గోదావరికి వరద పోటు

గోదావరికి వరద పోటు
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి మరోసారి వరద ప్రవాహం పెరుగుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహం భారీగా ఉంది. 12.2 అడుగుల ఎత్తులో రెండు నదులు ప్రవహిస్తున్నాయి. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో నదీ తీరంలోని స్నాన ఘట్టాలు, చిరు వ్యాపారుల దుకాణాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 15 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో ఉంది.

గోదావరి మరోసారి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నదీ తీరంలోని కరకట్ట దగ్గర పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కరకట్ట పైకి ఎవరినీ అనుమతించట్లేదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో...భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని పలు పండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. భద్రాచలం నుంచి చర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు పెద్దఎత్తున ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం నుంచి ఛత్తీస్ గఢ్, ఒడిశా ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నెల్లిపాక దగ్గర నీరుచేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

చింతూరు వద్ద శబరి నదికి వరదపోటు

ఛత్తీస్ గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో చింతూరు దగ్గర శబరి నది ప్రవాహం పెరుగుతోంది. అటు పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్ల నుంచి వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర నీటి మట్టం 15 అడుగులకు చేరింది. మరోవైపు కృష్ణానదికి వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంకు 3 లక్షల 35 వేల 635 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తి... నాగార్జున సాగర్ కు 3 లక్షల 75 వేల క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు 4 లక్షల క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తోంది. ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.