చైల్డ్ మ్యారేజస్.. కరోనా టైంలోనే 1355 పెళ్లిళ్లకు బ్రేక్

చైల్డ్ మ్యారేజస్.. కరోనా టైంలోనే 1355 పెళ్లిళ్లకు బ్రేక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బాల్య వివాహాలకు బ్రేక్ పడడం లేదు. అమ్మాయిలకు మైనార్టీ తీరక ముందే తల్లిదండ్రులు పెళ్లి పీటలెక్కిస్తున్నారు. కల్యాణ లక్ష్మి పథకం అమలు తర్వాత రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయని ప్రభుత్వ పెద్దలు పలు సందర్భాల్లో ప్రకటించినప్పటికీ.. గణాంకాలు మాత్రం అందుకు విరుద్ధంగాఉన్నాయి. గత ఆరేళ్లలో అధికారులకు తెలిసే 6,866 బాల్య వివాహాలు నిలిచిపోయాయంటే, తెలియకుండా ఎన్ని వేల పెళ్లిళ్లు జరిగి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పెళ్లయ్యాక తప్పుడు పుట్టిన తేదీలతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తీసుకోవచ్చనే ధీమాతో కూడా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి కొందరు దొరికిపోగా, దళారుల సాయంతో అధికారులను మేనేజ్ చేసి డబ్బులు పొందినవాళ్లు కూడా ఉన్నారు. ఆడ పిల్లలకు త్వరగా పెళ్లి చేస్తే తమ బరువు తీరిపోతుందని భావించడం, కొన్ని కులాల్లో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండడం, మంచి సంబంధాలు చేయి దాటిపోతాయన్న భయం, మేనరికాలు, ఆర్థిక  ఇబ్బందుల్లాంటి అనేకం ఇందుకు కారణాలవుతున్నాయి. 

14, 15 ఏళ్లకే పెళ్లిళ్లు.. 

కొందరు తల్లిదండ్రులు వివిధ కారణాలతో 14 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను అమలు చేస్తున్నా చైల్డ్ మ్యారేజెస్ కు వెనకాడడం లేదు. బాలల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్ కు బాల్య వివాహాలను ఆపాలని కోరుతూ గత ఆరేళ్లలో 6,866 ఫోన్ కాల్స్ రావడమే ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలైన సమయంలోనూ అధికారులు 1,355 పెళ్లిళ్లను నిలిపివేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015 – 16లో 878 పెళ్లిళ్లను,  2016 – 17లో 1321 పెళ్లిళ్లు, 2017 – 18లో 1215,  2018 – 2019లో 1120, 2019 – 2020లో 977 చైల్డ్ మ్యారేజేస్ కు అధికారులు బ్రేక్ వేశారు. 

కారణాలు అనేకం.. 

  • స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో బాలికలు ఇంటి పట్టునే ఉంటున్నారు. బయట సొసైటీ మంచిగా లేదనే  ఆరోపణతో చాలా మంది తల్లిదండ్రులు త్వరగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. 
  • భర్త చనిపోయి పిల్లలను పోషిస్తూ జీవనం సాగిస్తున్న వితంతువులు కూడా ఆర్థిక ఇబ్బందులు, సామాజిక కారణాలతో పిల్లలకు 14, 15 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తున్నారు. 
  • ఏటేటా పెళ్లి ఖర్చులు, వరకట్నం పెరిగిపోవడం, తక్కువ కట్నం ఇచ్చినా చేసుకుంటామని ఏదైనా సంబంధం వచ్చినా పెళ్లిళ్లు చేస్తున్నారు. 
  • లాక్ డౌన్ తో స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో ఇక చదువులు సాగేటట్లు లేవనే ఆలోచనతోనూ కొందరు పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. 
  • లైంగిక దాడికి గురైన బాలికలకు ఎవరూ పెళ్లి చేసుకోరనే ఉద్దేశంతో త్వరగా పెళ్లి చేస్తున్నారు. 
  • బాలికల ప్రేమ వ్యవహారాలు, ఇంట్లో నుంచి వెళ్లిపోవడం లాంటి ఘటనలు బాల్య వివాహాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి.

గుట్టుగా పెళ్లిళ్లు.. 

ఎక్కడి నుంచైనా సమాచారం అందితేనే చైల్డ్ లైన్ ఆఫీసర్లు, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు బాల్య వివాహాలను ఆపగలుగుతున్నారు.  ఎవరికి తెలియకుండా రెండు కుటుంబాల వారే పెళ్లి తంతు ముగిస్తున్న ఘటనలు వెలుగు చూడడంలేదని ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి వెంకట్​రెడ్డి వెల్లడించారు. పెళ్లి పీటలపై పెళ్లిని ఆపేసి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినా, కొద్ది రోజులకు మరో ముహూర్తం చూసి పెళ్లిళ్లు చేస్తున్నారని చెప్పారు. జరిగిపోయిన పెళ్లిళ్లను రద్దు చేసే అవకాశం చట్టంలో లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

స్కూళ్లు, కాలేజీల బంద్ తో ఇబ్బందులు.. 

గతంలో తల్లిదండ్రులు బాలికలకు మైనార్టీ తీరక ముందే పెళ్లి చేయాలని చూస్తే వారి ఫ్రెండ్స్ ద్వారానో, స్కూల్ టీచర్ల ద్వారానో 1098 చైల్డ్ లైన్, పోలీసులకు సమాచారం అందేది. ఇప్పుడు స్కూళ్లు బంద్ కావడం, స్టూడెంట్స్ కు తమ ఫ్రెండ్స్, టీచర్లతో కాంటాక్ట్ లేకుండా పోయింది. దీంతో బాల్య వివాహాల సమాచారం తగినంతగా రావడం లేదు. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు, కాలేజీల టీచర్లు తమ స్టూడెంట్స్ గురించి వాకబు చేస్తుండాలి. 
– వెంకట్ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్