
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్‌లో మారిసెల్వరాజ్ రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మామన్నన్’. ఇటీవల తమిళంలో విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’ టైటిల్‌తో జులై 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ‘మొదట మేము దీన్ని మల్టీ లాంగ్వేజెస్ కోసం రూపొందించాలని ప్లాన్ చేయలేదు. తెలుగులో నా గత చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈ సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనుకున్నాం. కోలీవుడ్‌లో సక్సెస్ టాక్ రావడంతో తెలుగు హక్కుల కోసం మమ్మల్ని సంప్రదించారు.
అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌గా ఉన్న ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో విడుదలవడం ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నాం. ఇదొక పొలిటికల్ డ్రామా. సామాజిక న్యాయం, ప్రజల మధ్య సమానత్వం గురించి ఇందులో చర్చించాం. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ. మెసేజ్ కూడా ఉంటుంది.
తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది. నటనకు స్కోప్ ఉన్న సినిమా చేయడం నిజంగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. వడివేలు, ఫహాద్, కీర్తి సురేష్‌లతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. సినిమాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, నా చివరి సినిమాని బలమైన కథతో మారితో చేయాలనుకున్నాను’ అని చెప్పాడు.