వీఆర్ఏల పాణాలు తీసుకుంటున్నా పట్టించుకోని సర్కారు

వీఆర్ఏల పాణాలు తీసుకుంటున్నా పట్టించుకోని సర్కారు
  • వీఆర్ఏల బతుకుయాతన
  • 77 రోజులుగా 22 వేల మంది ఆందోళన
  • మూడు నెలలుగా జీతాల్లేక కుటుంబపోషణకు పాట్లు

పే స్కేల్, వారసత్వ ఉద్యోగాల కోసం 22 వేల మంది వీఆర్ఏలు 77 రోజులుగా సమ్మె చేస్తున్నా సర్కారు స్పందిస్తలేదు.. ఉద్యోగాలు ఉంటయో, ఊడ్తయో తెల్వక పాణాలు తీసుకుంటున్నా కనికరిస్తలేదు.. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలను సాదుకునేటందుకు వీఆర్ఏలు అష్టకష్టాలు పడ్తున్నారు. ఇండ్లు, జాగలు, ఆఖరికి భార్య  ఒంటి మీది పుస్తెల తాళ్లు కుదవబెట్టి వచ్చిన పైసలతో ఇంటి ఖర్చులు ఎల్లదీస్తున్నారు. చేతిలో పైసల్లేక పిల్లలను చదివించుకోలేకపోతున్నామని, వివిధ రోగాలతో ఆసుపత్రులపాలైన ఆత్మీయులను కోల్పోతున్నామని కన్నీరు మున్నీరవుతున్నారు.  

ఆసిఫాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో 22 వేల మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని, వారసత్వ ఉద్యోగాలు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ 2017 ఫిబ్రవరి 24న ప్రగతి భవన్ లో హామీ ఇచ్చారు. కానీ పే స్కేల్ ఇవ్వకుండా రూ.6,500 వేతనాన్ని రూ.10,500కు పెంచి చేతులు దులుపుకొన్నారు. ఇక రెగ్యులరైజేషన్ మాటే మరిచిపోయారు. 2020 సెప్టెంబర్ 9న వీఆర్వో వ్యవస్థ  రద్దుపై అసెంబ్లీలో మాట్లాడుతూ మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని కేసీఆర్​మరోసారి ప్రకటించారు. కానీ రెండేళ్లు కావొస్తున్నా ఆ హామీ నెరవేరలేదు. దీంతో వీఆర్ఏలు జులై 25 నుంచి సమ్మెలోకి వెళ్లారు. సమ్మెలో భాగంగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు.  సెప్టెంబర్​13న 33 జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన వీఆర్ఏలు హైదరాబాద్ ను హోరెత్తించారు. బారికేడ్లు, ఇనుప కంచెలు దాటుకుని ట్యాంక్​బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు.  పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డా మిలియన్ మార్చ్ తరహాలో వారి నిరసన తెలియజేశారు.  ఈ క్రమంలో కేటీఆర్ తో జరిపిన​చర్చలు కూడా విఫలమయ్యాయి. 

ఇప్పటికే 50 మందికి పైగా మృతి

77 రోజులుగా సమ్మె చేస్తున్నా సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో తమ ఉద్యోగాలు ఉంటయో, ఊడ్తయోననే బెంగ వీఆర్ఏలకు పట్టుకున్నది.  దీంతో ఇప్పటికే సుమారు 50 మంది దాకా వీఆర్ఏలు ఆత్మహత్యలు, గుండెపోట్లతో ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారు దినమొక గండంగా బతుకులీడుస్తున్నారు.  మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో  కుటుంబాలను పోషించుకునేందుకు అరిగోస పడ్తున్నారు. ఇల్లు, జాగ, భార్య మెడలో నల్లపూసల తాడు.. ఇలా ఏది దొరికితే దానిని కుదువబెట్టి ఖర్చులు ఎల్లదీసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమకు కూడా ఆత్మహత్యలు తప్ప వేరే దారి కనిపిస్తలేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. 

వైద్యం చేయించలేక బిడ్డ చచ్చిపోయింది

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పుట్టిగూడ వీఆర్ఏ సాగర్​ది దయనీయ గాథ. ఆయనకు మూడు నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబం గడవడం కష్టమైంది. బాదంపెల్లి గవర్నమెంట్ స్కూల్​లో ఫోర్త్ క్లాస్ చదువుతున్న కూతురు సహస్ర(9) నెలరోజుల కిందట విషజ్వరంతో మంచం పట్టింది. పెద్దాసుపత్రికి తీసుకెళ్లే స్తోమత లేక జన్నారంలోని ప్రైవేట్ డాక్టర్​కు చూపించాడు. మరో నాలుగు రోజులకు బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. అప్పు చేసి కరీంనగర్​లోని ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ సెప్టెంబర్15న చనిపోయింది. తమది పేద కుటుంబమని, వైద్యం చేయించేందుకు పైసల్లేక చేతికొచ్చిన బిడ్డను పోగొట్టుకున్నామని సాగర్ దంపతులు బోరున విలపిస్తున్నారు. 

పుస్తెలు తాడు అమ్ముకొని బతుకుతున్న

మూడు నెలలుగా జీతాలు లేక ఇల్లు గడుస్తలేదు. నాకు ఇద్దరు పిల్లలు. కిరాయి ఇంట్లో ఉంటున్నాం. జీతాలు లేకపోవడంతో ఒక పూట తింటూ ఒక పూట పస్తులు ఉంటున్నాం. నిత్యావసర సరుకుల కోసం అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చిన. అప్పులవాళ్లకు, కిరాయి ఉంటున్న ఓనర్​కు సమాధానం చెప్పలేక మొన్ననే నా మెడలో పుస్తెలతాడు అమ్మేసి పసుపు తాడు వేసుకున్న. ఇప్పటికైనా సర్కారు పట్టించుకోకుంటే మాకు ఆత్మహత్యలే గతి.

– కాసిపేట రాధ, మంథని, పెద్దపల్లి జిల్లా

తులం బంగారం కుదువ బెట్టిన

నాకు నలుగురు ఆడపిల్లలు. జీతాలు రాక ఇల్లు గడవడం కష్టమైతాంది. చేతిల చిల్లిగవ్వ లేదు. దసరా పండుగకు పైసలు లేకుండే. కో ఆపరేటివ్ బ్యాంకులో నా భార్య పుస్తెల తాడు తాకట్టు పెట్టి 42 వేలు లోన్​ తెచ్చిన. కిరాణా షాపులో బాకీ పడ్డ 20 వేలు కట్టిన. మరో పది వేలు పెట్టి పండక్కి పిల్లలకు బట్టలు, నిత్యావసర సరుకులు కొన్న. మిగిలిన 10 వేలు ఇంటి ఖర్చు కోసం ఉంచిన. ఇంకెన్ని రోజులు సమ్మె నడుస్తదో తెల్వది. ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రావద్దు. 

 – కొయ్యల శంకర్ , వీఆర్ఏ , పర్సనంబల, ఆసిఫాబాద్

ఫైనాన్స్ వాళ్లు ఫోన్లు చేస్తుండ్రు

ఆగస్టులో తులం బంగారం ముత్తూట్ ఫైనాన్స్​లో కుదువ పెట్టిన. రూ.33,830 ఇచ్చినరు. రెండు నెలలుగా ఇంట్లో ఖర్చులకు, పిల్లల చదువులకు అవి అయిపోయినయ్​. ఇప్పుడు చేతిలో రూపాయి లేదు. ఫైనాన్స్ వాళ్లు మిత్తి కట్టాలని ఫోన్లు చేస్తుండ్రు. కంట్రోల్ బియ్యం, చట్నీలు తిని కడుపు నింపుకొంటున్నం.

-శ్రీశైలం, వీఆర్ఏ, మిడ్జిల్