Fire accident : అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ ను కూల్చేయాలని నిర్ణయం 

Fire accident : అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ ను కూల్చేయాలని నిర్ణయం 

సికింద్రాబాద్ నల్లగుట్ట బస్తీలోని ఐదంతస్తుల భవనంలోని డెక్కన్ స్పోర్ట్స్​ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై జీహెచ్​ఎంసీ అధికారులకు నివేదిక అందనుంది. ఇవాళ ఉదయం బిల్డింగ్​ స్ట్రక్చర్ స్టెబిలిటీని వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ రమణరావు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రదీప్ పరిశీలించారు. గంటల తరబడి భవనం మంటల్లో చిక్కుకోవడంతో స్లాబులు పాడైనట్లు గుర్తించారు. కొన్ని స్లాబులు క్రాస్ అయినట్లు కూడా గమనించారు. కింద ఫ్లోర్లు బాగా డ్యామేజీ కావడంతో రిపేర్ చేసేందుకు అవకాశం తక్కువని జీహెచ్​ఎంసీ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్​ ను కూల్చేయాలని నిర్ణయించారు. అన్ని అనుకున్నట్లు జరిగితే శనివారం (ఈనెల 21న) బిల్డింగ్​ ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయనున్నారు. మాదాపూర్ ప్రాంతంలో గతంలో అక్రమ నిర్మాణాలను కూల్చిన ఏజెన్సీకే బాధ్యతలు అప్పగించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు  మాలిక్ ట్రేడింగ్ అండ్ డీమాలిషన్ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారికే కూల్చివేత పనులు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. 

మంటలను ఆర్పేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఫైర్ టెండర్లను అధికారులు ఉపయోగించారు. మంటలు అదుపులోకి రావడానికి 150 మంది ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. డెక్కన్ భవనం వేడి నుంచి సాధారణ స్థితి రావడానికి నిర్విరామంగా ఫైర్ ట్యాంకర్లతో వాటర్ పంప్ చేస్తున్నారు. బిల్డింగుకు డ్రిల్ వేసి వాటర్ పంప్ చేస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. 

నల్లగుట్ట బస్తీవాసులకు పునరావాసం

డెక్కన్ భవనం కారణంగా ఇబ్బంది పడుతున్న నల్లగుట్ట బస్తీవాసులకు రెవెన్యూ అధికారులు పునరావాసం కల్పించారు. బస్తీ వాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. డెక్కన్ బిల్డింగ్ కు పక్కనే నివాసం ఉంటున్న 150 మందిని ఖాళీ చేయించి..వారికి వసతి కల్పించామని సికింద్రాబాద్ MRO శైలజ చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో పరిస్థితులన్నీ సర్దుకుంటాయని హామీ ఇచ్చారు. అప్పటి వరకూ నల్లగుట్ట బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. పొగ కారణంగా ఇబ్బందులు పడ్డ వృద్దులు, పిల్లల కోసం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.

ముగ్గురు యువకులు సజీవ దహనం..!

అగ్ని ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు యువకులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. వారంతా మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచినట్లు సమాచారం. డ్రోన్ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ ఆధారంగా  బిల్డింగ్ వెనుక భాగంలో వారి డెడ్ బాడీలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పరిస్థితి సమీక్షించారు. బిల్డింగ్ లోపల ఇంకా మంటలు అదుపులోకి రాలేదని ఫైరింజన్ల సాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. లోపలి నుంచి పొగ, వేడి వస్తుండటంతో ఎవరూ లోపలికి వెళ్లలేకపోతున్నారని కలెక్టర్ చెప్పారు. మరోవైపు.. బిల్డింగ్ లోపల డెడ్ బాడీస్ ఉన్నాయో లేదో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. వేడి పూర్తిగా తగ్గాక బిల్డింగ్ ను కూల్చడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటి వరకు పరిసర ప్రాంతాల వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక నష్టపరిహారం గురించి ఆలోచిస్తామని జిల్లా కలెక్టర్​ అమోయ్ కుమార్ స్పష్టం చేశారు. 
 
ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు నిర్థారించారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే పవర్ సప్లై ట్రిప్ అయ్యేదని, సబ్ స్టేషన్కు ఆ విషయం తెలిసేదని అంటున్నారు. మంటలు అంటుకున్న కాసేపటి వరకు కూడా మీటర్ కు కరెంటు సప్లై జరిగిందని అధికారులు చెప్పారు.