కరెంట్ బండ్లకు కొత్తపాలసీ..ఫస్ట్ 2 లక్షల బండ్లకు పన్నుల్లేవ్

కరెంట్ బండ్లకు కొత్తపాలసీ..ఫస్ట్ 2 లక్షల బండ్లకు పన్నుల్లేవ్
  •     ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు  కూడా ట్యాక్స్ లేదు
  •     ఐదు తయారీ కంపెనీలతో ఎంఓయూ…
  •     రూ. 30 వేల కోట్ల పెట్టుబడులే టార్గెట్‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ను ప్రమోట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీలో భాగంగా తొలి రెండు లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లకు 100 శాతం రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ వెహికల్స్‌‌ను రాష్ట్ర పరిధిలోనే కొని, రాష్ట్రంలోనే రిజిస్టర్ చేసుకోవాలని కొత్త స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్ పాలసీ పేర్కొంది. రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు, పువ్వాడ అజయ్ కుమార్ ఈ పాలసీని శుక్రవారం లాంచ్ చేశారు. ఈ ఏడాది నుంచి 2030 వరకు ఈ పాలసీ అమల్లో ఉండనుంది. ఎలక్ట్రిక్ టూవీలర్స్‌‌తో పాటు ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా ఈ పాలసీ 100 శాతం రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇవ్వనుంది. ట్రాన్స్‌‌పోర్ట్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ప్రస్తుతం ట్రాక్టర్లకు అమలవుతోన్న నియమ, నిబంధనల ప్రకారం ఈ పాలసీ నుంచి ప్రయోజనాలు పొందాలంటే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను కూడా రాష్ట్రంలోనే కొని, రిజిస్టర్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌కు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌‌(ఈఎస్‌‌ఎస్‌‌)కు తెలంగాణను మేజర్ బేస్‌‌గా మార్చనున్నట్టు కొత్త పాలసీ చెబుతోంది. అలాగే షేర్డ్ మొబిలిటీ, ఛార్జింగ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్, ఈవీ, ఈఎస్‌‌ఎస్ మాన్యుఫాక్చరింగ్ యాక్టివిటీస్‌‌లో 2030 కల్లా లక్షా 20 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు పేర్కొంది. 4 బిలియన్ డాలర్ల(రూ.29,836 కోట్ల) పెట్టుబడులను ఆకర్షించాలని కూడా రాష్ట్ర  కొత్త ఎలక్ట్రిక్ పాలసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ను త్వరగా అందిపుచ్చుకునేలా ప్రోత్సాహకాలను, బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్‌‌ కోసం ఇన్సెంటివ్‌‌లను తేవడం ద్వారా బ్యాటరీ స్టోరేజ్ సొల్యూషన్స్‌‌కు డిమాండ్‌‌ను పెంచవచ్చని కొత్త పాలసీ చెబుతోంది. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌‌లో పెట్టుబడులుపెట్టేందుకు ఐదు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో మెమొరాండం ఆఫ్ అండర్‌‌‌‌స్టాండింగ్(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఈ ఐదు సంస్థల్లో ఈటీఓ మోటార్స్, ఓలెక్ట్రా గ్రీన్‌‌టెక్, మైత్రా ఎనర్జీలు ఉన్నాయి. మైత్రా ఎనర్జీ రూ.2 వేల కోట్లతో ఎలక్ట్రిక్ బస్సు మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌‌ను ఏర్పాటు చేయబోతుంది. ఈ సంస్థ ఏడు వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఓలెక్ట్రా గ్రీన్‌‌టెక్ కూడా రూ.3 వందల కోట్లతో ఎలక్ట్రిక్ బస్సు యూనిట్‌‌ను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. 1,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు చెప్పింది. ఈటీఓ మోటార్స్ రూ.150 కోట్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది కూడా 1,500 మందికి ఉపాధి కల్పించనుంది.

బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్‌‌కు కేంద్రం కూడా స్కీమ్స్

అడ్వాన్స్‌‌డ్ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్, ఆర్‌‌‌‌ అండ్ డీ విషయంలో ఇండియాను గ్లోబల్‌‌ హబ్‌‌గా మార్చాలని అటు కేంద్ర ప్రభుత్వం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రూ.29,836 కోట్ల(4 బిలియన్ డాలర్ల) ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్​ను ప్రకటించాలని చూస్తోంది. 50 గిగావాట్–అవర్(జీడబ్ల్యూహెచ్‌‌) మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ కోసం బిడ్స్‌‌ను కూడా పిలుస్తోంది. అయితే బిడ్స్‌‌లో పాల్గొనే వారి మినిమమ్ సైజు లిథియం అయాన్ బ్యాటరీ సెల్ మాన్యుఫాక్చరింగ్‌‌లో  5జీడబ్ల్యూహెచ్‌‌గా ఉండాలి. ఈ బిడ్స్ ద్వారా బ్యాటరీ సెల్ మాన్యుఫాక్చరింగ్‌‌లో 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆకర్షించాలని  ప్రభుత్వం చూస్తోంది. ప్రతిపాదిత 5 బిలియన్ డాలర్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా స్థానికంగా బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్‌‌ను ప్రభుత్వం పెంచాలనుకుంటోంది. దేశీయ ఆటో ఇండస్ట్రీ ఈవీల విషయంలో సీరియస్‌‌గా ఉండాలని ఇండస్ట్రీ ఎక్స్‌‌పర్ట్‌‌లంటున్నారు. కానీ ప్రస్తుతం ఆటో ఇండస్ట్రీ నిదానంగా ఈవీల వైపుకి కదులుతోంది.

ఫాస్ట్ ఛార్జింగ్  స్టేషన్లు ఏర్పాటు

ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ టెక్నాలజీస్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీస్ విషయంలో  అత్యాధునిక రీసెర్చ్, ఇనోవేషన్స్ కోసం తెలంగాణను గ్లోబల్ సెంటర్‌‌‌‌గా మార్చాలని ఈ పాలసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు హైదరాబాద్‌‌ లో, ఇతర పట్టణాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు మంత్రులు చెప్పారు. ఆ తర్వాత మెగా, స్ట్రాటజిక్ ప్రాజెక్ట్‌‌లకు కూడా ప్రభుత్వం తన ప్రయోజనాలను విస్తరించ నున్నట్టు తెలిపారు. ప్లాంట్, మిషనరీపై రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి, వెయ్యి మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తే దాన్ని మెగా ప్రాజెక్ట్ కింద ఈ పాలసీ కింద గుర్తిస్తారు. ఈవీల కోసం అత్యంత సమగ్రమైన పాలసీతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందని కొత్త పాలసీ లాంచ్ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ఎనర్జీ స్టోరేజ్ పాలసీని కూడా ఈవీ పాలసీలో కలిపామని, ఈ రెండూ కలిసి గట్టిగా పనిచేసి తెలంగాణను ఈవీ మార్కెట్‌‌ పరంగా  ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని అన్నారు.  పాలసీని రూపొందించే టప్పుడు ఇండస్ట్రీ లీడర్లను కూడా సంప్రదించామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ ఈవీ పాలసీని స్వాగతిస్తున్నా. ఈవీల మాన్యుఫాక్చరింగ్, ఆర్‌‌ అండ్ డీ ఫెసిలిటీస్ పరంగా తెలంగాణను ఒక హబ్‌‌గా మార్చాలనే దానిపై పాలసీ ఫోకస్ చేసింది. ఇనీషియల్ అసెస్‌‌మెంట్ ప్రకారం స్టార్టప్‌‌లు, ఇనోవేటివ్ చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద సంస్థలకే ఎక్కువ ప్రోత్సాహకాలు అందించేలా పాలసీ ఉంది. ఢిల్లీ లేదా గుజరాత్‌‌ ప్రభుత్వాల తరహాలో  కొనుగోళ్లకు ఇన్సెంటివ్స్‌‌ను మరింత ఆకర్షణీయంగా మలిచి ఉండాల్సింది.  లో స్పీడ్ సెగ్మెంట్‌‌లోనే ఎక్కువగా ఎలక్ట్రిక్ టూవీలర్ సేల్స్ ఉన్నాయి. కానీ, పాలసీ దీన్ని పట్టించుకోలేదు.

-వంశీ గడ్డం, ఫౌండర్, ఆటమొబైల్