
- ఫార్మాసిటీ కోసం మూడున్నర వేల ఎకరాల్లో దౌర్జన్యం
- పట్టాదార్ల పర్మిషన్ లేకుండానే ధరణిలో 1,800 ఎకరాలు టీఎస్ ఐఐసీకి మార్పు
- ఎలాంటి అమ్మకాలు, కొనుగోళ్లు జరగకుండా మరో 1,700 ఎకరాలు లాక్
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులూ బేఖాతరు
- రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రైతుల గగ్గోలు
- ఏడాదిగా రైతు బంధు, రైతు బీమా, క్రాప్ లోన్స్ బంద్ పెట్టిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: మూడున్నర వేల ఎకరాల రైతుల భూములు సర్కారు చెరలో బందీ అయ్యాయి. చేతిలో ధరణి పోర్టల్ ఉంది కదా అనే ధీమాతో పట్టాదారుల పర్మిషన్ లేకుండానే 1,800 ఎకరాలను చట్ట విరుద్ధంగా టీఎస్ ఐఐసీ భూములుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. మరో 1,700 ఎకరాల భూములను ఎలాంటి అమ్మకాలు, కొనుగోళ్లు జరగకుండా లాక్ చేసింది. ఆ రైతులందరికీ రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు క్రాప్ లోన్స్ అందకుండా చేస్తూ.. భూములను వదులుకునేలా ఒత్తిడి తెస్తున్నది. ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వబోమని ఉద్యమిస్తున్న రంగారెడ్డి జిల్లా యాచారం మండల రైతులను రాష్ట్ర సర్కారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీఎస్ఐఐసీ) కలిసి సతాయిస్తున్నాయి. భూమిని స్వాధీనం చేసుకోవద్దని, ఎలాంటి బలవంతపు చర్యలు చేయొద్దని హైకోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఏకపక్షంగా ప్రభుత్వం భూసేకరణ సాగిస్తున్నది. బలవంతంగా భూములు గుంజుకుంటే తాము బతికేదెట్లా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల మధ్య ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాల భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే మొదటి దశలో అసైన్డ్ ల్యాండ్, కొంత పట్టా ల్యాండ్ కలిపి 10,490 ఎకరాల భూములు సేకరించింది. మరింత భూమిని సేకరించేందుకు ఏడాది కాలంగా పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నది. తమ భూములు ఇవ్వబోమని రైతులు మొదటి నుంచి ఆందోళనకు దిగుతున్నారు. బలవంతపు భూసేకరణపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. బలవంతపు భూసేకరణ చేయొద్దని హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు తమ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా మూడున్నర వేల ఎకరాల రైతుల భూములకు భూసేకరణ విభాగంలో డబ్బులు (అవార్డు పాస్) జమ చేశారు. ఇది కూడా పాత మార్కెట్ వాల్యూ ప్రకారం కేవలం ఎకరాకు రూ. 8 లక్షలు జమ చేసినట్లు తెలిసింది. ఇవన్నీ యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, మంగళి గడ్డ తండాల్లోని భూములే. ఇందులో సుమారు 1,800 ఎకరాల పట్టా భూములను రైతుల కాన్సెంట్ లేకుండానే, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీఎస్ ఐఐసీ పేరిట ప్రభుత్వం మార్చేసింది. అలాగే, మరో 1,700 ఎకరాల భూమిపై ఎలాంటి అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం లేకుండా లాక్ చేసింది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతు బంధు, క్రాప్ లోన్స్ బంద్
రైతుల దగ్గర పట్టాదారు పాస్ బుక్స్ ఉన్నప్పటికీ ఆ భూములన్ని ధరణి పోర్టల్ లో టీఎస్ఐఐసీ పేరిట చూపిస్తుండడంతో బ్యాంకర్లు రైతులకు క్రాప్ లోన్లు ఇవ్వడం లేదు. క్రాప్ లోన్ రెన్యువల్ చేయకపోగా గతంలో తీసుకున్న లోన్లు పూర్తిగా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. అంతేగాక వీరికి రైతుబంధు సాయం కూడా ఆగిపోయింది. ఓ వైపు బ్యాంకులో అప్పు పుట్టక, మరోవైపు రైతు బంధు సాయం అందక రైతులు పంట పెట్టుబడి కోసం విలవిలలాడుతున్నారు.
బలవంతంగా మార్చేశారు
యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన కనుగుల బాలకృష్ణకు 70/ఇ సర్వే నంబర్ లో 2 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. ఈయనకు పట్టాదారు పాస్ బుక్(టీ05270090299) కూడా జారీ అయింది. రెండేండ్లు రైతుబంధు కూడా జమ అయింది. ఈ భూమిని తన ఇద్దరు కొడుకులు సాగు చేసుకుంటున్నారు. ఈయన కుటుంబం కూడా భూమి ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఈ భూమే తమకు జీవనోపాధి అని, భూమి ఇచ్చేది లేదని మొదటి నుంచి చెప్తున్నారు. అయినా ఈ భూమిని ధరణిలో టీఎస్ఐఐసీ పేరిట మార్చేశారు. బలవంతంగా భూరికార్డులను మార్చడంపై బాలకృష్ణ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
బిడ్డల పెండ్లి చేసుడెట్ల
తాటిపర్తి గ్రామానికి చెందిన దార రాములుకు 178, 179 సర్వే నంబర్ లో 2.10 ఎకరాలు ఉంది. ఆయనకు పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు బిడ్డలు ఉన్నారు. తాటిపర్తి గ్రామ భూములను ధరణి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బిడ్డల పెళ్లి చేసేందుకు భూమి అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు లోన్ కూడా రాలేదు. ఈ నెల 11న పెద్ద కూతురు పెండ్లి పెట్టుకున్నాడు. పెండ్లి ఖర్చులకు ఏం చేయాలో అర్థంకాక పట్టాదారు పాస్‌బుక్ కుదవపెట్టి ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పు తెచ్చాడు. బిడ్డ పెండ్లయితే చేస్తున్నగానీ అప్పులు తీర్చుడు ఎట్లనో అర్థం కావడం లేదని రాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఏం చేసి బతకాలి..
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన దళిత మహిళ దార ఈశ్వరమ్మకు తాటిపర్తి రెవెన్యూ పరిధిలోని 183/లు సర్వే నంబర్ లో ఒక ఎకరం 2 గుంటల భూమి ఉంది.
ఈ భూమికి పట్టాదారు పాస్ బుక్(టీ05270100234) కూడా జారీ అయింది. ఫార్మాసిటీకి భూమి ఇచ్చేందుకు ఈమె ఎలాంటి కాన్సెంట్ ఇవ్వలేదు. ఎక్కడా సంతకం చేయలేదు. కానీ, ఈమె భూమి ప్రస్తుతం ధరణిలో టీఎస్ఐఐసీ పేరిట చూపిస్తున్నది. దీంతో తనకు రావాల్సిన రైతుబంధు, క్రాప్ లోన్ ఆగిపోయాయని ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తంచేస్తున్నది. రూ.కోటి విలువ చేసే భూమిని తక్కువ ధరకు ఎలా ఇవ్వాలని, సర్కార్ ఇచ్చే పైసలతో బయట 5 గుంటల భూమి కూడా రాదని అంటున్నది. తన పెద్ద కొడుకు వ్యవసాయం చేస్తుంటాడని, భూమి తీసుకుంటే ఇక మీదట ఏం చేసి బతకాలని సర్కార్ ను ప్రశ్నిస్తున్నది.
కోర్టు చెప్పినా మారుస్తలేరు..
బలవంతంగా భూసేకరణ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. మాకు రైతు బంధు, క్రాప్ లోన్లు రాకుండా చేశారు. కోర్టు నుంచి స్టే ఉండగానే మాకు చెప్పకుండా, ఎలాంటి నోటీస్ ఇయ్యకుండా మా భూరికార్డులను మార్చేశారు. ఆన్లైన్ పహాణీలో మా రైతుల పేర్లు తీసేశారు. ఇది చట్ట వ్యతిరేకమని, రికార్డులను సరి చేయాలని ఎన్నిసార్లు తహసీల్దార్‌ను, కలెక్టర్‌ను అడిగినా పట్టించుకోవడం లేదు. ఈ మధ్య సీసీఎల్ ఏ వద్దకు వెళ్లగా మళ్లీ కలెక్టర్ దగ్గరికే వెళ్లండని చెప్పారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
‑ రమేశ్, సర్పంచ్, తాటిపర్తి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా