విశ్లేషణ: పీఆర్సీ సిఫారసుల అమలు ఎన్నడు?

విశ్లేషణ: పీఆర్సీ సిఫారసుల అమలు ఎన్నడు?

ప్రతి ఐదేండ్లకొకసారి నియమించే పే రివిజన్​ కమిషన్‌‌‌‌‌‌‌‌(పీఆర్సీ) కీలక సిఫారసులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏడాది గడిచినా వాటికి సంబంధించిన కీలక జీవోలు జారీ చేయడం లేదు. దీంతో వివిధ అలవెన్సులు పూర్తి స్థాయిలో అందక ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పీఆర్సీ సిఫారసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలె.

‘‘ముగ్గురు అధికారులతో తెలంగాణ మొదటి వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తం. మూడు నెలల్లో కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. 2018 జూన్ రెండు నుంచి ఐఆర్, ఆగస్టు15 నుంచి పీఆర్సీ ఫిట్​మెంట్ అమలు చేస్తం” అని16 మే, 2018లో  ప్రెస్ మీట్​లో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. చెప్పినట్టే ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సీఆర్ బిస్వాల్(చైర్మన్), సి. ఉమామహేశ్వర్ రావు, డా. మహ్మద్ ఆలీ రఫత్​లతో రాష్ట్ర ప్రభుత్వం18 మే, 2018 న తెలంగాణ మొదటి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే మూడు నెలల్లో ఇవ్వాల్సిన పీఆర్సీ రిపోర్ట్ ముప్పై నెలలు ఆలస్యంగా 31 డిసెంబర్, 2020న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. పీఆర్సీ ఆలస్యమైన సందర్భాల్లో ఇంటీరియం రిలీఫ్(ఐఆర్) ప్రకటించడం రివాజు. గత నాలుగు పీఆర్సీల్లోనూ ఐఆర్ ఇచ్చారు. ఉద్యోగ వర్గాలు ఎంత మొత్తుకున్నా కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదు. ఐఆర్ మంజూరు చేయలేదు. ఎట్టకేలకు 23 మార్చి, 2021లో 30 శాతం ఫిట్​మెంట్ తో నేరుగా పీఆర్సీ అమలు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. సీఎం ప్రకటన చేసిన మూడు నెలలకు పద్నాలుగు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేశారు. అప్పటి నుంచి ఏడాది గడిచినా మిగతా కీలక సిఫారసుల అమలుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఎప్పుడు జారీ చేస్తారో కూడా అధికారులు చెప్పడం లేదు. గత నాలుగు దశాబ్దాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత లేట్ ఎప్పుడూ జరగలేదు.  

అమలుకు నోచుకోని సిఫారసులు...

బ్లైండ్, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ ఉద్యోగ, టీచర్లకు ప్రతినెలా మూలవేతనంలో పది శాతం, గరిష్టంగా రూ.2000 చెల్లిస్తున్న కన్వేయన్స్ అలవెన్స్ మొత్తాన్ని రూ.3000లకు పెంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లకు నెలకు రూ.200 హెచ్ఎం అలవెన్స్, ఉన్నత పాఠశాలల్లో పై తరగతులకు బోధించే భాషా పండిట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్ నెలకు రూ.200లకు పెంచాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇతర అన్ని రకాల స్పెషల్ అలవెన్స్ లను కూడా పెంచాలని రికమండ్ చేసింది. కానీ ప్రభుత్వం వాటి 
గురించి పట్టించుకోవడం లేదు.

అందరికీ సమన్యాయం జరగాలంటే..

పిల్లల సంరక్షణ కోసం ప్రస్తుతం ఇస్తున్న 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్(సీసీఎల్)ని 120 రోజులకు పెంచాలి. దివ్యాంగ పిల్లలు ఉంటే సీసీఎల్ రెండేండ్లకు పెంచి, 365 రోజులు వందశాతం వేతనంతో, మిగతా 365 రోజులు ఎనభై శాతం వేతనంతో మంజూరు చేయాలి. తొలిసారిగా సింగిల్ మేల్ పేరెంట్స్​కి సైతం సీసీఎల్ మంజూరుకు పీఆర్సీ సిఫారసు చేసింది. పెళ్లికాని, భార్య చనిపోయిన, విడాకులు తీసుకున్న సింగిల్ మేల్ పేరెంట్స్ కు సీసీఎల్ మంజూరు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. సర్వీస్ ఉండి మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు కారుణ్య నియామక పథకం కింద వచ్చే ఉద్యోగం వద్దనుకునే పక్షంలో నాలుగో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు రూ.40 వేలు, నాన్ గెజిటెడ్ వారికి రూ.60 వేలు, గెజిటెడ్ వారికి రూ.80 వేల నష్టపరిహారాన్ని ఎక్స్ గ్రేషియా రూపంలో ప్రస్తుతం చెల్లిస్తున్నారు. ఈ ఎక్స్ గ్రేషియా మొత్తాలను ఐదు, ఎనిమిది, పది లక్షల రూపాయలకు పెంచాలని కమిషన్ సిఫారసు చేసింది. వెయిటేజీ కలుపుకొని 33 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసి రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే ప్రస్తుతం పూర్తి పెన్షన్ వస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి అమలు చేస్తున్నట్టు 20 ఏండ్ల సర్వీస్ కంప్లీట్ చేసిన వారికి పూర్తి పెన్షన్ చెల్లించాలని, ఇరవై ఏండ్లలోపు సర్వీస్ తో రిటైరయ్యే వారికి ఐదేండ్ల వెయిటేజీ కూడా కలపాలని పీఆర్సీ సిఫారసు చేసింది. సర్వీస్ లో ఉండి లేదా రిటైరైన తర్వాత చనిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు మరణించిన తేదీ నుంచి ఏడేండ్ల వరకు గాని, జీవించి ఉంటే 65 ఏండ్ల వయసు పూర్తయ్యే వరకు గాని, ఏది తక్కువైతే ఆ తేదీ వరకు చివరి జీతంలో 50 శాతం మొత్తాన్ని ప్రస్తుతం ఫ్యామిలీ పెన్షన్​గా చెల్లిస్తున్నారు. దీన్ని గరిష్టంగా పదేండ్ల వరకు లేదా 65 ఏండ్ల వయస్సు పూర్తయ్యే వరకు ఏది తక్కువైతే ఆ తేదీ వరకు చెల్లించాలని పీఆర్సీ రికమండ్ చేసింది. 

ఫ్యునరల్​ చార్జీలు..

ఉద్యోగులు, టీచర్లు చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులకు ఫ్యునరల్ చార్జెస్ కింద ప్రస్తుతం రూ.20 వేలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచాలని కమిషన్ సిఫారసు చేసింది. సర్వీస్, ఫ్యామిలీ పెన్షనర్లు చనిపోతే కనిష్టంగా రూ.30 వేలు, గరిష్ఠంగా ఒక నెల పెన్షన్ ఫ్యునరల్ చార్జెస్ చెల్లించాలి. రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు చనిపోయినా డెత్ రిలీఫ్ చెల్లించాలని కమిషన్ తొలిసారి సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ ఫండ్ కోసం ఉద్యోగుల మూలవేతనం, కరువుభత్యంలో 14 శాతం మొత్తాన్ని తన వాటాగా ప్రతినెలా చెల్లిస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను10 నుంచి 14 శాతానికి పెంచాలని కమిషన్ రికమండ్ చేసింది. పీఆర్సీ అమల్లోకి వచ్చిన జులై ఫస్ట్ 2018 నుంచే మొత్తం సిఫారసులు అమల్లోకి తేవాలి. అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుంది. 

వెంటనే చర్యలు తీసుకోవాలి..

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి సాధికారత కలిగిన ఓ వేదిక కావాలి. ప్రధానంగా పీఆర్సీ రికమండ్ చేసిన మేరకు నగదు రహిత చికిత్స కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. హెల్త్ కార్డ్స్ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి. మెంబర్స్ నుంచి ఒక శాతం వరకు చందా వసూలుకు విధివిధానాలు ఖరారు చేయాలి. 317 జీవోతో ఉత్పన్నమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను సాధ్యమైన మేరకు సొంత జిల్లాలకు బదిలీ చేసి, ఊరట కలిగించాలి. ఈ ప్రక్రియ కొన్నేండ్ల పాటు నిరంతరం జరగాల్సి ఉంది. సీపీఎస్ విధానం రద్దు చేస్తే ప్రభుత్వంపై పైసా ఆర్థికభారం పడదు. సీపీఎస్ సిస్టంను రద్దు చేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. పీఆర్సీ రికమండ్ చేసిన అన్ని అంశాల అమలుకు సత్వరం చర్యలు చేపట్టాలి. ఏడేండ్లు నుంచి పెండింగులో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలి. గొప్ప లక్ష్యంతో అప్​గ్రేడ్ చేసిన భాషా పండిట్, పీఈటీ పోస్టులను వెంటనే బడుల్లో కేటాయించి, పదోన్నతులతో భర్తీ చేయాలి. పదివేల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టుల మంజూరుకు శాసనసభలో సీఎం ఇచ్చిన హామీ అమలుకు చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యలపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపడానికి, సలహాలు- సూచనలు తీసుకోవడానికి మంత్రివర్గ ఉప సంఘం వంటి అత్యున్నత వేదిక ఉండటం ఎంతో అవసరం. ప్రతి సమస్యని సీఎం దృష్టికి తీసుకెళ్లడం సంఘాలకు సాధ్యం కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి.

రూరల్ అలవెన్స్ ఇవ్వాలి!

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, టీచర్లకు ప్రోత్సాహకంగా ఉండేందుకు రూరల్ అలవెన్స్ మంజూరు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నవారికి  రూరల్ అలవెన్స్ ఇవ్వాల్సిందేనని పలుమార్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో రూరల్ అలవెన్స్ ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం, ఫైల్ ప్రాసెస్ చేయకపోవడం శోచనీయం. ‘సి’ కేటగిరీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి 6 శాతం, మారుమూల ప్రాంతాలైన ‘డి’ కేటగిరి గ్రామాల్లో పనిచేస్తున్నవారికి 10 శాతం రూరల్ అలవెన్స్ ప్రకటించాలి.

- మానేటి ప్రతాపరెడ్డి, 
టీఆర్ టీఎఫ్ గౌరవాధ్యక్షుడు