స్వయం సహాయక సంఘాలకు అందని మాఫీ సొమ్ము 

స్వయం సహాయక సంఘాలకు అందని మాఫీ సొమ్ము 

జిల్లాలో రావాల్సిన బకాయిలు రూ. 7 కోట్లు
మహిళా సంఘాల నిరీక్షణ

ఆసిఫాబాద్, వెలుగు : స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం స్త్రీనిధి రుణాలు ఇస్తోంది. రుణాలు తీసుకున్న సభ్యులు సక్రమంగా చెల్లించిన తర్వాత వారి ఖాతాలో తిరిగి వడ్డీ జమ చేస్తోంది. అయితే జిల్లాలో మాత్రం మూడేండ్లుగా వడ్డీ డబ్బులు చెల్లించడం లేదని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన చెందుతున్నారు. 

బకాయిలు రూ. 7కోట్లు
జిల్లాలో మొత్తం 7 ,932 స్వయం సహాయక సంఘాలు, 397 వీఓ సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 86 వేల  861 మంది సభ్యులు ఉన్నారు. 1100 స్వయం సహాయక సంఘాల సభ్యులు స్త్రీ నిధి రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలను చెల్లించి ఏండ్లు అవుతున్నా నేటికీ మిత్తి డబ్బులు జమ రాలేదు. రుణాలు సక్రమంగా చెల్లించిన సంఘాల సభ్యులను గుర్తించి వడ్డీ వాపస్ ఇచ్చి, ప్రోత్సాహించాల్సిన ప్రభుత్వం మాత్రం 2019 నుంచి వడ్డీ బకాయిలు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అలాంటి వడ్డీ బకాయిలు జిల్లాలో సంఘాలకు సుమారు రూ. 7 కోట్లు రావాల్సి ఉంది. 

వడ్డీ డబ్బులు రిలీజ్ చేయాలి
తిర్యాణి మండలంలో 465 సంఘాలు ఉన్నాయి. బ్యాంకు నుంచి రూ. 40వేలు రుణం తీసుకున్న. వడ్డీతో సహా కట్టినం. అయినా మూడేళ్ల నుంచి వడ్డీ పైసలు రావడం లేదు. మహిళా సంఘాల అభివృద్ధి కోసమని చెపుతున్న సర్కార్ ఏండ్లు గడుస్తున్నా వడ్డీ డబ్బులు చెల్లించడం లేదు.
- మడావి రుక్మిణి, చింతపల్లి, జంగుబాయి గ్రూప్ ,తిర్యాణి.

ఫండ్స్ రిలీజ్ చేయాల్సి ఉంది
గవర్నమెంట్ స్ర్తీ నిధి వడ్డీ డబ్బులు రిలీజ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రపోజల్ పంపినం. సుమారు 7 కోట్లు వడ్డీ డబ్బులు రిలీజ్ చేయాలి. అవి వచ్చిన వెంటనే సభ్యుల అకౌంట్స్ లో జమ చేస్తం.
- ఉదయ్, స్త్రీనిధి జిల్లా మేనేజర్

స్త్రీనిధి వడ్డీ పైసలు జమ చెయ్యలేదు
నేను అయిదేండ్లలో రెండు సార్లు స్త్రీనిధి ద్వారా 50 వేలు, 50 వేలు తీసుకున్న. రెగ్యులర్ గా వడ్డీ తో సహా పైసలు కట్టిన .ప్రభుత్వం వడ్డీ పైసలు జమ చేస్తామని చెప్పింది. మూడేళ్లుగా గడుస్తున్నా  అకౌంట్​ల వడ్డీ పైసలు జమ చెయ్యలేదు.అడిగితే వస్తాయి అంటున్నరు. కానీ వస్తలేవు. జల్ది జమ చేస్తే మాకు ఉపయోగపడుతాయి.
- దెబ్బటి వనిత, దహెగాం