ఐటీఐలు ఆగం.. ఉపాధి చూపే ఇన్‌‌స్టిట్యూట్లను పట్టించుకోని సర్కారు

ఐటీఐలు ఆగం.. ఉపాధి చూపే ఇన్‌‌స్టిట్యూట్లను పట్టించుకోని సర్కారు
  • స్టూడెంట్లకు ఆసక్తి ఉన్నా ఐటీఐలను పెంచుతలే
  • దశాబ్దాల నాటి బిల్డింగుల్లోనే క్లాసులు..
  • సరిపడా స్టాఫ్, సౌలతులు లేక ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలోని ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌‌స్టిట్యూట్) లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్లతో ఉపాధి మార్గాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచే ఐటీఐలను పట్టించుకోవడం లేదు. ఫెసిలిటీస్ కల్పించి, కొత్త ట్రేడ్లను పరిచయం చేయాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇన్‌‌స్టిట్యూట్ల మెయింటెనెన్స్‌‌కు పైసా ఇవ్వకపోవడం, దశాబ్దాల కింద నిర్మించిన బిల్డింగులను పునరుద్ధరించకపోవడంతో కాలేజీలన్నీ భూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. సరిపడా స్టాఫ్, సౌలతులు లేక స్టూడెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. స్కిల్స్ పెంచుకునేందుకు అవసరమైన ప్రాక్టికల్​ సామగ్రి సమకూర్చేందుకు కూడా ఫండ్స్ ఇవ్వకపోవడంతో అవస్థలు పడాల్సిన పరిస్థితి.

రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ కంపెనీలు, ఇండస్ట్రీల్లో స్కిల్డ్ కార్మికులకు ఫుల్ డిమాండ్ ఉన్నా ఐటీఐలను పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలోని యువత ఉద్యోగాలకు దూరమవుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు, ఇండస్ట్రీలు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.

టెక్నికల్ ట్రేడ్లకు మస్త్ డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 295 ఐటీఐలున్నాయి. ఇందులో కేవలం 66 ప్రభుత్వ ఐటీఐలు కాగా.. మిగతా 229  ప్రైవేటు పరిధిలో కొనసాగుతున్నాయి. పదో తరగతి తర్వాత ఐటీఐ చదివిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతోపాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎంతోమంది నిరుపేదలు ఇంటర్, పాలిటెక్నిక్ కాకుండా ఐటీఐ వైపు చూస్తున్నారు. ఇటీవల ఉద్యోగావకాశాలు పెరగడంతో ఇంటర్, డిగ్రీ చదివినోళ్లు కూడా టెక్నికల్ స్కిల్స్ కోసం ఐటీఐలలో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, మెకానిక్ డీజిల్ వెహికల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ తదితర ఇంజినీరింగ్ ట్రేడ్లతోపాటు స్టెనోగ్రాఫర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, ఇన్​స్ట్ర్యూమెంట్ మెకానిక్, వెల్డర్ లాంటి నాన్ టెక్నికల్ ట్రేడ్లకు కూడా మస్త్ డిమాండ్ ఉంది. దీంతో ఆయా ట్రేడ్లలో ట్రైనింగ్ తీసుకునేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు ప్రతి అకడమిక్​ ఇయర్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ ఐటీఐల్లో అడ్మిషన్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో ఏటా ప్రతి కాలేజీకి అక్కడున్న సీట్లకు రెండు మూడింతల అప్లికేషన్లు వస్తున్నాయి. మెరిట్ ఆధారంగా స్టూడెంట్లను ఎంపిక చేస్తుండగా.. సరిపడా ప్రభుత్వ ఐటీఐ కాలేజీలు లేక మిగతా విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుకు వెళ్తున్నారు. వీరంతా పేద విద్యార్థులే కావడంతో వేలకు వేలు ఫీజులు కట్టడం భారంగా మారింది.

కూలిపోయే స్థితిలో బిల్డింగులు

ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సర్కారు ఐటీఐలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఐటీఐల మెయింటెనెన్స్‌‌‌‌కు అక్కడి అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నా ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు జరగడం లేదు. దీంతో ఐటీఐలు డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు నోచుకోక, కనీస సౌకర్యాలు లేక, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ఐటీఐల్లో ఇదే పరిస్థితి. వరంగల్‌‌‌‌లోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌‌‌‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థుల కోసమని 1957లోనే దీన్ని ఏర్పాటు చేశారు. ఆరు దశాబ్దాలు దాటినా ఇంతవరకు ఆ బిల్డింగ్‌‌‌‌కు రిపేర్లు చేయలేదు. దీంతో బిల్డింగ్ మొత్తం శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్నాయి. దీంతో స్టాఫ్, స్టూడెంట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి. ప్రతి వర్షాకాలంలో పెచ్చులూడి పడుతుండగా.. బిల్డింగ్ పిల్లర్లు ఇనుప చువ్వలు తేలి కూలిపోయే స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ఆఫీసర్లు బిల్డింగ్ రిపేర్ల కోసం రూ.86 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేసి.. ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరోవైపు ఈ ఐటీఐలో విద్యార్థులకు కనీసం టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక్కడి టాయిలెట్స్ పూర్తిగా ధ్వం సం కాగా.. చదువుకుందామని వచ్చిన పిల్లలంతా సాయంత్రం వరకు ఉగ్గబట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. తాగునీటిని బయటి నుంచి తెచ్చుకుంటున్నామని, పని నేర్చుకోవడానికి అవసరమైన ముడిసరుకు కావాలన్నా ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు.

దశాబ్దాలుగా అవే ట్రేడ్లు

ఐటీఐల్లో ట్రైనింగ్ పూర్తి చేసిన స్టూడెంట్స్ ఎంట్రన్స్‌‌‌‌ల ద్వారా డిప్లొమా, బీటెక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశం ఉం టుంది. కానీ ఐటీఐల్లో దశాబ్దాల కింద ప్రవేశపెట్టిన ట్రేడులతోనే నెట్టుకొస్తున్నారు. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. రెండేండ్ల కిందట ఆదిలాబాద్ ఐటీఐలో సాయిల్ టెస్టింగ్ కు సంబంధించిన ట్రేడ్ కొత్తగా ప్రవేశపెట్టారు. మిగతా ఐటీఐల్లో కొత్త ట్రేడ్ల ముచ్చటే కనిపించడం లేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్, లెదర్, అగ్రికల్చర్ మెషినరీ, కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ ఉడ్ వర్కింగ్, హాస్పిటాలిటీ, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొడక్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ టెక్నాలజీ తదితర విభాగాల్లో కోర్సులున్నా చాలా కాలేజీల్లో అవి అమలు కావడం లేదు. దీంతో పాత కోర్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వరంగల్ ఐటీఐకి ప్రిన్సిపల్, ట్రేడ్ ఆఫీసర్లు, డిప్యూటీ, అసిస్టెంట్ ట్రేడ్ ఆఫీసర్లు ఇలా అన్నీ కలిపి 80 పోస్టులు శాంక్షన్ కాగా.. అందులో డిప్యూటీ, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు సహా 37 పోస్టులు ఖాళీగానే ఉండటం గమనార్హం.

ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు

ఇండస్ట్రియల్ ఏరియాల్లో నిపుణులైన కార్మికులకు మస్త్ డిమాండ్ ఉంటుంది. అందులో ఐటీఐ నుంచి వచ్చిన వారికి తగిన ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఫెసిలిటీస్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎక్కువ శాతం ఇండస్ట్రీలు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి పని చేయిస్తున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు వరంగల్, రామగుండం తదితర నగరాల్లోని ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఒడిశా, బిహార్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్​ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులే టెక్నికల్ పోస్టుల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఐటీఐలపై దృష్టి పెట్టి  తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని, ఇంజినీరింగ్ కాలేజీల్లో మాదిరే ఇక్కడ కూడా క్యాంపస్​రిక్రూట్​మెంట్లు జరిగే దిశగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.