
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీబీ) బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ కేసులు, అధికార పార్టీతో రాజకీయ సంబంధాలు ఉన్న వ్యక్తులను టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, పాలకమండలి సభ్యులు పోకల అశోక్, మల్లాడి కృష్ణారావు, కె.విద్యాసాగర్, ఏపీ నందకుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, అల్లూరు మల్లీశ్వరి, ఆర్.విశ్వనాథ్‌రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, కె.సంజీవయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బండి పార్థసారథి రెడ్డి, ఎన్.శ్రీనివాసన్, రాజేశ్ శర్మ, కేతన్ దేశాయ్, పి.సనత్‌కుమార్, జూపల్లి రామేశ్వరరావు, మిలింద్ కేశవ్ నర్వేకర్, ఎంఎన్ శశిధర్‌కు నోటీసులు ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ జీవోలు 568, 569ని సవాల్ చేస్తూ బీజేపీ నేత జి.భానుప్రకాశ్ రెడ్డి వేసిన పిల్ బుధవారం మరోసారి విచారణకు రాగా.. పిటిషనర్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా టీటీడీ పాలకమండలిలో 18 మంది సభ్యులను ప్రతివాదులుగా చేర్చామని అశ్వనీ కుమార్ కోర్టుకు తెలిపారు. వారిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను అనుబంధ పిటిషన్ ద్వారా ధర్మాసనం ముందు ఉంచామని, అందులోని వివరాలను పరిశీలించాలని కోరారు. దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వారిని పాలక మండలి సభ్యులుగా నియమించడానికి వీల్లేదన్నారు.