లే ఔట్ రెగ్యులరైజేషన్​పై ఎందుకంత అత్యుత్సాహం?

లే ఔట్ రెగ్యులరైజేషన్​పై ఎందుకంత అత్యుత్సాహం?

లే ఔట్ రెగ్యులరైజేషన్​పై ఎందుకంత అత్యుత్సాహం?
అక్రమ నిర్మాణదారులకు లేని తొందర మీకెందుకు?
ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : అక్రమ నిర్మాణాలు, లేఔట్‌ క్రమబద్ధీకరణ చేసేందుకు రాష్ట్ర సర్కార్‌ ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నదని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలు చేసిన వాళ్లకు లేని తొందర ప్రభుత్వానికి ఎందుకని నిలదీసింది. రాష్ట్ర సర్కార్‌ క్రమబద్ధీకరణకు ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని కామెంట్లు చేసింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వాళ్ల విషయంలో ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందో అర్థం కావడం లేదని మండిపడింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్న కారణంగా సదరు అక్రమ నిర్మాణాలు, లేఔట్లపై తాము విచారణ చేయడం సబబు కాదని చెప్పింది.

అక్రమ నిర్మాణాల ను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం 2015లో ఇచ్చిన జీవో 152ను కొట్టేయాలని కోరుతూ దాఖలైన కేసులను తిరిగి విచారణ చేయాలని మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్​ కుమార్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను గురువారం చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. 1985 నుంచి 2015 మధ్యకాలంలో జరిగిన అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్‌ చేయాలనే జీవో 152 వెలువడిందన్నారు. ఇకపై అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఔట్లు వేయకుండా ఉండేలా చట్టాన్ని కఠినతరం చేశామన్నారు. అక్రమ లేఔట్లపై అనేక అప్లికేషన్లు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు.

గతంలో ఈ వ్యవహారంపై హైకోర్టు స్టే ఇచ్చిందని, రిట్లు సుప్రీం కోర్టుకు చేరాయని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు, సుప్రీంకోర్టులోని అంశంపై తాము ఎలా విచారణ చేయగలమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నందున సవరించిన మున్సిపల్‌ యాక్ట్, టీఎస్‌ పాస్‌ చట్టాలను అమలు చేయలేకపోతున్నట్లు ఏజీ తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును అడిగి చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈలోగా తాము విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం చెప్పే దాకా పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెడుతున్నట్లు వెల్లడించింది. విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసింది.