ఇండ్లు కట్టివ్వడంలో రాష్ట్రం ఫెయిల్

ఇండ్లు కట్టివ్వడంలో రాష్ట్రం ఫెయిల్

ఏపీలో 20 లక్షలు.. ఇక్కడ లక్షన్నరే

ఇండ్లు కట్టివ్వడంలో రాష్ట్రం ఫెయిల్

హైదరాబాద్, వెలుగు : ఇండ్లు లేని పేదలకు సొంతిల్లు కట్టివ్వడంలో తెలంగాణ సర్కార్ వెనకబడింది. పొరుగు రాష్ట్రం ఏపీ మాత్రం కేంద్ర ప్రభుత్వ పీఎం ఆవాస్ యోజన స్కీమ్​ నిధులను సమర్థంగా వాడుకుంటూ 20 లక్షల ఇండ్లను కట్టించి ఇస్తోంది. ఈ సంగతి పీఎం ఆవాస్ యోజన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో నిధులు కొరతతో కాంట్రాక్టర్లకు సక్రమంగా బిల్లులు చెల్లించకపోవటంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. మరో వైపు ఇండ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నా వాటిని తీసుకోవడంలో ఫెయిల్ అవుతోంది.

పేదల ఇండ్ల నిర్మాణానికి సాయం

2015 లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను కేంద్రం ప్రారంభించింది. ఈ స్కీమ్ లో భాగంగా గ్రామాల్లో(రూరల్)​ ఒక ఇంటి నిర్మాణానికి రూ.72 వేలు, పట్టణ(అర్బన్)​ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రూ.1.5లక్ష కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. 2022 నాటికి దేశంలో 2 కోట్ల ఇండ్లు కట్టాలనే టార్గెట్ తో నిధులు మంజూరు చేసింది.

లబ్ధిదారుల పేర్లు పంపట్లే.. నిధులు రావట్లే

ఏటా ఈ స్కీమ్ కింద లక్ష ఇండ్ల నిర్మాణానికి నిధులు ఇస్తామని కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని వాడుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద రాష్ట్రానికి రూ.1311 కోట్లను ఇచ్చినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. పూర్తయిన ఇండ్లకు కూడా లబ్ధిదారులను సెలక్ట్ చేసి కేంద్రానికి పంపితే మరో రూ.1300 కోట్లు వస్తాయని అంటున్నారు. అయితే పూర్తయిన ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2015లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కీమ్ ను ప్రారంభించింది. 2,92,057 ఇండ్లను శాంక్షన్ చేసింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే లక్ష ఇండ్లు ఉన్నాయి. ఈ ఎనిమిదేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,37,025 ఇండ్లు పూర్తి చేయగా, మరో 55 వేల ఇండ్లు 90 శాతం పూర్తయ్యాయి. అయితే పూర్తయిన ఇండ్లలో ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే పేదలకు పంపిణీ చేశారు.

ఏపీలో ఫుల్ స్పీడ్ తో ఇండ్ల నిర్మాణం

ఏపీలో 2016 నుంచి ఇప్పటి వరకు 20 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అక్కడి ప్రభుత్వం అందజేసింది. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం ఇస్తున్న నిధులను అక్కడి ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకుంటోంది. ఇండ్ల నిర్మాణంపై గత ప్రభుత్వంలో, ఇప్పటి సీఎంలు, హౌసింగ్ మినిస్టర్​లు ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి తగిచన సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు.

ఏపీలో పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు

ఏపీలో వైజాగ్, పుట్టపర్తి, ఏలూరు, తిరుపతి, మచిలీపట్నం ఇలా నగరాల పేరుతో అక్కడి ప్రభుత్వం 20 అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. ఈ పట్టణాల చుట్టూ ఉన్న గ్రామాలను ఈ అథారిటీల్లో కలిపింది. మొత్తం 20 లక్షల ఇండ్లు శాంక్షన్ కాగా 19లక్షల ఇండ్ల పనులు స్టార్ట్ కాగా 7లక్షలు పూర్తయ్యాయి.  తెలంగాణలో కూడా యాదాద్రి, వేములవాడ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట పట్టనాల్లో ఇలా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ పీఎం ఆవాస్ లో భాగంగా ఇండ్ల నిర్మాణం చేపట్టడం లేదని తెలుస్తోంది.

‘సొంత జాగాలో ఇండ్లు’ స్కీమ్​కు నిధుల లేమి

సొంత జాగా ఉన్న పేదలు ఇండ్లు కట్టుకునేందుకు 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిధుల కొరతతో స్కీమ్ స్టార్ట్ చేయలేదు. గతేడాది బడ్జెట్ లో రూ.12 వేల కోట్లను కేటాయించినా స్కీమ్​ను ప్రారంభించలేదు.  కొత్త బడ్జెట్ లో నిధులు కేటాయించినా స్కీమ్ ను ఎపుడు స్టార్ట్ చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తే లబ్ధిదారులను ఎంపిక చేసి వారి పేర్లను కేంద్రానికి పంపిస్తే రూరల్ లో రూ.72 వేలు, అర్బన్ లో లక్షా 50 వేలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

పీఎం ఆవాస్  యోజన స్కీమ్ వివరాలు-2023 ఫిబ్రవరి 28 వరకు