వీఆర్ఏలను పట్టించుకోని సర్కారు

వీఆర్ఏలను పట్టించుకోని సర్కారు

సమ్మె మొదలైన 45 రోజుల్లో వివిధ కారణాలతో  27 మంది వీఆర్​ఏలు మృత్యువాతపడ్డారు. యాక్సిడెంట్​లో నలుగురు, గుండెపోటు, ఇతర కారణాలతో 19 మంది చనిపోయారు.

హైదరాబాద్, వెలుగు: సమ్మెలో ఉన్న వీఆర్ఏలు పిట్టల్లా రాలిపోతున్నారు. సమ్మె మొదలైన 45 రోజుల్లో 27 మంది వివిధ కారణాలతో మృతిచెందారు. వారిలో నలుగురు ధర్నాలో పాల్గొని వెళ్తూ యాక్సిడెంట్​కు గురై  చనిపోగా, పేస్కేల్ రాదేమోనని ఆందోళనకు గురై గుండెపోటు, అనారోగ్య కారణాలతో 19 మంది చనిపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (కామారెడ్డి)లో గత రెండ్రోజుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, ఇద్దరు గుండెపోటుతో చనిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న చాలా మంది తమ వారసులకు ఉద్యోగాలు వస్తాయో రావోనన్న బెంగతోనే గుండెపోటుకు గురవుతున్నారని వీఆర్ఏ జేఏసీ కో చైర్మన్ రమేశ్ ​బహదూర్ వెల్లడించారు. వీఆర్ఏల సమ్మెతో రెవెన్యూ  పాలన గాడితప్పింది. అయినా సర్కారు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

సర్కారు దిగిరాకపోవడంతో సమ్మెకు
వీఆర్‌ఏలకు పే స్కేల్ ఇస్తామని, రిటైర్మెంట్ కోరితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి ఈ నెల 11కు సరిగ్గా రెండేళ్లు పూర్తి కానున్నాయి. 2020 సెప్టెంబర్ 11న అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వీఆర్‌ఏల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తగా.. సీఎం స్పందించారు.  వీఆర్ఏల్లో 99% మంది దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని, వారు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుందని నాడు సీఎం పేర్కొన్నారు. వారికి పేస్కేల్ ఇస్తామని, దానివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.260 కోట్ల భారం పడుతుందని చెప్పారు. కానీ రెండేళ్లయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, వివిధ రకాలుగా నిరసనలు తెలిపినా స్పందన లేకపోవడంతో చివరికి జులై 25 నుంచి వీఆర్ఏలు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. దీక్షల్లో పాల్గొని వెళ్తూ యాదాద్రి జిల్లాకు చెందిన కాట్రోతు భిక్షపతి, అల్లి రాములు, జగిత్యాలకు చెందిన ఎండబెట్ల లక్ష్మి రాజాం, జనగామ జిల్లాకు చెందిన దండు నర్సయ్య రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. కామారెడ్డి  జిల్లా ఎల్లారెడ్డికి చెందిన అశోక్  పే స్కేల్ రాదేమోనన్న బెంగతో ఉరేసుకున్నాడు. దీక్షలో కూర్చున్న 22 మంది మానసిక వేదనతో గుండెపోటు, అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో బొజమ్ వీర స్వామి, కావలి జంగయ్య, గంగవ్వ,  జిన్న పుల్లమ్మ, జి.ముత్తన్న, హైమద్ బీ, లింగవ్వ, సాయన్న, బొగ్గు హనుమంతు, కుక్కల చెన్నమల్లు, తాళ్లపళ్లి పెద్దన్న, తోట శంకరయ్య, రాజేశ్వరి, గుజ్జేటి నర్సయ్య, బోరుకుంట అక్కు, ఉప్పరి పెద్ద నర్సన్న, తాయమ్మ, కావలి మందకల్, నడికుడి జంగయ్య , అల్లి రాములు, నీరడి సత్యమ్మ, బండి విజయ్​ఉన్నారు.

పేస్కేల్ పై జీవో ఇవ్వాలి
మాకు పే స్కేల్ ఇస్తమని, వారసులకు ఉద్యోగాలు ఇస్తమని సీఎం కేసీఆర్ ఇప్పటికే చాలా సార్లు హామీ ఇచ్చి ఉన్నరు. కానీ అమలు చేయలేదు. ప్రభుత్వంపై నమ్మకంతోనే ఇన్నేళ్లు ఓపిక పట్టినం. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతోనే సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది. వెంటనే పేస్కేల్ పై, వారసత్వ ఉద్యోగాలపై జీవో ఇవ్వాలి.‌
- రమేష్ బహదూర్, కో చైర్మన్, వీఆర్ఏ జేఏసీ