గ్రేటర్‍ పాలన ఆగమాగం

గ్రేటర్‍ పాలన ఆగమాగం

వరంగల్​ బల్దియాలో నెలల తరబడి నిధుల కొరత 
సీఎం కేసీఆర్‍, మంత్రి కేటీఆర్‍ చెప్పిన ఫండ్స్ ఇయ్యలే..
పెండింగ్‍ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు పనులు బంద్‍
ట్రాన్స్​ఫర్లు, లీవ్​లపై వెళుతున్న ఆఫీసర్లు
మేయర్‍, సిటీ ఎమ్మెల్యేల గ్రూపు రాజకీయాలు

వరంగల్‍, వెలుగు : వరంగల్ ​కార్పొరేషన్​ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. కొత్త పాలకవర్గం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా పాలన మెరుగుపడలేదు. నిత్యం ఏదో ఒక సమస్య, వివాదంతో పాలన కట్టుతప్పుతోంది. నెలల తరబడి బల్దియా అకౌంట్​లో చెప్పుకోదగ్గ ఫండ్స్ లేకపోవడంతో కొత్త ప్రాజెక్టులు మూలనపడ్డాయి. అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయడంలో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలనూ విస్మరించారు. పెండింగ్‍ బిల్లులు క్లియర్‍ చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. దీంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సరిదిద్దాల్సిన మేయర్‍, పాలకవర్గం, కమిషనర్‍ సైలెంట్‍గా ఉంటున్నారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోకపోవడంతో గ్రేటర్​లో సమస్యలు పెరుగుతున్నాయి. 

కేసీఆర్‍ రూ.300 కోట్లు..  కేటీఆర్‍ రూ.200 కోట్లు రావట్లే 

గ్రేటర్‍ వరంగల్‍లో రెగ్యులర్​జీతాలు, మెయింటనెన్స్​ కోసం తప్పించి ఏ ప్రాజెక్ట్​ మొదలు పెట్టాలన్నా, పెండింగ్‍ పనులు క్లియర్‍ చేద్దామన్నా బల్దియా దగ్గర ఫండ్స్ లేవు. ఆరేండ్ల కింద వరంగల్‍ కార్పొరేషన్‍కు స్పెషల్‍గా ఏటా రూ.300 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఇంతవర కు ఆ పైసలు రాలే.  కేంద్రం స్మార్ట్​సిటీ ప్రాజెక్ట్​కింద ఫండ్స్​ కేటాయించినా రాష్ట్ర సర్కారు తన వాటా శాంక్షన్​ చేయలేదు. ఈఏడాది ఏప్రిల్‍ 20 న వరంగల్‍ వచ్చిన మంత్రి కేటీఆర్‍ తక్షణమే రూ.200 కోట్లు రిలీజ్‍ చేస్తున్నట్లు ప్రకటించారు. 8 నెలలవుతున్నా రూ.20 కోట్లు మాత్రమే విడు దల చేశారు. రూ.82.50 కోట్లతో చేపట్టిన 11 స్మార్ట్​రోడ్లు, రూ.72.50 కోట్లతో రెండో దశ భద్రకాళి బండ్‍ పనులు, రూ.12.50 కోట్లతో వడ్డే పల్లి బండ్‍ పనులు, రూ.250 కోట్లతో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లు, రూ.20.54 కోట్లతో 4 సిటీ ఎంట్రెన్స్ ద్వారాలు.. ఇలా ఏ ఒక్కటీ కంప్లీట్‍ కాలేదు. 

రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు, కార్మికులు

స్మార్ట్ సిటీతో పాటు జనరల్‍, ఎస్సీ సబ్‍ ప్లాన్, సీఎం అష్యూరెన్స్​ఫండ్స్​తో రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, మంచినీటి పైపుల లీకేజీలు.. వంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఏప్రిల్‍ నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లంతా సమ్మె బాట పట్టారు. పెండింగ్‍ బిల్లులిచ్చేవరకు పనులు చేయలేమంటూ మధ్యలోనే ఆపేశారు. మున్సిపల్‍ కార్మికులు సైతం తమకు నెలకు రూ.21 వేల కనీస జీతం ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా రోడ్డెక్కుతున్నారు. 

అవినీతి ఆరోపణలొచ్చినా లైట్‍

బల్దియాలోని కొందరు అధికారులు కార్మికుల జీతాలు స్వాహా చేసిన ఆరోపణలు వచ్చాయి. పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు తేగా లెక్కల్లో.. రూ.కోట్ల అవినీతి జరగడంపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున ధర్నాలకు దిగాయి. అయినా పాలకవర్గం స్పందించలేదు. కాంట్రాక్ట్ శానిటేషన్‍ సిబ్బంది ఎంపికలో అధికారులు, కార్పొరేటర్లు కలిసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చారు. ఇంకొందరు ఆఫీసర్లు తక్కువ మందితో పనిచేయించి.. లేనివారి పేరుతో నెలనెలా లక్షల రూపాయల జీతాలు స్వాహా చేసినా పట్టించుకోలేదు. ఫాగింగ్‍ మిషన్లు, ట్రాక్టర్ల కొనుగోలులో అక్రమాలు.. ఇలా ఎన్ని ఆరోపణలు వచ్చినా యాక్షన్ తీసుకోకుండా లైట్‍ తీసుకున్నారు. 

ఆఫీసర్లు.. అయితే ట్రాన్స్​ఫర్, లేదంటే లీవ్​

గ్రేటర్‍ పాలకవర్గం, సిటీ ప్రజాప్రతినిధుల నుంచి ప్రెజర్​తట్టుకోలేక రెండు నెలల కింద ఎస్‍ఈ సత్యనారాయణ మొదట లాంగ్‍ లీవ్‍ పెట్టారు. ఆ తర్వాత ట్రాన్స్​ఫర్​చేయించుకున్నారు. ఈఈ బి.ఎల్‍.శ్రీనివాసరావు లీవ్​పై వెళ్లారు. కొత్తగా వచ్చిన ఎస్‍ఈ కృష్టారావు సైతం లీవ్‍ పెట్టారు. టౌన్‍ప్లానింగ్‍ సెక్షన్‍లో టీపీఎస్‍లు సెలవుపై వెళ్లారు. ఇలా ఒక్కొక్కరుగా ఇక్కడి నుంచి ఎలా వెళ్లాలా అన్నట్లు చూస్తున్నట్లు సమాచారం.  

కంపు కొడుతున్న గ్రేటర్‍ కాలనీలు

వరంగల్‍ ట్రైసిటీ పరిధిలో దాదాపు 11 లక్షల జనాభా ఉండగా.. 66 డివిజన్ల పరిధిలో వెయ్యి వరకు కాలనీలున్నాయి. గ్రేటర్లో కలిసి విలీన గ్రామాలున్నాయి. కాంట్రాక్టర్లు పనులు ఆపేయడంతో కాలనీలన్నీ అధ్వానంగా తయారయ్యాయి. గుంతల రోడ్లు, ఎక్కడపడితే అక్కడ మంచినీటి పైపుల లీకేజీలు కనపడుతున్నాయి. గతేడాది మేలో గుండు సుధారాణి మేయర్‍ అయిన తర్వాత కూడా పాలనపై పట్టు సంపాదించలేకపోయారు.  మేయర్‍, డిప్యూటీ మేయర్‍తో కలిసి తూర్పు ఎమ్మెల్యే నరేందర్‍, చీఫ్​విప్​ వినయ్‍భాస్కర్‍ ముగ్గురు మూడు గ్రూపులుగా రాజకీయాలు చేస్తున్నారు. ఐఏఎస్‍ ఆఫీసర్, గ్రేటర్‍ కమిషనర్‍ ప్రావీణ్య సైతం పొలిటికల్‍ ప్రెజర్​తో చాలా విషయాలు పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా కావాల్సిన  ఫండ్స్​లేక.. పాలన సరిగ్గా నడవక గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ డెవలప్‍మెంట్‍ ఆగిపోయింది.