గజ్వేల్ పాలిటెక్నిక్ దగ్గర కొత్త ప్లాట్లు

గజ్వేల్ పాలిటెక్నిక్  దగ్గర కొత్త ప్లాట్లు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు :  మల్లన్న సాగర్ నిర్వాసితులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణంతో ఇల్లు, భూమి పోగొట్టుకుని పరిహారాల కోసం నానా పాట్లు పడుతుంటే ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారాలు తీసుకుని కొందరు డబుల్​ బెడ్​రూమ్​లు కాకుండా ఓపెన్ ప్లాట్లు తీసుకున్నారు. గజ్వేల్ పట్టణ శివార్లలో నిర్వాసితులకు కేటాయించిన స్థలం నుంచే రీజినల్ రింగ్ రోడ్డు  అలైన్​మెంట్​ ఖరారు కావడంతో వేములఘట్ కు  చెందిన దాదాపు 120 మంది ప్లాట్లు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. అలైన్​మెంట్​ మారుతుందేమోనని ఇప్పటివరకు ఎదురు చూశారు. కానీ గజిట్ ప్రకారమే పనులు కొనసాగనున్నాయి.  దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తమకు ప్రత్యామ్నాయంగా మరెక్కడ ప్లాట్లు చూపిస్తారోనని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

జరిగింది ఇదీ.. 
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో తొగుట, కొండపాక మండలాలకు చెందిన ఎనిమిది గ్రామాలకు చెందిన దాదాపు 5,500 కుటుంబాలు నిర్వాసితులుగా మారారు. వీరికి ప్రభుత్వం అన్ని రకాల పరిహారాలు ఇవ్వగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 7.5 లక్షల నగదుతో పాటు ఇల్లు లేదా ఓపెన్ ప్లాట్ ఇస్తోంది. దాదాపు మూడు వేల కుటుంబాలు ఇండ్లకు బదులు  ఓపెన్ ప్లాట్లు తీసుకోవడానికి అంగీకరించాయి. గజ్వేల్ పట్టణ సమీపంలోని లింగరాజుపల్లి, సంగాపూర్ లలో  భూములను డెవలప్​ చేసి ఒక్కొక్కరికి 250 గజాల  ఓపెన్ ప్లాట్లను కేటాయించారు. కాగా,  ఈ ప్లాట్లు ఉన్నచోటి నుంచి  రీజినల్ రింగ్ రోడ్డు అలైన్​మెంట్ ఖరారు కావడం కొత్త సమస్యక తలెత్తింది. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్​మెంట్ మార్పు కోసం జిల్లా అధికారులు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో ప్లాట్లు కోల్పొతున్న వారికి గజ్వేల్ పట్టణ సమీపంలోని పాలిటెక్నిక్  కళాశాల వద్ద ఓపెన్ ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించారు.

కేటాయింపులు ఎప్పుడో..?
కొత్తచోట స్థలాన్ని పరిశీలించి, రోడ్లు, డ్రైన్, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్లాట్లు కేటాయించాల్సి ఉంటుందని, దీనంతటికీ ఎంతకాలం పడుతుందోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు.  గతంలో  నిర్వాసితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికారులు, ప్రభుత్వంపై తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం వుండేదని, ప్రస్తుతం తాము తక్కువ మంది ఉండటంతో నామమాత్రంగా సౌకర్యాలు కల్పించి ప్లాట్లు ఇస్తారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

త్వరలో ప్లాట్ల పట్టాలు అందజేస్తాం
రీజినల్​ రింగ్ రోడ్డు అలైన్​మెంట్ కారణంగా లింగరాజుపల్లి వద్ద  వేములఘట్ కు చెందిన 120 మంది నిర్వాసితుల ఓపెన్ ప్లాట్లు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. గజ్వేల్ పట్టణ సమీపంలోని పాలిటెక్నిక్  కాలేజీ వద్ద ప్రభుత్వ భూమిలో  వీరికి కొత్తగా ఓపెన్ ప్లాట్లను కేటాయించాలని నిర్ణయించాం. మౌలిక వసతులు  కల్పించి త్వరలోనే  ఓపెన్ ప్లాట్ల పట్టాలను అందజేస్తాం.
-  విజయేందర్ రెడ్డి, ఆర్డీవో, సిద్దిపేట