TSPSC : పక్కా లోకల్​ ప్రియారిటీ

TSPSC : పక్కా లోకల్​ ప్రియారిటీ

తెలంగాణ భౌగోళిక, ఆర్థిక అంశాలతోపాటు చరిత్ర, ఉద్యమం రాష్ట్ర అవతరణకు టీఎస్​పీఎస్​సీ పరీక్షల్లో అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని..  విశాల ఆలోచనా ధోరణితో సిలబస్‌‌ను అవగాహన చేసుకుంటే సులువుగా విజయం సాధించగలరని ప్రొఫెసర్ హరగోపాల్ అభ్యర్థులకు తన సలహాలు.. సూచనలు అందించారు.

గ్రూప్-–1 అభ్యర్థులు నాణ్యమైన మెటీరియల్‌‌‌‌ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. కోచింగ్ సెంటర్లు, మార్కెట్‌‌లోకి కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్న మెటీరియల్ పట్ల అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలుగు అకాడమీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఎన్‌‌సీఈఆర్టీ, ఎస్ఈఆర్‌‌టీ పుస్తకాలను చదవితే ప్రశ్నలు ఏ తీరులో వచ్చినా జవాబు ఇవ్వడానికి ఉపకరిస్తుంది. తెలంగాణపై జయశంకర్, అడపా సత్యనారాయణ వంటివారు రాసిన పుస్తకాలు చదవాలి.

భవిష్యత్తులో దేశం ఎటు వైపు ప్రయాణించాలో ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగంలో పొందుపర్చారు. పౌర హక్కులకు రాజ్యాంగంలో ప్రాధాన్యం ఇచ్చారు. వీటిని తాత్విక, సామాజిక కోణంలో అర్థం చేసుకున్న అభ్యర్థి ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలడు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌‌ గురించి మాత్రమే కాకుండా వాటి నేపథ్యం తెలుసుకుంటే మంచి మార్కులు వస్తాయి. 

తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం 

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌ ద్వారా ఎంపికయ్యే వారు రాష్ట్ర పరిధిలోనే అధికార బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని సిలబస్‌‌లో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాం. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, రాజకీయ నేపథ్యం, చరిత్రకు పెద్దపీట వేశాం. తెలంగాణ చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, లక్షణాలు- తెలంగాణ ప్రజలు, కులాలు, తెగలు, మతం, కళలు, హస్తకళలు, భాషలు, మాండలికాలు, జాతరలు, పండుగల గురించి తెలిసి ఉంటే కొత్తగా ఎంపికయ్యే ఉద్యోగులు  క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని ఆ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాం.

ప్రజల చరిత్రకు ప్రిపరెన్స్​

చరిత్ర రెండు రకాలు. 1. రాజులది, 2. ప్రజలది. టీఎస్‌‌పీఎస్సీ సిలబస్‌‌లో రాజుల చరిత్రకు కాకుండా ప్రజల చరిత్రకు ప్రాధాన్యత ఇచ్చాం. భారతదేశ చరిత్రలో సామాజిక, సంస్కృతికి పెద్దపీట వేశాం. ప్రాచీన చరిత్రలో మత ఉద్యమాలు, మధ్యభారత చరిత్రలో భక్తి ఉద్యమాలు, ఆధునిక చరిత్రలో సామాజిక ఉద్యమాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఆ మత, భక్తి, సామాజిక ఉద్యమాలు ఎందుకు వచ్చాయి? వాటి వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి? ఉద్యమాలతో సమా జంలో వచ్చిన మార్పులపై అధ్యయనం చేయడం ద్వారా మంచి మార్కులను సాధించవచ్చు. సామాజిక రుగ్మతలను అర్థం చేసుకోవాలిసమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 సిలబస్‌‌లో ప్రాధాన్యత ఇచ్చాం. జనరల్ స్టడీస్ పేపర్‌‌లో సామాజిక వర్జన/ వెలి, లింగ, కుల, తెగ, వికలాంగుల హక్కులు తదితర అంశాలు, సమ్మిళిత విధానాలు ఒక అంశంగా పొందుపర్చారు. భారతీయ సమాజం, సామాజిక సమస్యలు, తెలంగాణలో సామాజిక సమస్యలను లోతుగా అర్థం చేసుకొని చదవాలి. భారతదేశం, తెలంగాణలో సామాజిక విధానాలు, కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోవాలి.  

ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్​ ముఖ్యం  

పోటీ పరీక్ష ఏదైనా సరే ప్రీవియస్ పేపర్లను పరిశీలించడం చాలా ముఖ్యం. అప్పుడే ప్రశ్నల తీరు అర్థమవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో తొలి గ్రూప్-1 జరుగుతున్నది. ప్రీవియస్ పేపర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. యూపీఎస్సీ ప్రీవియస్​  ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్​ చేయడం మేలు.ప్రస్తుతం తెలుగు అకాడమీలో  ఆశించిన స్థాయిలో పుస్తకాల ముద్రణ జరగడం లేదు.   అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్ అందించడానికి ముందుకు రావాలని ఓపెన్ యూనివర్సిటీని కోరాం. వారు అనుభవజ్ఞులతో స్టడీ మెటీరియల్ అందిస్తే బాగుంటుంది.అంశం ఏదైనా సరే పైపైన చదవకుండా లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేయాలి. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి పూర్తి అధికారం పార్లమెంట్‌‌కే ఇచ్చారు. రాష్ట్రాల ఏర్పాటులో పార్లమెంట్‌‌కే పూర్తి అధికారాలు ఇవ్వడంపై రాజ్యాంగకర్తల ఉద్దేశం ఏమిటి? దాని వెనక ఉన్న చారిత్రక నేపథ్యం, దేశంలో విభిన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 3ను అధ్యయనం చేస్తే ప్రశ్న ఎలా ఇచ్చినా సమాధానం ఇవ్వడానికి వీలవుతుంది. 

అడిగింది రాయాలి 

పోటీ పరీక్షల్లో ప్రశ్నలను ట్విస్ట్‌‌ చేసి ఇస్తారు. ఈ విషయాన్ని అభ్యర్థులు సరిగ్గా గమనించరు. తెలిసిందంతా రాయాలనే ఉత్సాహం పరీక్షలో సరికాదు. పరీక్షలో అడిగింది రాయడమే ముఖ్యం. ప్రశ్నను రెండు మూడుసార్లు జాగ్రత్తగా చదవాలి. జవాబు రాసేటప్పుడు మధ్యలో ప్రశ్నను మరోసారి చదవాలి. అప్పుడే సమాధానం సరిగా రాస్తున్నది లేనిది అభ్యర్థికి తెలుస్తుంది. అడిగింది రాసిన అభ్యర్థులు పాసవుతారు. తమకు తెలిసిందంతా రాసిన అభ్యర్థులు అవకాశాన్ని కోల్పోతారు.