మోడీ పతనం కోసం వేచి చూస్తున్న రాహుల్

మోడీ పతనం కోసం వేచి చూస్తున్న రాహుల్

పనాజీ: రాబోయే మరికొన్ని దశాబ్దాల పాటు భారత్‌ను బీజేపీయే పాలిస్తుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. గోవాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీకే అక్కడ పర్యటించారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో పీకేకు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో గోవాలో కూడా తమ ప్రాభవం చూపేందుకు సిద్ధమైన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. ఐప్యాక్‌ సాయాన్ని తీసుకుంటున్నారు. అందుకే పీకే గోవా విజిట్ చేశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిచినా, ఓడినా దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రధాన శక్తిగా ఉంటుందన్నారు. బీజేపీని ఓడించడం అంత సులువు కాదన్నారు. 30 శాతం ఓట్లు చేతిలో ఉన్న పార్టీ ప్రాభవం ఎలా తగ్గుతుందని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు.

మరికొన్ని దశాబ్దాలు బీజేపీదే అధికారం

ప్రజలు మోడీపై కోపం, వ్యతిరేకతతో ఆయన్ను పక్కనబెట్టినా.. బీజేపీకి వచ్చే ప్రమాదం ఏమీ లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. వచ్చే కొన్ని దశాబ్దాల పాటు ప్రతిపక్షాలు బీజేపీపై పోరాటాన్ని సాగించాలన్నారు. మోడీని ప్రజలు ఎప్పుడు తిరస్కరిస్తారా అని రాహుల్ గాంధీ వేచి చూస్తున్నారని.. కానీ ఇది జరగట్లేదన్నారు. మోడీ ఎందుకు పాపులర్ అయ్యారు, ఆయన బలాబలాలు ఏంటనే దాన్ని అర్థం చేసుకోవడం కీలకమన్నారు. అప్పుడే ఆయనకు దీటైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. దేశ జనాభాలో మూడింట ఒకింత మంది బీజేపీకి మద్దుతుగా ఓటేస్తున్నారని.. మిగిలిన ఓట్లు 10 నుంచి 12 రాజకీయ పార్టీల మధ్య చీలిపోతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

ముగ్గురు మృతి: ఏడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ

ఇండియాను కాట్సా కిందికి తేవొద్దు

రూట్ మార్చిన డ్రగ్స్, గంజాయి గ్యాంగ్స్