రోడ్డు కబ్జా చేసి గోడ నిర్మాణం

రోడ్డు కబ్జా చేసి గోడ నిర్మాణం

ఎల్​బీనగర్, వెలుగు : రోడ్డు కబ్జా చేసి ఓ ఆస్పత్రి యాజమాన్యం నిర్మించిన అక్రమ కట్టడాన్ని స్థానికులే కూల్చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ, బీజేపీ నేతల మద్దతుతో  కూల్చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హయత్​నగర్​లోని కృష్ణవేణి హాస్పిటల్ యాజమాన్యం బిజీగా ఉంటే రోడ్డును కబ్జా చేసి అక్రమంగా గోడ కట్టారని ఆరోపిస్తూ కాలనీ వాసులు సోమవారం ఓ జేసీబీతో వచ్చి ఆ గోడను కూల్చేశారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి వారికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హయత్​ నగర్​కు చెందిన రెండు ఆర్టీసీ బస్సు డిపోలకు చెందిన రోడ్డుతో పాటు కోర్టుకు వెళ్లే దారి, 18 కాలనీలకు రాకపోకలు జరిపే రోడ్డును కృష్ణవేణి ఆస్పత్రి యాజమాన్యం కబ్జా చేసిందని ఆరోపించారు.

కాలనీల వాసులు ఎన్ని సార్లు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి కబ్జాదారులకు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారన్నారు. కూల్చివేతల సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తోపులాటలో ఓ వ్యక్తి చేయి విరిగింది. ఆపై కాలనీ వాసులను, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి  పీఎస్​కు తరలించారు.