
- రెడీ చేయాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు
- 25 ఏళ్ల గ్రోతే లక్ష్యంగా ఈసారి బడ్జెట్
న్యూఢిల్లీ: విదేశీ కంపెనీలను ఆకర్షించడంపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇందుకు దేశ పరిశ్రమలు కలిసి రావాలని కోరింది. దేశాన్ని తయారీ హబ్‌గా మార్చడానికి పారిశ్రామికవేత్తలు స్ట్రాటజీలను రెడీ చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని కంపెనీలను ఆకర్షించేలా ఇవి ఉండాలని అన్నారు. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లను, కంపెనీలను ఆకర్షించేలా రూల్స్‌ను సవరించామని, సదుపాయాలు కల్పించామని చెప్పారు. ‘వెస్ట్రన్ దేశాల రెసిషన్‌కు మీరు సిద్ధమవుతున్నట్టే, అక్కడి కంపెనీలు ఇండియాను కోలొకేషన్‌గా ఎంచుకునేలా చేయాలి’ అని అన్నారు.
వెస్ట్రన్ కంపెనీలు కనీసం అవుట్ సోర్సింగ్ కోసమైనా ఇండియాను ఎంచుకునేలా చేయాలన్నారు. మొత్తం గ్లోబల్ మార్కెట్ల కోసం కాకపోయినా సౌత్ ఈస్ట్ రీజియన్ కోసమైన ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు వీటిని ఇండియాకు తీసుకురావాలని ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 95 వ ఏజీఎం ఈవెంట్‌లో ఆమె పేర్కొన్నారు. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, సర్వీస్ సెక్టార్ మాదిరే తయారీ రంగం కూడా బలోపేతం కావాల్సి ఉందని అన్నారు.
ప్రభుత్వ ఖర్చులపై బడ్జెట్‌లో స్పెషల్ ఫోకస్
యూరప్‌లో రెసిషన్ వస్తే కేవలం అక్కడి బిజినెస్‌లపై మాత్రమే కాకుండా దేశంలోని బిజినెస్‌లపై కూడా ప్రభావం పడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘ఇది ఒక మంచి అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. అక్కడున్న కంపెనీలు తమ కార్యకలాపాలకు అంతరాయం లేకుండా చూడడానికి ఆల్టర్నేటివ్ ప్లేస్‌ల కోసం వెతుకుతున్నాయి’ అని అంచనావేశారు. స్టార్టప్‌లు డెవలప్ చేసిన ఇన్నోవేషన్లను గుర్తించి, వాటిని మరింతగా విస్తరించాలని పరిశ్రమ వర్గాలను ఆమె కోరారు. ప్రభుత్వం మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌తో పాటు, సర్వీస్ సెక్టార్‌లోని కొత్త సెగ్మెంట్లపై ఫోకస్ పెడుతోందని వివరించారు. మేజర్ దేశాలు క్లీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవుతున్నాయని, దేశ కంపెనీలపై ఈ దేశాలు వాతావరణ మార్పుల పేరు చెప్పి హయ్యర్ టారిఫ్‌లు వేయొచ్చని అంచనావేశారు.
దీనికి ముందుగానే సిద్ధమవ్వాలని అన్నారు. దేశ ఎకానమీ గ్రోత్‌ను ప్రభుత్వ ఖర్చులను పెంచడం ద్వారా మెరుగుపరుస్తామని నిర్మలా సీతారాన్ పేర్కొన్నారు. గత బడ్జెట్‌లను ఫాలో అవుతూనే వచ్చే 25 ఏళ్ల కోసం ఇండియాను రెడీ చేసేలా రానున్న బడ్జెట్ ఉంటుందని వివరించారు. 2023–24 కు గాను బడ్జెట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 న సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఐదవ బడ్జెట్. 2022–23 బడ్జెట్‌లో ప్రభుత్వ ఖర్చులను 35.4 శాతం పెంచి రూ. 7.5 లక్షల కోట్లుగా నిర్ణయించారు. అంతకు ముందు ఏడాదిలో ఇది రూ.5.5 లక్షల కోట్లుగా ఉంది.