రోడ్లపై గుంతలకు యాప్‌‌‌‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన

రోడ్లపై గుంతలకు యాప్‌‌‌‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన
  •  గుంతల పూడ్చివేతకు ఏం చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పట్టణాలు, సిటీల్లో రోడ్లపై ఏర్పడిన గుంతల వివరాలు ప్రజలు తెలియజేసే విధంగా ఒక యాప్‌‌‌‌ను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆ వివరాల ఆధారంగా రోడ్లపై గుంతలను పూడ్చేందుకు మార్గం సులభం అవుతుందని పేర్కొంది. గుంతల ఫిర్యాదులపై ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవడమే కాకుండా తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి చెప్పేందుకు వీలు ఉంటుందని తెలిపింది. 

ఫిర్యాదులపై అధికారులు స్పందించి పరిష్కారం చూపేలా చూడాలని ఆదేశించింది. ఒకవేళ ఆలస్యమైతే ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో ఫిర్యాదుదాడికి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. కర్నాటక రాజధాని బెంగళూరులో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేసింది. రోడ్డు భద్రతపై 2022 మార్చి 29న సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ను అమలు చేయడం లేదంటూ హైదరాబాద్‌‌‌‌కు చెందిన కీతినేడి అఖిల్‌‌‌‌ శ్రీ గురుతేజ పిల్‌‌‌‌  దాఖలు చేశారు.

 పిటిషనర్‌‌‌‌  అడ్వొకేట్  చిక్కుడు ప్రభాకర్‌‌‌‌  వాదిస్తూ.. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో పడి ఎంతో మంది చనిపోతున్నారని, పలువురు గాయపడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మ్యాన్‌‌‌‌ హోల్స్‌‌‌‌లో పడి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. గుంతల వల్ల గంటకు ఒకరు మరణిస్తున్నారని, రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. 

ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్‌‌‌‌  జనరల్‌‌‌‌ మహమ్మద్‌‌‌‌  ఇమ్రాన్‌‌‌‌  ఖాన్‌‌‌‌  వాదిస్తూ.. రోడ్లపై గుంతల పూడ్చివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఈ బాధ్యత ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ బీ శాఖ నిర్వహిస్తోందన్నారు. వర్షాల కారణంగా గుంతల పూడ్చివేత చర్యలు చేపడట్టం కష్టమని, తర్వాత పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామన్నారు. ప్రమాదకర గుంతలను పూడ్చివేస్తున్నామని చెప్పారు. వాదనలు విన్న కోర్టు..  కేంద్ర, రాష్ట్ర, కార్పొరేషన్‌‌‌‌  అధికారులు సంయుక్తంగా గుంతలపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఈనెల 31న జరిగే విచారణ నాటికి హైదరాబాద్‌‌‌‌ పరిధిలో గుంతల వివరాలు, పూడ్చినవాటి గురించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.