యాసంగి మొదలై రెండు నెలలు దాటినా  కొత్త లోన్లు ఇస్తలే

యాసంగి మొదలై రెండు నెలలు దాటినా  కొత్త లోన్లు ఇస్తలే
  • తిప్పలు పడుతున్న రైతులు 
  • యాసంగి మొదలై 2 నెలలు దాటినా పంట రుణాలు ఇచ్చింది 34 శాతమే
  • కొత్త లోన్ల టార్గెట్‌‌‌‌ రూ. 23,775.44 కోట్లు.. మంజూరైనవి రూ. 8,150 కోట్లే
  • హామీ ఇచ్చి మూడేండ్లు గడుస్తున్నా రుణమాఫీ అయింది అంతంతే
  • రూ. 25,936 కోట్ల రుణాల్లో.. మాఫీ చేసింది రూ. 732.24 కోట్లే 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో రైతులు పంట రుణాల కోసం తిప్పలు పడుతున్నారు. యాసంగి సీజన్​ ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా బ్యాంకర్లు కేవలం 34  శాతమే క్రాప్​ లోన్లు ఇచ్చారు. ఈ సీజన్​లో 23 లక్షల మంది రైతులకు లోన్లు ఇవ్వాలని స్టేట్​ లెవల్​ బ్యాంకర్స్​ కమిటీ (ఎస్​ఎల్​బీసీ) టార్గెట్​ పెట్టగా..  ఇప్పటివరకు 6 లక్షల మందికే ఇచ్చారు. దీనికి తోడు ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదు. మాఫీ చేయాల్సిన రుణాలు రూ. 25 వేల కోట్లు కాగా.. మూడేండ్లలో ప్రభుత్వం రూ. 732.24 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. పాత లోన్లు తీర్చనందున కొత్తగా బ్యాంకర్లు లోన్లు ఇస్తలేరని రైతులు అంటున్నారు. పాతవాటికి మిత్తీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు 2021–22లో యాసంగికి పంట రుణాలు రూ. 23,775.44 కోట్లు ఇవ్వాలని ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ ఆదేశించింది. 

ఇప్పటి వరకు యాసంగిలో రూ. 8,150 కోట్లు మాత్రమే ఇచ్చారు. వానాకాలం సీజన్​లోనూ బ్యాంకర్లు టార్గెట్​ను రీచ్​ కాలేదు. వానాకాలం పంటలకే అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, దిగుబడి రాక వాటిని తీర్చడమే కష్టమవుతోందని రైతులు అంటున్నారు. భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిని  దిగుబడి సరిగ్గా రాలేదని.. రోగాలు, వానలకు మిర్చీ పంట ఖరాబైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం వడ్ల పైసలు ఇంకా అందలేదని, యాసంగికి బ్యాంకులు లోన్లు ఇస్తలేవని, దీంతో తిప్పలైతుదున్నదని వాపోతున్నారు. పంట సాగు చేయాలంటే ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు ఎకరం, రెండు ఎకరాలున్న రైతులకు ఏమాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. 

క్రాప్​ లోన్లపై రుణ మాఫీ దెబ్బ

లక్ష రూపాయల వరకు లోన్లు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు బ్యాంకుల్లో తాము తీసుకున్న పాత బాకీ కట్టలేదు. ప్రభుత్వం హామీ ఇచ్చి మూడేండ్లవుతున్నా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. దీంతో రైతులు తీసుకున్న లోన్లకు బ్యాంకుల్లో వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. పంటకు ఇవ్వాల్సిన లోన్‌‌‌‌‌‌‌‌ లిమిట్‌‌‌‌‌‌‌‌ కూడా దాటిపోయింది.  బ్యాంకుకు పోతే పాత బాకీలు కట్టుమంటున్నారని, ప్రభుత్వమేమో ఇంకా రుణమాఫీ అమలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లోనైతే వానాకాలం వడ్ల పైసలు పడగానే పాతబాకీల కింద పట్టుకుంటున్నారని అంటున్నారు. 2018 డిసెంబర్​ 11ను కటాఫ్‌‌‌‌‌‌‌‌ తేదీగా నిర్ణయించి అప్పటి లోగా క్రాప్ లోన్లు తీసుకున్న రైతులకు సంబంధించి వడ్డీ, అసలు కలిపి రూ.లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తానని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. అప్పటికే రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 25,936 కోట్ల పంట రుణాలు ఉన్నట్లు బ్యాంకులు తేల్చాయి. దీనిలో భాగంగా మొదటి దఫాగా 2020 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో రూ. 25 వేల లోపు రుణాలున్న రూ. 2.96 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 408.38 కోట్లు ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో దఫాగా  రూ. 31వేల వరకున్న రూ. 1.04 లక్షల మంది రైతుల రుణాలు రూ. 323.86 కోట్లు మాఫీ చేసింది. ఇలా ఇప్పటి వరకు 4 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 732.24 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. ఇంకా మిగతా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. ఇటు రుణమాఫీ కాక.. అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక ఆగమవుతున్నారు. 

పాత బాకీ కట్టుమంటున్నరు

సర్కారు చెప్పినట్లు రూ. లక్ష మాఫీ అయితదనుకొని పాత బాకీ కట్టలేదు. కొత్త లోన్లు ఇయ్యుండ్రని బ్యాంకోళ్లను అడిగితే పాత బాకీ కట్టి కొత్త లోన్లు తీసుకొమ్మంటున్నరు. బాకీ కట్టేందుకు పైసలు లేక.. రెన్యువల్ చేసుకుంటున్నం. రెన్యువల్‌‌‌‌ చేసుకోకపోతే అకౌంట్​ లాక్‌‌‌‌ చేస్తున్నరు. 
ఈ నెలలో రాళ్లవానకు మక్క, మిరప పంటలు ఆగమైనయ్‌‌‌‌. వానలకు పత్తి దెబ్బతిని అగ్గువకు అమ్ముకోవాల్సి వచ్చింది. వడ్ల పైసలు రాలేదు.  యాసంగి సాగు కష్టమైతున్నది. 
‑ సుమతి, గూడూరు, మహబూబాబాద్ జిల్లా

రైతు బంధు పైసలు పట్టుకున్నరు

రుణమాఫీ అమలు కాకపోవడంతో పాత బాకీ కింది రెండెకరాల రైతు బంధు పైసలను బ్యాంకోళ్లు పట్టుకున్నరు. కొత్త అప్పు ఇస్తలేరు. దీంతో పంటల సాగుకు కష్టమైతున్నది. 
- చింతల రాజన్న, రైతు, 
   నర్సింగపూర్‌‌‌‌‌‌‌‌ తాడ్వాయి, ములుగు జిల్లా

రుణమాఫీ చేసి ఆదుకోవాలి

రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి. పాత బాకీలు కట్టక, రుణాలు రీషెడ్యూల్ చేయక బ్యాంకర్లు రైతులకు లోన్లు ఇస్తలేరు. పాసు పుస్తకాలు రాని వారికి కూడా ఇస్తలేరు. దీంతో రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నరు. 
- మూడ్ శోభన్, 
   రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి

ఒకేసారి మాఫీ చేయాలి

ప్రభుత్వం ప్రకటించి మూడేండ్లవుతున్నా.. తక్కువ మందికే రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. వడ్డీలతో అప్పులు పెరుగుతున్నా పట్టించుకుంటలేదు. ఒకేసారి రుణమాఫీ చేయాలి. 
- రావుల రామ్మోహన్ రెడ్డి, 
   వెల్దండ, జనగామ జిల్లా