మధ్యప్రదేశ్​లో నోటిఫికేషన్ రిలీజ్ : నామినేషన్ల స్వీకరణ షురూ

మధ్యప్రదేశ్​లో నోటిఫికేషన్ రిలీజ్ : నామినేషన్ల స్వీకరణ షురూ
  • మధ్యప్రదేశ్​లో నోటిఫికేషన్ రిలీజ్
  • నామినేషన్ల స్వీకరణ షురూ.. నవంబర్ 17న పోలింగ్

భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో శనివారం నుంచి నామినేషన్ల ఫైలింగ్ ప్రారంభమైంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 30 దాకా నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 31న స్క్రూట్నీ, నవంబర్ 2 దాకా నామినేషన్ల ఉప సంహరణకు ఈసీ అవకాశం ఇచ్చింది. 

మధ్యప్రదేశ్​లో 5.60 కోట్ల ఓటర్లు ఉండగా.. వీరిలో 2.88 కోట్ల మంది పురుషులు, 2.72 కోట్ల మంది మహిళలు, థర్డ్ జెండర్లు 1,373 మంది ఓటర్లు ఉన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాల్లో, బీజేపీ 109 స్థానాల్లో గెలిచాయి. ఎస్​పీ, బీఎస్పీ సపోర్ట్​తో కమల్​నాథ్ ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో కమల్​నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. ఆపై శివరాజ్ ​సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది.

సిట్టింగ్స్​లో 93 మందిపై కేసులు

230 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 93 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రిపోర్ట్​లో వెల్లడైంది. 93 మందిలో బీజేపీ నుంచి 39 మంది, కాంగ్రెస్ నుంచి 52 మంది, బీఎస్పీ నుంచి ఒకరు, మరొకరు ఇండిపెండెంట్​అభ్యర్థి ఉన్నాడు. 93 మందిలో 47 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు, ఒకరిపై మర్డర్ కేసు, ఆరుగురిపై హత్యాయత్నం కేసు, ఇద్దరిపై మహిళలకు సంబంధించిన నేరాలు ఉన్నాయి.

230 మంది ఎమ్మెల్యేల్లో 186 మంది కోటీశ్వరులు. 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో  76 మంది కోటీశ్వరులున్నారు. కాంగ్రెస్ నుంచి సంజయ్ శుక్లా అత్యంత కోటీశ్వరుడు (రూ.139 కోట్లు). బీజేపీలో 129 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. 107 మంది కోటీశ్వరులు. బీజేపీ నుంచి సంజయ్ పాఠక్  అత్యంత కోటీశ్వరుడు (రూ.226 కోట్లు)గా ఉన్నాడు. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కోటీశ్వరులుగా ఉన్నారు. 62 మంది ఎమ్మెల్యేలు 12వ క్లాస్ వరకు, 158 మంది గ్రాడ్యుయేట్ కంటే ఎక్కువ పూర్తి చేసుకున్నారు.