రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ, వెలుగు:

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతి పక్ష పార్టీలు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలు, జీఎస్టీ, ఎకానమీ స్లోడౌన్ అంశాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వ్యవసాయ, కార్మిక రంగాలకు సంబంధించిన అంశాలపై లెఫ్ట్ పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. మరో వైపు టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు స్థానిక అంశాలపై పట్టుబట్టాలని నిర్ణయించుకున్నాయి. రూలింగ్ పార్టీ బీజేపీ మాత్రం ఈ సమావేశాల్లో పలు బిల్లులు ఆమోదించుకోవాలని, కీలక ఆర్డినెన్స్ లపై బిల్లులు తేవాలని ఆలోచిస్తోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను తిప్పికొట్టేందుకు కూడా సిద్ధమైంది. కేవలం20 రోజులు మాత్రమే సాగే ఈ సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని బీజేపీ అధిష్టానం తన ఎంపీలకు దిశానిర్దేశం చేసింది. ఉభయ సభల ముందుకు రానున్న బిల్లులకు మద్దతు కూడగట్టేలా ఎత్తుగడలను రచిస్తోంది. అలాగే ఈ నెల 26న సంవిధాన్ దివస్​ను ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి  స్పీచ్ ఇవ్వనున్నారు.

సభ ముందుకు కీలక బిల్లులు, ఆర్డినెన్స్ లు..

గత పార్లమెంటు సమావేశాల్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి కీలక బిల్లులను మోడీ సర్కార్ గట్టెక్కించుకున్నది. ఈసారి కూడా మరిన్ని కీలక బిల్లులపై దృష్టి సారించింది. ఈ సమావేశాల్లో 27 బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయోధ్య రామాలయానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో సంబంధిత బిల్లును కేంద్రం కీలకంగా భావిస్తోంది. ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర సాంస్కృతిక శాఖ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. ఇక ఎన్ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)ని దేశవ్యాప్తంగా అమలు చేయడం, పౌరసత్వ చట్టం విషయంపైనా బీజేపీ సర్కారు క్లారిటీతో ఉంది. బీజేపీ ఎజెండాలో ఆర్టికల్ 370, అయోధ్య, తర్వాత కామన్ సివిల్ కోడ్ ప్రధాన అంశంగా కనిపిస్తోంది. కానీ, కామన్ సివిల్ కోడ్ కోసం ప్రజల అంగీకారం పొందాల్సి ఉంటుందని, అందువల్ల ఎన్ఆర్సీ  బిల్లు గట్టెక్కిన తర్వాత దానిపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని అంటున్నారు. వీటితో పాటు కీలక ఆర్డినెస్సులను కూడా తేవాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ఆదాయపు పన్ను చట్టం-1961, ఆర్థిక చట్టం-2019లను సవరిస్తూ, దేశీయ కంపెనీల కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తోపాటు ఇ-–సిగరెట్ల అమ్మకం, ఉత్పత్తి, నిల్వలను నిషేధిస్తూ తెచ్చిన అర్డినెన్స్‌ పై కూడా బీజేపీ సర్కారు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ అంశాలను పార్లమెంట్ లో చర్చించొద్దు: నామా

అసెంబ్లీలో ఉన్న అంశాలపై పార్లమెంటులో చర్చించడానికి అవకాశం ఇవ్వొద్దని లోక్ సభ స్పీకర్ ను కోరినట్లు టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు తెలిపారు. శనివారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. తర్వాత  మీడియాతో మాట్లాడుతూ.. శీతాకాల సమావేశాల్లో 27 బిల్లులు సభ ముందుకు రానున్నాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చాలని పట్టుబడతామని వెల్లడించారు. ఈ అంశంపై చొరవ చూపాలని  స్పీకర్ ను కోరినట్లు తెలిపారు. బిల్లులతో పాటు దేశంలో ఉన్న సమస్యలపై చర్చించేందుకు కూడా తమకు సమయం ఇవ్వాలని కోరామన్నారు. అన్ని విషయాలపై చర్చించేందుకు సమయం ఇస్తామని స్పీకర్ హామీ ఇచ్చారన్నారు.