జెండర్ సర్టిఫికెట్​ వచ్చిందోచ్​!

V6 Velugu Posted on Oct 22, 2021

‘నేను మగపిల్లాడినా?,  ఆడపిల్లనా?’...  అనే కన్ఫ్యూజన్​లోనే బాల్యం, స్కూల్​డేస్​ గడిచిపోయాయి. ‘తేడాగా ప్రవర్తిస్తున్నావు’ అంటూ  ఫ్రెండ్స్​, సమాజం నుంచి ఎన్నో అవమానాలు.. అన్నింటినీ భరించాడు. అలాంటిది ఇప్పుడు కాన్ఫిడెంట్​గా ‘నేను ట్రాన్స్​జెండర్​’ అని చెప్పుకుంటున్నాడు. తనకి  ఈమధ్యే ‘జెండర్​ సర్టిఫికెట్’​ వచ్చింది. ఆ సర్టిఫికెట్​ అందుకుని ఎగిరి గంతేశాడు. సారీ... సారీ.. ఎగిరి గంతేసింది. ఎందుకంటే తను ఒక ట్రాన్స్​ఉమన్. ‘నేను ట్రాన్స్​జెండర్​’ అని ధైర్యంగా చెప్పుకునే రోజు వచ్చినందుకు పట్టలేనంత సంతోషంగా ఉంది అనురాధ క్రిష్ణన్​కు. ‘ట్రాన్స్​జెండర్స్​కి ఐడెంటిటీ కార్డు ఉంటే వాళ్లు గర్వంగా ఫీలవుతారు, వాళ్లకంటూ గుర్తింపు ఉంటుంది’ అనుకుంది అనురాధ. ఐడెంటిటీ కార్డుకోసం అప్లై చేసింది. ఇప్పటి అనురాధకి, ఒకప్పటి క్రిష్ణన్​కి చాలా తేడా ఉంది. తను ట్రాన్స్​జెండర్​గా మారక ముందు ‘నేను ఎందుకు పుట్టాను? అని.. ఆత్మహత్య చేసుకోవాలి’ అనుకున్నాడట. అందుకు కారణం తను మగపిల్లాడా?, ఆడపిల్లనా? అనే కన్ఫ్యూజన్​. మగపిల్లాడిగా పుట్టినప్పటికీ, ఆడపిల్లగా ఉండేందుకే ఇష్టపడేవాడు. దాంతో అందరూ అతడిని తేడాగా చూసేవాళ్లు. ‘నువ్వు మగపిల్లాడివి. మగపిల్లాడిలా డ్రెస్​ వేసుకోవాలి. అలానే బిహేవ్​ చేయాలి’ అని ఆటపట్టించేవాళ్లు. క్రిష్ణన్​ వాళ్ల చెల్లెలి డ్రెస్​​ వేసుకునేవాడు. వాళ్ల అమ్మ చీర కట్టుకునేవాడు. ‘నేను ట్రాన్స్​జెండర్​గా మారతాను’ అని  క్రిష్ణన్​ ఇంట్లోవాళ్లకి చెప్పినప్పుడు అతడికి ఏదో కోపం​ ఉందనుకున్నారు. అందరూ తనని ఎందుకలా చూస్తున్నారో  అర్థమయ్యేది కాదు. దాంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యాడు. ఆ ఎఫెక్ట్ చదువు​ మీద పడింది. కొన్ని రోజుల తర్వాత  సైకియాట్రిస్ట్​ని కలిసి ట్రీట్​మెంట్ తీసుకుని, మళ్లీ స్టడీస్​ కంటిన్యూ చేశాడు. 
తనలాంటి వాళ్లకోసం
 2017లో ట్రాన్స్​జెండర్​గా మారి, అనురాధ క్రిష్ణన్​గా పేరు మార్చుకుంది. ట్రాన్స్​ విమెన్​గా తనకు నచ్చినట్టుగా బతుకుతోంది. ప్రస్తుతం డెంటిస్ట్​గా పనిచేస్తోంది. అంతేకాదు త్రివేండ్రంలోని ‘డెమొక్రటిక్​ ట్రాన్స్​జెండర్’ సంస్థ ప్రెసిడెంట్​ కూడా. తన కాళ్ల మీద తాను నిలబడడమే కాకుండా తనలాంటి వాళ్లకి ఆసరాగా ఉండేందుకు ‘క్వీరిథైమ్​ లివింగ్​’ అనే ఆర్గనైజేషన్ కూడా​ నడుపుతోంది. 
ఇప్పటికీ మారలేదు
‘‘చట్టపరంగా సపోర్ట్ ఉన్నప్పటికీ ట్రాన్స్​జెండర్స్​ పట్ల సమాజం దృష్టి ఏమాత్రం మారలేదు. ట్రాన్స్​జెండర్​ లక్షణాలున్న పిల్లల్లో చాలామంది చదువు మానేశారు. కొంతమంది సెక్స్​వర్కర్లుగా మారారు. మరికొంతమంది బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో బిచ్చమెత్తుకుంటున్నారు. వాళ్లకి జాబ్స్​ కూడా దొరకవు. వీళ్ల వల్ల తమ కుటుంబానికి  మచ్చ అని ఫ్యామిలీ మెంబర్స్​ అనుకుంటారు. అయితే, ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తోంది”అంటూ తనలాంటి వాళ్లు పడే బాధ గురించి చెప్పింది ట్రాన్స్​ విమెన్​ డాక్టర్​ అనురాధ క్రిష్ణన్.

Tagged life style, certificate, gender,

Latest Videos

Subscribe Now

More News