్ ఫార్మా, ఐటీసీ వంటి ఇండెక్స్ హెవీవెయిట్ కంపెనీల క్యూ1 ఫలితాలు ఈ వారం వెలువడనున్నాయి. గ్లోబల్‌గా, యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం (జులై 30), యూఎస్ జీడీపీ వృద్ధి డేటా (జులై 30), ఆగస్టు 1 తో ముగియనున్న ట్రంప్ టారిఫ్ గడువు వంటి అంశాలు ఎఫ్‌ఐఐల ఫ్లోలను ప్రభావితం చేస్తాయని మిశ్రా తెలిపారు. రూపాయి-–డాలర్ కదలికలు, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెట్టుబడిదారుల దృష్టిలో ఉంటాయన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కోల్ ఇండియా తదితర కంపెనీల ఫలితాలు మార్కెట్ స్థిరత్వం లేదా డౌన్‌ట్రెండ్‌ను నిర్ణయిస్తాయని తెలిపారు.