ధరణిలో కొత్త వివరాల నమోదుకు అవకాశమివ్వని సర్కారు

ధరణిలో కొత్త వివరాల నమోదుకు అవకాశమివ్వని సర్కారు
  • వివాదాల్లో ఉన్న భూములను వెబ్​సైట్​లో ఎక్కించని ఆఫీసర్లు
  • కొత్తగా వివరాల నమోదుకు అవకాశమివ్వని సర్కారు
  • ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన రమేశ్​కు చెందిన 2 ఎకరాల భూమి కొందరు కబ్జా చేయడంతో 2011లో సూర్యాపేట సివిల్ కోర్టును ఆశ్రయించారు. 11 సంవత్సరాల తరువాత రమేశ్ కు భూమి హక్కులు కల్పిస్తూ  కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అయితే పట్టా పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరకు వెళ్తే కోర్టులో కేసు ఉన్నందున భూమి వివరాలను ధరణిలో ఎక్కించలేదని చెప్పారు. ఇప్పుడు ఎక్కిద్దామంటే.. సైట్​లో ఆప్షన్​లేదని అన్నారు. దీంతో ల్యాండ్ మ్యాటర్స్ లో అప్లయ్ చేసుకొని ప్రభుత్వం ఎప్పుడు ఆప్షన్​ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 

సూర్యాపేట మండలానికి చెందిన సురేశ్ కు చెందిన 23 గుంటల భూమి తమదే అంటూ కొందరు 2013లో సూర్యాపేట సివిల్ కోర్ట్ లో కేసు వేశారు. తొమ్మిదేండ్ల తర్వాత సురేశ్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ ఆఫీసర్లను అడిగితే ఆన్ లైన్ లో భూమి వివరాలు నమోదు కాలేదని చెబుతున్నారు. దీంతో పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ సర్కారుకు దరఖాస్తు పెట్టుకున్నారు.

సూర్యాపేట వెలుగు: ఏండ్ల తరబడి భూమి కోసం కోర్టులో పోరాడి కేసు గెలిస్తే.. ఆఫీసర్లేమో ధరణిలో ఆ భూముల వివరాలు లేవని అంటుండడంతో హక్కుదారులు ఆందోళనకు గురవుతున్నారు. కోర్టులో కేసు తేలేందుకే ఏండ్లు పట్టాయని, ఇప్పుడు పట్టా పాస్​బుక్​ల కోసం మళ్లీ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా సర్కారు అన్ని వివరాలను ఆన్​లైన్​చేసింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను ఆన్ లైన్ చేసి ప్రొహిబీటెడ్​లిస్ట్ లో పెట్టాల్సి ఉండగా సిబ్బంది మాన్యువల్ లో కోర్టు కేసు అని రాసి ఆన్ లైన్ లో నమోదు చేయకుండా వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాల భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయి. 2020లో అందుబాటులోకి వచ్చిన ధరణి సాఫ్ట్ వేర్ లో ఈ భూముల వివరాలు కనిపించడం లేదు. 

కొత్తగా నమోదుకు ఆప్షన్​ లేదు
ధరణిలో కొత్తగా భూముల వివరాల నమోదుకు ఆప్షన్​ఇవ్వకపోవడంతో ఇప్పుడు హక్కుదారులు ఇబ్బంది పడుతున్నారు. కోర్టు కేసులు తేలినవారంతా పట్టా పాస్​బుక్​ల కోసం రెవెన్యూ ఆఫీస్​ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆప్షన్ వస్తే తప్ప తామేం చేయలేమని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. దీంతో బాధితులు చేసేదేం లేక ల్యాండ్ మాటర్స్ లో నమోదు చేసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 వేలకుపైగా ల్యాండ్ మాటర్స్ లో నమోదు చేసుకోవడం గమనార్హం.  ఇప్పటికే కోర్టు కేసులకే ఏండ్ల టైం పట్టిందని, ప్రభుత్వం భూముల వివరాల నమోదుకు త్వరగా ఆప్షన్ ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.

ఆన్​లైన్​లో భూమి వివరాలు లేవంటున్రు
మునగాల మండలం గణపవరం రెవెన్యూ పరిధిలో మాకు రెండు ఎకరాల 74 సెంట్ల భూమి ఉంది. అమ్మానాన్న చనిపోవడంతో పంపకాల్లో భూమిని నేనే చేసుకుంటూ కబ్జాలో ఉన్నా. నాకు తెలియకుండా తమ్ముడు, అక్క కలిసి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కోదాడ కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పాస్ బుక్​ కోసం అప్లయ్ చేస్తే ఆన్​లైన్ లో వివరాలు లేవంటున్నరు. త్వరగా ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చి పట్టా పాస్​బుక్​జారీ చేయాలె.
– కిలారు సత్యనారాయణ, పోలేనిగూడెం,చిలుకూరు మండలం
 

ఆప్షన్​ వచ్చే అవకాశం ఉంది
ఆన్ లైన్ లో నమోదు కాని భూముల వివరాలను ఎంట్రీ చేసేందుకు ఆప్షన్ లేదు. త్వరలోనే ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా భూ వివరాలు ధరణిలో కనిపించకపోతే ల్యాండ్ అండ్ మ్యాటర్స్​లో నమోదు చేసుకోవాలి. 
– వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్, సూర్యాపేట