
సమంత ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శాకుంతలం’. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా గుణ శేఖర్ ఈ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్‌లో స్పీడు పెంచిన టీమ్, బుధవారం ‘మల్లికా మల్లికా’ అనే పాటను రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను రమ్యా బెహరా పాడింది.
‘మల్లికా మల్లికా మాలతీ మాలికా.. చూడవా చూడవా ఏడి నా ఏలిక.. హంసికా హంసికా జాగునే సేయకా.. పోయిరా పోయిరా .. రాజుతో రా ఇకా’ అంటూ చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ ఇంప్రెస్ చేశాయి. భర్త దుష్యంతుడి కోసం ఎదురుచూస్తున్న శకుంతల, తన చుట్టూ ఉన్న మొక్కలు, పక్షులతో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఈ పాట. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కూతురు అర్హ యువరాజు భరతుడిగా కనిపించనుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్రీడీలో విడుదల చేస్తున్నారు.