దసరా షాక్ : బంగారం రూ.60 వేలు

దసరా షాక్ : బంగారం రూ.60 వేలు

ఎక్కడో యుద్ధం మొదలైతే మన దేశంపై ప్రభావం చూపడం ఏంటి..? విచిత్రం కాకపోతే అని నిట్టూర్చకండి.. ఏ దేశంలో ఏదైనా అనుకోని పరిస్థితులు తలెత్తినా.. యుద్ధాలు జరిగినా.. అవి ఇతర దేశాలపై ప్రభావం చూపుతుండడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్​ యుద్ధం భారత్ పైనా ప్రభావం చూపుతోంది. అవును... ఇది నిజం. 

మన దేశంలో బంగారాన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండారు. ముఖ్యంగా మగువలకు గోల్డ్ అంటే చాలా ఇష్టం. పండుగ సమయాల్లో చాలామంది గోల్డ్​ ను కొనుగోలు చేస్తుంటారు. సెంటిమెంట్ దృష్ట్యా, పండగల సందర్భంగా, ఇంట్లో శుభకార్యాల వల్ల చాలామంది వారి స్థోమతను బట్టి గోల్డ్ లేదా వెండిని కొంటారు. 

దసరా-దీపావళి  పండగల సమయంలో అయితే బంగారం కొనుగోళ్లకు ఎక్కువమంది మొగ్గుచూపుతారు. దీపావళి ముందు వచ్చే ధన త్రయోదశిని శుభ ముహూర్తంగా భావించి బంగారం, వెండి ఆభరణాలు, విగ్రహాలు, వివిధ రూపుల్లో కొనుగోలు చేస్తుంటారు.

ఇప్పుడు  ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్​ యుద్ధం కారణంగా భారత్ లో గోల్డ్​ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్​ లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. రూ.60 వేల మార్కును దాటాయి. ఇజ్రాయెల్ సైనిక దళాలు గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున గోల్డ్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో చాలామంది ఇప్పుడు గోల్డ్​ పై ఇన్వెస్ట్ మెంట్​ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55 వేల 100గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేల 110గా ఉంది. హైదరాబాద్‌లో రానున్న ధన్‌తేరస్, దీపావళి పండుగ సీజన్‌లో బంగారం ధరల పెరుగుదల గోల్డ్​ ఆభరణాల అమ్మకాలపై ప్రభావం చూపనుంది. 

క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకునేదిగా, సురక్షిత పెట్టుబడిగా పసిడికి పేరుంది. అందుకే భవిష్యత్‌ అవసరాల కోసమూ కొనుగోలు చేస్తుంటారు. దేశీయ వార్షిక పసిడి గిరాకీలో దాదాపు 50 శాతం వివాహ వేడుకల నుంచే వస్తుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) చెబుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశీయంగా బంగారానికి గిరాకీ 10% తగ్గొచ్చని, మూడేళ్లలో ఇదే అత్యల్పమని అంటోంది. అధిక ధరలే ఇందుకు కారణమంటోంది. మొత్తంగా గోల్డ్​ ధరలు  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేలకు పైగా చేరొచ్చంటున్నారు.