The Godfather: బిగ్ స్క్రీన్‌పై'ది గాడ్‌ఫాదర్' త్రయం.. 53 ఏళ్ల తర్వాత భారత్ లో తొలిసారి రీరిలీజ్!

The Godfather: బిగ్ స్క్రీన్‌పై'ది గాడ్‌ఫాదర్' త్రయం.. 53 ఏళ్ల తర్వాత భారత్ లో తొలిసారి రీరిలీజ్!

ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటి 'ది గాడ్‌ఫాదర్ ట్రైలజీ'.  ఇప్పుడు ఈ 'ది గాడ్ ఫాదర్' త్రయం తొలిసారి భారతదేశంలోని థియేటర్లలోకి రాబోతోంది. సెప్టెంబర్ నెల నుండి ఈ దిగ్గజ చిత్రాలను 4K లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఎంతో మంది సినీ నిర్మాతలకు, సినీ ప్రియులకు స్పూర్తినిచ్చింది. ఇప్పుడు ఈ ఐకానిక్ సినిమాలను బిగ్ స్క్రీన్ పై  ప్రేక్షకులు దగ్గరగా చూడబోతున్నారు. 

53 ఏళ్ల తర్వాత భారతీయ ప్రేక్షకుల ముందుకు..
గత 53 సంవత్సరాలుగా భారతదేశంలో థియేటర్లలో విడుదల కాని 'ది గాడ్‌ఫాదర్' ఇప్పుడు తిరిగి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు PVR INOX అధికారికంగా ప్రకటించింది.  భారతీయ ప్రేక్షకులు మొదటిసారిగా ఈ ఐకానిక్ చిత్రాలను ఒకదాని తరువాత ఒకటి చూడబోతున్నారని తెలిపింది. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా దర్శకత్వం వహించిన ఈ అద్భుతమైన చిత్రం, అధికారం, కుటుంబం, నమ్మకద్రోహం వంటి అంశాలను ఆవిష్కరించే కథను గొప్పగా తెరకెక్కించింది.

ఈ రీ-రిలీజ్ యువ తరానికి ఈ సినిమా గొప్పతనాన్ని బిగ్ స్క్రీన్‌పై అనుభవించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని దశాబ్దాలుగా ప్రేమించిన ప్రేక్షకులకు, ఇది ఒక ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతిని ఇస్తుంది అని PVR INOX  లిమిటెడ్ లీడ్ స్ట్రాటజిస్ట్ నిహారికా బిజ్లీ తెలిపారు. పీవీఆర్ ఐనాక్స్ లో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవాలను అందించడమే తమ నిరంతర ప్రయత్నమని వెల్లడించింది. 

1972లో మొదటిసారి విడుదలైన ఈ చిత్రం, మార్లోన్ బ్రాండో, అల్ పాసినో, రాబర్ట్ డి నిరో వంటి లెజెండరీ నటుల అద్భుతమైన నటనతో ప్రపంచ సినిమాలోనే ఒక కొత్త చరిత్రను సృష్టించింది. కథాకథనంలో కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేసి, సినిమా చరిత్రలోనే అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన 'ది గాడ్‌ఫాదర్ పార్ట్ II '(1974), 'ది గాడ్‌ఫాదర్ పార్ట్ III' (1990) ఈ సిరీస్‌కు మరింత కీర్తిని తెచ్చిపెట్టాయి. మార్యో పుజో రాసిన నవల ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్, అమెరికన్ సినిమాలో ఒక గొప్ప కళాఖండంగా పరిగణించబడుతుంది.

రీ-రిలీజ్ షెడ్యూల్

ది గాడ్‌ఫాదర్: సెప్టెంబర్ 12, 2025
ది గాడ్‌ఫాదర్ పార్ట్ II: అక్టోబర్ 17, 2025
ది గాడ్‌ఫాదర్ పార్ట్ III: నవంబర్ 14, 2025

ఈ సినిమాలను థియేటర్లకు తిరిగి తీసుకురావడం ఒక గొప్ప గౌరవమని నిహారికా బిజ్లీ అన్నారు. ది గాడ్‌ఫాదర్ సిరీస్, సినిమా కథాకథనంలో ఒక బంగారు ప్రమాణం లాంటిదని, ఇది నటన, దర్శకత్వం, కథ లోతులో ఒక మాస్టర్‌క్లాస్‌ లాంటిదని ఆమె అన్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలను ప్రేరేపించిందని, ఎంతోమంది సినీప్రియులకు, దర్శకులకు స్ఫూర్తినిచ్చిందని ఆమె తెలిపింది.