
- టైర్2 సిటీల్లో బెటర్
- స్లోడౌన్ భయంతో ఖర్చులు తగ్గిస్తున్న కంపెనీలు
- ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ వెల్లడి
ముంబై: హైరింగ్ యాక్టివిటీ మే నెలలో 7 శాతం తగ్గింది. ఎకనమిక్ స్లోడౌన్ అంచనాలతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో ఉండటంతో హైరింగ్ యాక్టివిటీ కొంత నెమ్మదించింది. కిందటేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో కంపెనీలు కొత్త ఉద్యోగాలు ఇవ్వడం 7 శాతం తగ్గిందని ఫౌండిట్ (గతంలో మాన్స్టర్ ఏపీఏసీ అండ్ ఎంఈ) రిపోర్టు వెల్లడించింది. సాధారణమైన ఈ తగ్గుదలను పక్కకిపెడితే, అహ్మదాబాద్, జైపూర్ వంటి టైర్2 సిటీలలో పాజిటివ్ ట్రెండ్స్ రికార్డయినట్లు తెలిపింది. అన్ని పరిశ్రమ రంగాలలోనూ హైరింగ్ జోరు తగ్గిందని, ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చినా మే నెలలో హైరింగ్ 4 శాతం తగ్గుదలను చూపించిందని పేర్కొంది.
ఎకనమిక్ స్లోడౌన్ భయంతో సహా వివిధ కారణాల వల్ల హైరింగ్ ఊపు తగ్గుతోందని వివరించింది. ఖర్చులు తగ్గించుకోవడంపైనే కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయని పేర్కొంది. పరిశ్రమకు అవసరమైన స్కిల్స్‌తో వ్యక్తులు దొరకడం దేశంలో కొంత కష్టతరంగా మారడం కూడా హైరింగ్ జోరు తగ్గడానికి మరో కారణమని వివరించింది. అర్హులైన కేండిడేట్లను వెతుక్కోవడం కంపెనీలకు సవాలుగా నిలుస్తోందని వెల్లడించింది. ఇండియాలోని జాబ్ మార్కెట్లో సవాళ్లను తాజా హైరింగ్ ట్రెండ్ రిఫ్లెక్ట్ చేస్తోందని ఫౌండిట్ సీఈఓ శేఖర్ గరిస చెప్పారు. కొన్ని చోట్ల సవాళ్లున్నా, మరి కొన్ని చోట్ల కొత్త ఉద్యోగావకాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని పరిశ్రమ రంగాలలో టైర్ 2 సిటీలలో హైరింగ్ జోరు పెరుగుతోందని, షిప్పింగ్–మెరైన్, ఎడ్వర్టయిజింగ్, పబ్లిక్ రిలేషన్స్, రిటెయిల్, ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్లలో ఈ రిక్రూట్మెంట్ సాగుతోందని వివరించారు.
రాబోయే కొంత కాలంలో హైరింగ్ యాక్టివిటీలో ఇదే ట్రెండ్ కొనసాగే ఛాన్స్ ఉందని శేఖర్ గరిస పేర్కొన్నారు. ఎకానమీ బలపడితే మళ్లీ హైరింగ్ యాక్టివిటీ జోరు పెరుగుతుందని చెప్పారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగాలు కావాలనుకునే వారూ మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉన్న స్కిల్స్‌కు భవిష్యత్‌లో అదే డిమాండ్ ఉండకపోవచ్చని చెప్పారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండాలని పేర్కొన్నారు.
వివిధ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్లాట్‌ఫామ్స్‌పై పోస్టయ్యే జాబ్ పోస్టింగ్స్ యాక్టివిటీ ట్రాక్ చేసి ఈ రిపోర్టును ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ రూపొందిస్తోంది. అహ్మదాబాద్‌లో హైరింగ్ యాక్టివిటీ 8 శాతం పెరగ్గా, జైపూర్‌లో స్వల్పంగా ఒక శాతం పెరిగిందని రిపోర్టు తెలిపింది. ఐటీ హబ్ బెంగళూరు సహా వివిధ నగరాలలో హైరింగ్ జోరు తగ్గిపోయిందని వివరించింది. బెంగళూరులో హైరింగ్ 24 శాతం తగ్గుదల రికార్డు చేసినట్లు పేర్కొంది. వేగంగా సాగుతున్న ఆటోమేషన్ వల్ల కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయని వివరించింది. ఢిల్లీ, ముంబై, పుణె, హైదరాబాద్ సిటీలలోనూ హైరింగ్ 9 నుంచి 16 శాతం దాకా తగ్గిపోయిందని వెల్లడించింది.