గల్లీలు మాయం.. దర్జాగా కబ్జా చేస్తున్న బడాబాబులు

గల్లీలు మాయం.. దర్జాగా కబ్జా చేస్తున్న బడాబాబులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక కొత్తగూడెంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గజం స్థలాన్ని కూడా వదలడం లేదు. పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు అయిన పెద్ద బజార్, చిన్నబజార్, ఎంజీరోడ్​, లేపాక్షి రోడ్, సూర్యాప్యాలెస్​ వెనుక వైపు గల గల్లీలను అధికార పార్టీ నేతల అండదండలతో బడాబాబులు కొందరు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో గజం భూమి ధర రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు పలుకుతోంది. ఫలితంగా రాజకీయ ప్రోద్బలంతో అధికారులకు మామూళ్లు ఇస్తూ యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. లేపాక్షి రోడ్డు–మార్కెట్–ఎంజీ రోడ్డుకు మధ్యలో పలు గల్లీలు ఆక్రమణలతో మాయమయ్యాయి.

సూర్యాప్యాలెస్​వెనెక గల గల్లీలో ఓ బడా వ్యాపారిదే రాజ్యం. ఎంజీ రోడ్​ నుంచి చిన్నబజార్, పెద్ద బజార్​లకు వెళ్లేందుకు పలు గల్లీలను గతంలో ఏర్పాటు చేయగా అవన్నీ ఇప్పుడు కబ్జాల పాలయ్యాయి. కొన్ని చోట్ల గల్లీల దారులు ఆక్రమణలతో కనుమరుగయ్యాయి. కింద గల్లీ రోడ్ పై అక్రమ నిర్మాణాలు చేపడితే మరి కొందరేమో గల్లీలనే మూసేసి వ్యాపారాలు మొదలెట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గల్లీల ఆక్రమణలతో తమ ఇళ్లకు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గల్లీలను కబ్జా కోరల నుంచి కాపాడాలని కోరుతున్నారు.